యస్ బ్యాంక్ కేసులో రాణా కపూర్ లండన్ ఫ్లాట్ జప్తు

ABN , First Publish Date - 2020-09-25T23:11:28+05:30 IST

యస్ బ్యాంక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. యస్ బ్యాంక్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్‌కు చెందిన ఓ

యస్ బ్యాంక్ కేసులో రాణా కపూర్ లండన్ ఫ్లాట్ జప్తు

న్యూఢిల్లీ : యస్ బ్యాంక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. యస్ బ్యాంక్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్‌కు చెందిన ఓ ఫ్లాట్‌ను జప్తు చేసింది. రాణా కపూర్ మనీలాండరింగ్ నేరానికి పాల్పడినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే.


ఈడీ అధికారులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, యస్ బ్యాంక్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాణా కపూర్‌కు చెందిన ఓ ఫ్లాట్‌ను జప్తు చేశారు. దీని విలువ రూ.127 కోట్లు ఉంటుంది. దీనిని ఆయన 2017లో రూ.93 కోట్లకు కొన్నారు. దీనిని డీఓఐటీ క్రియేషన్స్ జెర్సీ లిమిటెడ్ పేరు మీద కొన్నారు. 


ఈ ఫ్లాట్‌ను అమ్మేందుకు ఓ కన్సల్టెంట్‌ను రాణా కపూర్ ఏర్పాటు చేసినట్లు, చాలా వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇచ్చినట్లు సమాచారం అందడంతో ఈడీ దీనిని జప్తు చేసింది. 


రాణా కపూర్‌పై ఈ ఏడాది మార్చిలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రెండు కేసులు నమోదు చేసింది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ (డీహెచ్ఎఫ్ఎల్)లో యస్ బ్యాంక్ 2018 ఏప్రిల్-జూన్ మధ్య రూ.3,700 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు, అందుకు ప్రతిఫలంగా రూ.600 కోట్లు ముడుపులు స్వీకరించినట్లు ఓ కేసులో ఆరోపించింది. రాణా కపూర్ భార్య బిందు డైరెక్టర్‌గా పని చేస్తున్న కంపెనీకి డీహెచ్ఎఫ్ఎల్ రుణం మంజూరు చేసినట్లు ఆరోపించింది. 


సీబీఐ నమోదు చేసిన మరొక కేసులో అవంత గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ థాపర్ వద్ద ఓ బంగళాను అతి తక్కువ ఖరీదుకు రాణా కపూర్, ఆయన భార్య బిందు  కొన్నట్లు ఆరోపించింది. 


సీబీఐ కేసుల ఆధారంగా మనీలాండరింగ్ నేరాలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు అనంతరం రాణా కపూర్, ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. 


ఈ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.2,011 కోట్లు. 


Updated Date - 2020-09-25T23:11:28+05:30 IST