రాబడులు, లాభాలకు లాక్‌డౌన్‌ గండి

ABN , First Publish Date - 2020-04-06T06:03:36+05:30 IST

కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాబడులు భారీ స్థాయిలో తగ్గే అవకాశం ఉందని మెజారిటీ కంపెనీలు...

రాబడులు, లాభాలకు లాక్‌డౌన్‌ గండి

  • పరిశ్రమపై తీవ్ర ప్రభావం
  • ఉద్యోగాలు గల్లంతు
  • సీఐఐ సీఈఓ సర్వేలో వెల్లడి 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాబడులు భారీ స్థాయిలో తగ్గే అవకాశం ఉందని మెజారిటీ కంపెనీలు భావిస్తున్నాయి. డిమాండ్‌ ఇప్పటికే కుప్పకూలిపోయింది. ప్రతికూల పరిణామాల ప్రభావంతో ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశం ఉందని సీఐఐ సీఈఓ స్నాప్‌ పోల్‌లో వెల్లడైంది. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన దాదాపు 200 మంది సీఈఓ (చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)లు పాల్గొన్నారు. సర్వే ఫలితాల ప్రకారం.. జనవరి-మార్చి త్రైమాసికం, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికాల్లో రాబడుల్లో 10 శాతానికిపైగా, లాభాల్లో 5 శాతానికి పైగా తగ్గుదలకు అవకాశం ఉందని మెజారిటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. దేశీయ కంపెనీలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం వల్ల జీడీపీ వృద్ధిపైనా ప్రభావం పడనుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది.


 ఇక ఉద్యోగాల విషయానికి వస్తే.. వివిధ రంగాల్లో ఉద్యోగాలు పోవడానికి అవకాశం ఉందని 52 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. కరోనా వైరస్‌ విస్తరణ, లాక్‌డౌన్‌ ఇందుకు కారణమవుతోంది. దశల వారీగా ఉద్యోగాల కోత ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. 15 శాతానికన్నా తక్కువగా ఉద్యోగాలు గల్లంతవుతాయని 47 శాతం కంపెనీలు భావిస్తుండగా.. 15-30 శాతం ఉద్యోగాల నష్టం ఉంటుందని 32 శాతం కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు తమ ఇన్వెంటరీ ఎలాంటి ఉపయోగం లేకుండా ఉందని 80 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. తమ స్టాక్‌ నెల రోజుల వరకు ఉంటుందని 40 శాతానికి పైగా కంపెనీలు తెలిపాయి. 


రికవరీపై అనిశ్చితి

లాక్‌డౌన్‌ తర్వాత డిమాండ్‌లో మందగమనం ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. కాగా అత్యవసర ఉత్పత్తులు తయారు చేస్తున్న కంపెనీలు, అనుబంధ ఉత్పత్తులను సప్లయ్‌ చేస్తున్న సంస్థలు లాక్‌డౌన్‌ మూలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పని చేసే వారి లభ్యత, ఉత్పత్తులను ఒక చోట నుంచి మరొక చోటకు చేర్చడం ఇబ్బందికరంగా ఉంటోందని పేర్కొన్నాయి. అత్యవసరమైన సరుకుల తయారీ లేదా నిల్వ, రవాణతో పాటు రిటైల్‌ అమ్మకాల్లోనూ అవరోధాలు ఎదురువుతున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రభు త్వం ఆకస్మికంగా లాక్‌డౌన్‌ను విధించిన కారణంగా పరిశ్రమ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడిందని, రికవరీపై అనిశ్చితి నెలకొందని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ తెలిపారు. పరిశ్రమ కోలుకోవడంలో జాప్యం జరిగితే ఎంతో మంది జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పరిశ్రమకు ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని  ప్రకటించడమే కాకుండా దాన్ని వేగవంతంగా అమలు చేయాలని బెనర్జీ కోరారు. 





Updated Date - 2020-04-06T06:03:36+05:30 IST