ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎకోప్రాజెక్ట్‌

ABN , First Publish Date - 2021-09-05T17:45:36+05:30 IST

తీరానికి చేరువలో..

ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎకోప్రాజెక్ట్‌

అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్‌ విజయకుమార్‌ 


బాపట్ల: తీరానికి చేరువలో అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎకోటూరిజం ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసినట్లు అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్‌ విజయకుమార్‌ తెలిపారు. బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలోని ఎకోటూరిజమును శనివారం ఆయ న అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీరంలో అద్భుతమైన ప్రాజెక్ట్‌ రూపకల్పన జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసేందుకు అటవీశాఖాధికారు లు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎకోప్రాజెక్ట్‌ పేరుతో పర్యాటకుల కోసం దీనికి రూపకల్పన చేశామన్నారు. సూర్యలంకతీరంలో పర్యాటకుల కు ప్రకృతి అందాలు కనువిందు చేసేలా ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ ఆధ్వ ర్యంలో ఈప్రాజెక్ట్‌ రూపుదిద్దుకుందన్నారు. రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా దివాన్‌చెరువు, గుంటూరు జిల్లాలోని బాపట్ల సూర్యలంక తీరాన్ని 2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఫైలెట్‌ ప్రాజెక్ట్‌గా ప్రకటించిందన్నారు. అందులో భాగంగా ఎకోప్రాజెక్ట్‌ను సూర్యలంకరోడ్డులో ఆదర్శనగర్‌ వద్ద ఏర్పాటు చేశామన్నారు. దట్టమైన జీడిమామిడితోటలో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


పర్యాటకరంగానికి పెద్దపీట వేస్తూనే వాతావరణ సమతుల్యాన్ని కాపాడేలా ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దాలని సంకల్పించామన్నారు. సముద్రతీరానికి విచ్చేసే పర్యాటకుల కోసం ఇక్కడ వసతి సౌకర్యాలు, అందమైన పూలతోటల సోయగాలు, ప్రకృతి రమణీయత, పర్యాటకులని పరవశింప చేసే అద్భుతమైన గార్డెన్‌, జీడితోటల చల్లటినీడలో ఆహ్లాద పరిచే వివిధ నిర్మాణాలు, కనువిందు చేసే 39రకాల చెట్లు ఈ ప్రాజెక్ట్‌లో నిత్యం కనువిందు చేస్తాయన్నారు. అందమైన వాతావరణంతోపాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే చెట్లను కూడా పెంచాలని నిర్ణయం తీసు కున్నామన్నారు. ఈ పర్యాటక ప్రాజెక్ట్‌లో ప్రకృతి అందాలతోపాటు అవస రమైన అన్ని వసతులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు  విజయకుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ఈప్రాజెక్ట్‌లో 7 గదులు మాత్రమే పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 10గదులు అదనం గా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రాజెక్ట్‌పరిధిలో జీడిమామిడితోటలను విరివిగా పెంచాలని నిర్ణయించామన్నారు. ఇదొక ప్రకృతి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల అటవీశాఖ డీఎం కోనజయశ్రీ, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ చినబాపయ్య, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-09-05T17:45:36+05:30 IST