ప్రభుత్వ రంగంతోనే ఆర్థిక స్వావలంబన

ABN , First Publish Date - 2020-11-19T05:59:07+05:30 IST

దేశప్రగతిలో ప్రభుత్వ రంగం ముఖ్య భూమిక పోషిస్తోంది. మన ప్రభుత్వరంగ సంస్థలు ప్రజల ఆస్తులు. వీటిలో కీలకమైంది భారతీయ రైల్వేలు...

ప్రభుత్వ రంగంతోనే ఆర్థిక స్వావలంబన

దేశప్రగతిలో ప్రభుత్వ రంగం ముఖ్య భూమిక పోషిస్తోంది. మన ప్రభుత్వరంగ సంస్థలు ప్రజల ఆస్తులు. వీటిలో కీలకమైంది భారతీయ రైల్వేలు. ప్రపంచంలోనే తక్కువ ఛార్జీలతో ప్రజలకు సేవ చేసే రైల్వే రంగాన్ని ప్రైవేటీకరించి కార్పొరేట్‌ కంపెనీల లాభాపేక్షకు సాధనాలుగా మార్చాలనేది ప్రస్తుత విధానం. త్వరలో ప్రైవేట్ రైళ్ళను పట్టాలెక్కించనున్నారు. మన దేశ బీమా మార్కెట్‌లోకి పలు ప్రైవేటు, బహుళజాతి కంపెనీలు ప్రవేశించిన నేపథ్యంలో అనేక విపత్కర పరిస్థితులను దీటుగా ఎదుర్కొని ప్రభుత్వరంగంలోని ఎల్ ఐ సి, బీమా మార్కెట్‌లో ప్రతి సంవత్సరం 70 శాతానికి పైగా మార్కెట్‌ వాటాను కైవసం చేసుకుని మార్కెట్‌ కమాండర్‌గా నిలిచింది. అద్భుత ప్రగతి సాధిస్తూ ‘ప్రజల సొమ్ము –- ప్రజా సంక్షేమానికే’ అనే లక్ష్యంతో సామాజిక సేవకు అంకితమైంది. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే, క్లైయిముల పరిష్కారంలో ఎల్‌.ఐ.సి. ప్రపంచ రికార్డ్‌ నెలకొల్పింది. అటువంటి అత్యున్నత సంస్థ ఎల్‌.ఐ.సి. పై ప్రభుత్వ దృష్టి పడింది. ఎల్‌.ఐ.సిలోని ప్రభుత్వ వాటాలను ఉపసంహరించి స్టాక్‌ మార్కెట్‌కు తరలిస్తారట. రోడ్లు, రైల్వేస్‌, హౌసింగ్‌, విద్యుత్‌, ఇరిగేషన్‌ వంటి కీలక రంగాలకు నిధులందించే బీమా సంస్థ ఎల్‌.ఐ.సి.ని ప్రైవేటీకరిస్తే దేశ ప్రగతికి పెద్ద ఆటంకం కదా! ప్రభుత్వరంగ సంస్థలు ప్రజా ప్రయోజనాల కోసం ఆవిర్భవించిన సంస్థలని, అవి ఆధునిక దేవాలయాలని ఆనాడు పండిట్‌ నెహ్రూ భావిస్తే, ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం అటువంటి సంస్థలను బడా కార్పొరేట్లకు ధారాదత్తం చేయడం సరైన ఆర్థిక విధానమా? ప్రజల శ్రేయస్సును నేటి పాలకులు ఎందుకు విస్మరిస్తున్నారు? 


నవరత్న మహారత్నాలుగా పేరొందిన ఓఎన్‌జిసి, ఎన్‌టిపిసి, కోల్‌ ఇండియా లిమిటెడ్‌ వంటి పలు సంస్థలలో ప్రభుత్వ వాటాలను అమ్మేశారు. ప్రభుత్వరంగంలోని సాధారణ బీమా సంస్థలను, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వంటి సంస్థలను ప్రైవేటీకరించాలని, దేశంలోని విశ్వ విద్యాలయాలకు ఆర్థిక వనరులు సమకూర్చే యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ (యు.జి.సి) రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చివరకు ఢిల్లీలోని ఎర్రకోట నిర్వహణను కూడ దాల్మియా గ్రూప్‌కు అప్పజెప్పేశారు. బొగ్గు, బాక్సైట్‌, ఇనుపఖనిజం, గ్యాస్‌ వంటి ప్రకృతి వనరులను బడా పెట్టుబడిదారుల హస్తగతం చేస్తే ఆర్థిక స్వావలంబనకు అర్థం ఏముంటుంది? బ్రిటిష్‌ పాలకుల నుండి స్వాతంత్య్రం కోసం ఎందుకు పోరాడాం? కోట్లాది ప్రజల ప్రయోజనాల కోసమా? లేక అంబానీ, అదానీల వంటి కొద్దిమంది కోసమా? ఏ ఆర్థిక విధానాలను అమలు చేసి కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రజల తిరస్కారానికి గురైందో, అవే విధానాలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మరింత దూకుడుగా అమలు చేస్తోంది. ప్రభుత్వరంగ పాత్రను కుదించేందుకుగాను ప్రణాళికా సంఘాన్ని కూడ రద్దు చేశారు. ప్రజా సంక్షేమం కంటే కార్పొరేట్ల శ్రేయస్సే మా సిద్ధాంతమని స్పష్టంగా తేల్చేశారు. 


దేశ సమగ్రాభివృద్ధికి, ఆర్థిక సుస్థిరతకు బలమైన ప్రభుత్వరంగమే ముఖ్యమైన సాధనం. ‘సబ్‌ కా సాత్‌ –- సబ్‌ కా వికాస్‌’, ఆత్మ నిర్భర్‌ భారత్‌ వంటి లక్ష్యాలు నెరవేరాలంటే ప్రత్యామ్నాయ, ప్రజానుకూల ఆర్థిక విధానాలు అమలుపరచాలి. లేనిపక్షంలో అవి ఒట్టి నినాదాలుగానే మిగిలిపోతాయి. ఈ నెల 26వ తేదీన పలు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు తలపెట్టిన జాతీయ సమ్మె ‘నూతన భారత్‌’ నిర్మాణానికై జరిగే పోరాటంలో భాగమే. ఈ సమ్మెకు దేశ ప్రజల మద్దతు, వారి సహకారం కూడా అవసరం.

వీవీకే సురేష్‌

సంయుక్త కార్యదర్శి

ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ 

యూనియన్‌–మచిలీపట్నం డివిజన్‌

Updated Date - 2020-11-19T05:59:07+05:30 IST