
క్రిప్టో కరెన్సీ పేరుతో 1,200 కోట్ల మోసానికి పాల్పడ్డ కేసులో గఫూర్ అనే నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ‘మోరిస్ కాయిన్ క్రిప్టో కరెన్సీ’ అనే సంస్థ ద్వారా ఈ మోసం జరగగా, ఈ సంస్థలో గఫూర్ ప్రధాన స్టాకిస్ట్‌గా ఉన్నాడు. నిషద్ అనే వ్యక్తి బెంగళూరులో తనకున్న సంస్థల్లోకి అక్రమంగా పెట్టుబడులు తీసుకున్నాడు. తన సంస్థల్లో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే, రోజుకు 3-5 శాతం లాభాలొస్తాయని ఇన్వెస్టర్లను నమ్మించాడు. పెట్టుబడుల కోసం అతడు కొంతమంది స్టాకిస్టులను నియమించుకున్నాడు. వీళ్లలో గఫూర్ ఒకడు. అతడితోపాటు మరికొంతమంది సభ్యులు మల్టీలెవల్ మార్కెటింగ్ ద్వారా సభ్యుల్ని చేర్పించి, పెట్టుబడులు వచ్చేలా చేశారు. అలా 900 మంది సభ్యుల నుంచి దాదాపు రూ.1,200 కోట్లు అక్రమంగా వసూలు చేశారు. నిషద్ పథకం ప్రకారం అక్రమ పెట్టుబడులు వచ్చేలా చేయగా, దీనిలో గఫూర్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే, బాధితులకు ఎలాంటి క్రిప్టోకరెన్సీ అందజేయకపోవడంతో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మొత్తం లావాదేవీలపై విచారణ జరపగా, మోసం వెలుగులోకొచ్చింది. ఇప్పటికే ప్రధాన నిందితుడు నిషద్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ, తాజాగా గఫూర్‌ను అరెస్టు చేసింది. ఈ నెల 31 వరకు గఫూర్ ఈడీ కస్టడీలోనే ఉండనున్నాడు. కాగా, ఈడీ విచారణకు అతడు సహకరించడం లేదని అధికారులు అంటున్నారు.