ఎన్‌కౌంటర్‌ మృతుడిది ఛత్తీస్‌గఢ్‌

ABN , First Publish Date - 2020-11-28T06:12:26+05:30 IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు కిశోర్‌ అలియాస్‌ మాస కబాసీ... ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా చంద్రమెట్టకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు కొరాపుట్‌ డీఐజీ సచిన్‌ అహ్మద్‌ తెలిపారు.

ఎన్‌కౌంటర్‌ మృతుడిది ఛత్తీస్‌గఢ్‌
ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు కిశోర్‌


స్వగ్రామం బస్తర్‌ జిల్లా చంద్రమెట్ట 

పట్టుబడిన మావోయిస్టు లైకాన్‌ అలియాస్‌ గొల్లోరి లక్ష్మణ్‌గా గుర్తింపు

కొరాపుట్‌ డీఐజీ వెల్లడి


సీలేరు, నవంబరు 27: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు కిశోర్‌ అలియాస్‌ మాస కబాసీ... ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా చంద్రమెట్టకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు కొరాపుట్‌ డీఐజీ సచిన్‌ అహ్మద్‌  తెలిపారు. శుక్రవారం మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎస్‌జడ్‌సీ మిలిటరీ ప్లటూన్‌ ఏసీఎంగా వ్యవహరిస్తున్న కిశోర్‌పై ఒడిశా ప్రభుత్వం గతంలోనే రూ.8 లక్షల రివార్డు ప్రకటించిందన్నారు. 2007లో మావోయిస్టు పార్టీలో చేరాడని, పలు విధ్వంస ఘటనల్లో పాల్గొన్నట్టు కేసులు ఉన్నాయన్నారు. కాగా గాయాలతో పట్టుబడిన మరో మావోయిస్టు లైకాన్‌ అలియాస్‌ గొల్లోరి లక్ష్మణ్‌గా గుర్తించామని, ఇతని స్వగ్రామం జోడంబోకు అని చెప్పారు. చికిత్స నిమిత్తంగా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. గురువారం ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశంలో మావోయిస్టులకు చెందిన ఏకే 47 తుపాకీ ఒకటి, ఏకె 47 మ్యాగ్జైన్లు మూడు, 7.62 ఎం.ఎం. ఏకే బాల్‌ రౌండ్లు 40, ఇన్‌సాస్‌ రైఫిల్‌ ఒకటి, ఐఈడీ ఒకటి, ఎలక్ర్టికల్‌  డిటోనేటర్లు 11, కమ్యూనికేషన్‌ సెట్లు 2, కెమెరా ఫ్లాష్‌ ఒకటి, ఇంకా పలు వస్తువులు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విలేకర్ల సమావేశంలో మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్‌ కిలారీ పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-28T06:12:26+05:30 IST