పచ్చటి లోకంలో విహరిద్దాం...

ABN , First Publish Date - 2021-07-04T21:42:44+05:30 IST

ఇప్పట్లో కరోనాకు ముగింపు పలకలేం. మహమ్మారి మనల్ని దయతలచి కాస్త విరామం ప్రకటించింది అంతే! అందుకే అందరం హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నాం.

పచ్చటి లోకంలో విహరిద్దాం...

ఇప్పట్లో కరోనాకు ముగింపు పలకలేం. మహమ్మారి మనల్ని దయతలచి కాస్త విరామం ప్రకటించింది అంతే! అందుకే అందరం హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నాం. ఈ కాస్త విరామంలో  అదేదో పచ్చని ప్రాంతాల్లోకెళ్లి గుండెల నిండా ప్రాణ వాయువును నింపుకుంటే మంచిది కదా! శరీరానికి బడలిక పోతుంది, మనసుకు సాంత్వన లభిస్తుంది. సముద్రతీర ప్రాంతాలు, సరస్సులు, కొండలు, అడవులు, పార్కులు... ఇవే ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తున్న టూరిజం. కరోనా జాగ్రత్తలు తీసుకుని.. ఇలా ఆరుబయటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఉపశమనం లభిస్తుంది... దీనినే ఎకో టూరిజం అంటున్నారు.. 


పర్యావరణం అంటే మనమేనా, ఈ భూమి మనకోసమేనా? కాదు... చెట్టూపుట్టా, గాలీనీరు, వాగూవంకా, కొండాకోనా, పిట్టా పిచికా... అన్నీ కలిస్తేనే ఆరోగ్యకరమైన పర్యావరణం. నిజంగానే,  అలాంటి పరిసరాల్లో బతుకుతున్నది ఎంత మంది? పట్టణవాసులకు ఆ రుచే తెలియదు. కాంక్రీటు అరణ్యంలో, అంతెత్తు బిల్డింగుల మధ్య కృత్రిమ జీవితం గడుపుతున్నారు. నగర జీవితం...ఏమంత సంతృప్తికరంగా లేదని అనేక పరిశోధనల్లో తేలింది. ఏసీ గదుల్లో నిద్రపోవచ్చు... ఆ గాలి చెట్టు నుంచి వచ్చినంత స్వచ్ఛమైంది కాదు. ఆ చల్లదనం... ప్రకృతి ఇచ్చింది కాదు. అప్పుడప్పుడైనా నిజమైన ప్రకృతి ఒడిలో విహరించాల్సిన అవసరం ఉందంటున్నారు ఆధునిక వైద్యులు. అందమైన సెలయేళ్లు, పచ్చని అడవులు, మేఘాలను తాకే కొండలు, గాలికి ఊగే పైర్లు... ఇదీ ప్రకృతంటే. ఆ పచ్చదనం మధ్య ఏడాదికోసారైనా గడిపితే మనసుకు ఆనందం, శరీరానికి నూతనోత్సాహం. సాగునీటి ప్రాజెక్టులు, భారీ జలాశయాలు, అభయా రణ్యాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు.. ఇవే ఎకో టూరిజానికి గమ్యస్థానాలు. 


ప్రకృతే... వైద్యశాల


పచ్చని ప్రకృతి ఆరోగ్యానికి చేసే మేలును ప్రాచీన ఆయుర్వేద వైద్యులు ఏనాడో కనిపెట్టారు. అందుకే, రెండువేలా అయిదు వందల ఏళ్ల క్రితమే పర్షియాను ఏలిన ‘సైరస్‌ ద గ్రేట్‌’ ఉద్యానాలకు చాలా ప్రాధాన్యమిచ్చాడు. పర్షియా (ఇప్పటి ఇరాన్‌) రాజధాని నగరంలో వీలున్న ప్రతిచోటా ప్రజలు సేదతీరేందుకు తోటలు నిర్మించాడు. అలసిన మనసుకు సాంత్వన పచ్చని మొక్కల మధ్యేనని నమ్మాడు. పదహారో శతాబ్దానికి చెందిన పరాసెల్సస్‌ అనే స్విస్‌ వైద్యుడు... వైద్యం మొదలైంది ప్రకృతి నుంచేననీ, వైద్యుడి నుంచి కానేకాదనీ ప్రబోధించాడు. ఇటీవల ఇంగ్లాండులోని మెడికల్‌ స్కూల్‌ విద్యార్థులు పదివేల మందిపై పరిశోధనలు చేశారు.  అందులో సగం మంది ప్రకృతికి చేరువగా జీవిస్తుండగా, మిగతావారు సిటీలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తక్కువ జీతం వస్తున్నా, కుటుంబ సమస్యలున్నా... పచ్చని పరిసరాల మధ్య నివసిస్తున్న వారు మానసికంగా చాలా దృఢంగా ఉన్నట్టు కనుగొన్నారు. డచ్‌లో చేసిన ఒక పరిశోధన ప్రకారం... పచ్చదనానికి దగ్గరగా జీవించేవారికి ఒత్తిడి, మైగ్రెయిన్‌, డిప్రెషన్‌ వంటి పదిహేను రకాల వ్యాధులు దూరంగా ఉంటాయని తేలింది. అంతేకాదు ఆసుపత్రులు, స్కూళ్లలో కూడా చెట్లు, మొక్కలు విరివిగా పెంచాలని అంటున్నారు. చికిత్స పొందుతున్న రోగి ఆసుపత్రి గది కిటికీ లోంచి పచ్చదనాన్ని చూస్తుంటే... అతడి ఆరోగ్యం త్వరగా కుదుటపడుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పచ్చని మొక్కల మధ్య తిరుగుతుంటే పిల్లల ప్రవర్తన సౌమ్యంగా మారుతుందని కూడా నిపుణులు గుర్తించారు. ఫిన్‌లాండ్‌లో డిప్రెషన్‌, ఆత్మహత్యల రేటు, ఆల్కహాల్‌కు బానిసైన వారి శాతం... చాలా చాలా ఎక్కువ. అందుకే ఆ దేశ ఆరోగ్య విధానంలో ప్రకృతి జీవితాన్నీ ఓ భాగం చేశారు. ప్రతి ఒక్కరు నెలకు అయిదుగంటలైనా ఉద్యానవనాలలో గడపాలని నియమం పెట్టారు. దీనివల్ల దేశ ప్రజల మానసిక ఆరోగ్యం బావుంటుందని వారి నమ్మకం. ప్రజల మనసు బావుంటేనే, దేశం మనసూ బావుంటుంది. 


బీచ్‌లు, సరస్సుల చెంతన.. 


ప్రస్తుతం కరోనా కాలం. కిక్కిరిసిన జనం మధ్య తిరగకూడదు. కాబట్టి జనసమ్మర్ధం ఎక్కువగా లేని కొండ ప్రాంతాలు, సముద్రతీరాలు, సరస్సులను ఎంచుకోవడం ఉత్తమం. అందుకే ఎకో టూరిజం ప్రాధాన్యతను సంతరించుకుంది. పచ్చపచ్చని పర్యాటక ప్రాంతాలకు రాకపోకలు పెరిగాయి. మనదేశంలో ప్రణాళికా బద్ధంగా నిర్మించిన మొదటి ఎకో టూరిజం ప్రాంతం కేరళలోని ‘తెన్మెల’. కొల్లామ్‌ జిల్లాలోని ఈ ప్రాంతాన్ని ఏటా వేల మంది వీక్షిస్తారు. అక్కడ చెట్ల మధ్య నడుస్తారు. సరస్సుల ఒడ్డున సేదతీరుతారు. బోటింగ్‌, రోప్‌ బ్రిడ్జి, రాక్‌ క్లైంబింగ్‌, బైకింగ్‌ ఇలా అనేక సాహసక్రీడలు ఆడుకుంటారు. కేరళలోని నేషనల్‌ పార్కు, మున్నార్‌లోని టీ తోటలు, తమిళనాడులోని కొడైకెనాల్‌, కర్ణాటకలోని కూర్గ్‌, బండిపురా నేషనల్‌ పార్కు, ఒడిశాలోని చిలుకా సరస్సు, అస్సాంలోని కజిరంగా నేషనల్‌ పార్కు, నాగాలాండ్‌లోని కోహిమా, లడక్‌లోని పర్వత సానువులు... పర్యావరణ పర్యటనకు చిరునామాలే. కరోనా రెండో దశ తగ్గుముఖం పట్టింది కాబట్టి...వీటిలో కొన్నింటిని చూసే అవకాశం వచ్చింది. 


తెలంగాణలో...


ప్రకృతి అందాలకు నెలవు తెలుగు రాష్ట్రాలు. ఇన్నాళ్లూ కరోనా కారణంగా అన్నీ మూతపడిన పరిస్థితి. ఇప్పుడే లాక్‌డౌన్‌ తొలగించారు కాబట్టి మాస్కులు ధరించి వెళ్లొచ్చు. తెలంగాణలోని అటవీప్రాంతం, జలపాతాలు, అందమైన సరస్సులు ఎకో టూరిజానికి గమ్యస్థానాలుగా విలసిల్లుతున్నాయి. వరంగల్‌ జిల్లాలోని లక్నవరం సరస్సు మంచి పర్యాటక ప్రాంతం. సరస్సు చుట్టూ ఉన్న పచ్చని గుట్టలు, వేలాడే వంతెన కంటికి హాయిగా, మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తాయి. మేడారం, తాడ్వాయి, మల్లూరు స్ర్పింగ్‌ వాటర్స్‌ (చింతామణి జలపాతం), ఖమ్మంలోని బొగతా జలపాతాలు, నల్లమల అడవిలోని మల్లెల తీర్థం... పర్యాటకుల మనసులను దోచే ప్రాంతాలే. తెలంగాణ నయాగరాగా పిలిచే కుంటాలా జలపాతం ఈ వర్షాకాలం పర్యాటకులను ఆకర్షించనుంది. 


ఆంధ్రా అందాలు...


సముద్రతీర ప్రాంతానికి, గోదావరి పరీవాహక సౌందర్యానికి చిరునామా ఆంధ్రప్రదేశ్‌. రాష్ట్రంలో ప్రముఖ ఎకో టూరిజం స్పాట్‌ అరకులోయ. అక్కడి ప్రకృతి సౌందర్యం కనువిందు చేస్తుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు పూర్తిగా సడలించాక పర్యటించవచ్చు.   కర్నూలు జిల్లాలోని బెలూమ్‌ గుహలు, పాపికొండలు పర్వతశ్రేణి, చిత్తూరు జిల్లాలోని తలకోన అభయారణ్యం, విశాఖలోని మారేడుమిల్లి అడవి, కాకినాడలోని హోప్‌ఐలాండ్‌, తిరుమలలోని శిలాతోరణం... అన్నీ ప్రకృతి రమణీయతకు సాక్ష్యాలే.   


స్థానిక పర్యాటకం జోరందుకుంది..


ఎకో టూరిజానికి పెద్ద దిక్కు నల్లమల అడవి. వన్యమృగాలకు, జలపాతాలకు, పచ్చదనానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఇది. నల్లమలలో కొన్ని చోట్ల రిసార్టులు కూడా కట్టారు. కర్నూలు జిల్లాలోని పచ్చెర్ల, బైర్లూటి వద్ద ఎకో టూరిజం క్షేత్రాన్ని నిర్మించారు. నల్లమల అడవిలోకి తీసుకెళ్లే జంగిల్‌ క్యాంప్‌ ద్వారం మొదట స్వాగతం పలుకుతుంది. లోపలికి వెళ్లగానే... నల్లమల అందాలు తిలకించవచ్చు. బైర్లూటి ప్రాంతంలో పది కిలోమీటర్ల మేర సఫారీ ట్రాక్‌ ఉంటుంది. ఇంకా లోపలికి వెళితే టైగర్‌ జోన్‌, దేవరాయల కాలం నాటి దేవాలయం, కోనేర్లు దర్శనమిస్తాయి. ఎన్నో రకాల ఔషధ మొక్కలు, అరుదైన వృక్షాలతో నల్లమల ఆరోగ్యకరమైన గాలిని అందిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో లాక్‌డౌన్‌ను సడలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా నిబంధనలు ఉన్నాయి. స్థానికులు మాత్రమే సమీప పర్యటక కేంద్రాలను చుట్టొచ్చే వీలుంది. 

Updated Date - 2021-07-04T21:42:44+05:30 IST