ఈసీఆర్‌కు ‘కలైంజర్‌’ పేరు

ABN , First Publish Date - 2022-05-03T13:35:34+05:30 IST

స్థానిక తిరువాన్మియూరు నుంచి మహాబలిపురం వరకు ఉన్న ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు (ఈసీఆర్‌)కు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ ‘కలైంజర్‌’ కరుణానిధి పేరు పెట్టనున్నట్టు

ఈసీఆర్‌కు ‘కలైంజర్‌’ పేరు

అడయార్‌(చెన్నై): స్థానిక తిరువాన్మియూరు నుంచి మహాబలిపురం వరకు ఉన్న ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు (ఈసీఆర్‌)కు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ ‘కలైంజర్‌’ కరుణానిధి పేరు పెట్టనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. నగరంలో జరిగిన రాష్ట్ర రహదారుల శాఖ ప్లాటినం జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టాలిన్‌ ప్రసంగిస్తూ... రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం తాను ఎలాంటి సూచనలు చేయాలని భావించానో, వాటిని రహదారుల శాఖామంత్రి ఏవీ వేలు ముందుగానే గ్రహించి అమలు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్లాటినం జూబ్లి వేడుకలను పురస్కరించుకుని, కన్నియాకుమారిలో తిరువళ్లువర్‌ విగ్రహానికి - వివేకానంద్‌ రాక్‌పోర్టుకు మధ్య అద్దాల వంతెన, మదురై కోరిప్పాళయం జంక్షన్‌లో వంతెన నిర్మాణం, అడయారు-మధ్యకైలాస్‌ జంక్షన్‌లో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో అంతర్గత మౌలిక సదుపాయాలు మెరుగుపడటానికి ముఖ్య కారణం రహదారుల శాఖేనని చెప్పారు. 1954లో రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించి, ఈ తరహా రీసెర్చ్‌ సెంటరును ప్రారంభించిన రాష్ట్రంగా దేశంలోనే తమిళనాడు మొదటిస్థానంలో నిలిచిందన్నారు. ఈ పరిశోధనా కేంద్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని కోరుకుంటున్నానన్నారు. అలాగే, రాష్ట్ర రహదారుల అభివృద్ధి, పర్యవేక్షణ కోసం 1998లో తొలిసారి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శాఖను ఏర్పాటు చేసింది, తమను ఇంతవారిని చేసిందీ ముత్తమిళ్‌ కలైంజర్‌ అని గుర్తుచేశారు. ఈ ఒక్క శాఖనే కాదు అన్ని శాఖలను ఆయన అభివృద్ధి చేశారన్నారు. 1969లో ముఖ్యమంత్రిగా కలైంజర్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరంలో తొలిసారి అతిపెద్ద వంతెన అయిన జెమినీ బ్రిడ్జిని నిర్మించారని చెప్పారు. అది ఐదు రోడ్ల జంక్షన్‌గా ఉన్నప్పుడు తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్య ఏర్పడేదన్నారు. దీన్ని పరిష్కరించేలా ఈ వంతెన నిర్మించారని వెల్లడించారు. ఇది ఆసియాలో తొలి, మన దేశంలో మూడో గ్రేట్‌ సపోర్టర్‌ పరిజ్ఞానంతో నిర్మించిన వంతెన అని చెప్పారు.  తమిళనాడులో రోడ్డు భద్రత ప్రమాణాలు పక్కాగా అమలు చేస్తున్నారని, అందువల్ల అక్కడ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినట్టు కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారని సీఎం స్టాలిన్‌ గుర్తు చేశారు.  ఈ క్రెడిట్‌ అంతా రహదారుల శాఖకే దక్కుతుందన్నారు. వచ్చే నాలుగేళ్ళలో రాష్ట్రంలోని రహదారులను మరింతా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. అదేసమయంలో తిరువాన్మియూరు నుంచి మహాబలిపురం వరకు ఉన్న ఈసీఆర్‌ రహదారికి కలైంజర్‌ పేరును పెట్టనున్నట్టు సీఎం స్టాలిన్‌ వెల్లడించారు. ఈ కార్యాక్రమంలో మంత్రి ఏవీ వేలుతో పాటు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. 


ఆ వీధికి దివంగత వివేక్‌ పేరు ..

స్థానిక విరుగంబాక్కంలోని పద్మావతి నగర్‌ మెయిన్‌ రోడ్డుకు ‘వివేక్‌ రోడ్డు’గా పేరుపెట్టారు. ఆ ప్రాంతంలో వివేక్‌ తన కుటుంబంతో నివసించారు. అయితే, తన భర్త జ్ఞాపకార్థంగా ఈ మెయిన్‌ రోడ్డుకు ఆయన పెట్టాలని వివేక్‌ భార్య, కుమార్తెలు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇటీవల విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం ఆదేశాల మేరకు చెన్నై నగర పాలక సంస్థ అధికారులు స్పందించి పద్మావతి నగర్‌ మెయిన్‌ రోడ్డుకు ‘చిన్న కలైవానర్‌ వివేక్‌ రోడ్డు’ అనే పేరు పెట్టారు. ఈ మేరకు చెన్నై కార్పొరేషన్‌ ఆదివారం రాత్రి జీవో కూడా జారీచేసింది.  కాగా, వివేక్‌ తొలి వర్థంతి వేడుకలు గత నెల 17న నగరంలో జరిగిన విషయం తెల్సిందే. 


రాష్ట్రానికి కూడా కరుణానిధి పేరు పెడతారేమో?! 

 జయకుమార్‌ ఎద్దేవా

ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు పేరును ‘కరుణానిధి రోడ్డు’గా పేరు మార్పు చేయటాన్ని మాజీ మంత్రి డి.జయకుమార్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ధోరణిని చూస్తే తమిళనాడుకు కూడా కరుణానిధి పేరు పెడతారేమోనని ఎద్దేవా చేశారు. చెన్నైలో సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కశ్మీర్‌ నుంచి కన్నియాకుమారి దాకా ఉన్న ప్రజలకు ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు అంటే బాగా తెలుసని, విదేశీయులు కూడా ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు అంటే చట్టుక్కున గుర్తుపట్టగలరన్నారు. అలాంటి రోడ్డుకు కరుణానిధి పేరుపెట్టడం ఏమాత్రం తగదన్నారు. అధికారం ఉంది కదా అని అన్నాడీఎంకే పథకాలకు కొత్త పేర్లు పెట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజలంతా ఏవగించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో స్టాలిన్‌ కుటుంబ పాలనే కొనసాగుతోందని ఎద్దేవా చేసిన జయకుమార్‌ త్వరలో ఉదయనిధికి పట్టాభిషేకం జరుగుతుందని డీఎంకే నేతలే చెబుతున్నారన్నారు. అన్నాడీఎంకేలో సాధారణ కార్యకర్తకు కూడా సులువుగా పదవులు లభిస్తాయని, డీఎంకేలో కుటుంబ సభ్యులకే ఉన్నత పదవులు లభిస్తాయని జయకుమార్‌ విమర్శించారు. 





Read more