వస్తుసేవల పన్ను వసూళ్లు నెల నెలా పెరుగుతున్నాయి. షేర్ మార్కెట్ పుంజుకుంటోంది. రూపాయి విలువ స్థిరంగా ఉంది. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ వెలుగొందుతోంది. శీఘ్ర అభివృద్ధి సాధనలో భారత ఆర్థికవ్యవస్థే అగ్రగామిగా ఉందని కూడా అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు గుర్తించాయి. అయినా నిరుద్యోగిత దేశం ఎదుర్కొంటున్న అత్యంత సంక్లిష్ట సమస్యలలో ఒకటిగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ సమస్య మూలాలు నీతిఆయోగ్ ఆలోచనాసరళిలో ఉన్నాయి. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలను పురస్కరించుకుని జాతి భావి ప్రస్థానం విషయమై నీతిఆయోగ్ 2018లో ఒక దార్శనిక పత్రాన్ని ప్రకటించింది. అది దేశం ముందు రెండు లక్ష్యాలను ఉంచింది. అవి: శ్రమసాంద్ర ఉత్పత్తిని పెంపొందించడం, శ్రమశక్తి క్రమబద్ధీకరణను ప్రోత్సహించడం.
శ్రమశక్తి క్రమబద్ధీకరణ ఏమిటి? వీధి మొగదలల్లో మోమో (రొట్టెల పిండితో మాంసం, చేపలు లేదా కూరగాయలను కలిపి తయారు చేసే నేపాలీ, టిబెటన్ లేదా ఉత్తర భారతీయ వంటకాలు) విక్రయదారులనే తీసుకోండి. వారు స్వయం ఉపాధిపరులు. తమ శ్రమశక్తిపై ఆధారపడి బతుకుతున్నవారు. ఎవరికివారేగా కాకుండా వారందరినీ ఒక క్రమబద్ధ వ్యవస్థలో భాగస్వాములను చేయడమే శ్రమశక్తి క్రమబద్ధీకరణ. సమస్యేమిటంటే ఇటువంటి క్రమబద్ధీకరణతో కార్మికవ్యయాలు పెరుగుతాయి. ఉదాహరణకు వీథివ్యాపారం చేసుకుంటున్న మోమో తయారీదారులతో ఒక లాంఛనప్రాయ సంస్థను ఏర్పాటు చేశారనుకుందాం. అప్పుడు ఆ సంస్థ ప్రభుత్వ నిబంధనలకు లోబడి పని చేయవలసి ఉంటుంది. ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించి చట్టం నిర్దేశించిన నిబంధనలను అనుసరించి తీరాలి. ఉత్పత్తుల్లో నాణ్యత ఉండాలి. సహాయకారులుగా ఉండే సిబ్బందికి కనీస వేతనాన్ని తప్పకుండా చెల్లించి తీరాలి. దీనివల్ల మోమోల ఉత్పత్తివ్యయం పెరిగిపోతుంది. మరో వాస్తవం ఏమిటంటే మోమో తయారీ దుకాణాలలో డిష్ వాషర్స్, ఆటోమెటిక్ ఓవెన్లను ఉపయోగించడం వల్ల పనివాళ్లను పెద్దసంఖ్యలో ఉపయోగించుకోవలసిన అవసరముండదు. చెప్పవచ్చిన దేమిటంటే శ్రమశక్తి క్రమబద్ధీకరణ అంతిమంగా కార్మికవర్గ ప్రయోజనాలకు ప్రతికూలతలను సృష్టిస్తుంది. ఆర్థికవ్యవస్థ మరింతగా పెట్టుబడి సాంద్ర ఉత్పత్తి పద్ధతులను అనుసరించడాన్ని అనివార్యం చేస్తుంది. ఇది నిరుద్యోగాన్ని పెంచుతుంది. ఈ వాస్తవాన్నే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తావించారు.
నోట్ల రద్దు, జీఎస్టీ ఈ సమస్యను అధిగమించడానికి తోడ్పడలేదు. నోట్ల రద్దు తరువాత రెండునెలల పాటు స్వతంత్ర వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ముప్పైఏళ్లుగా ఎంబ్రాయిడరీ పని తనకు జీవనోపాధిగా ఉన్నదని నోట్ల రద్దు బాధితుడైన ఓలా డ్రైవర్ ఒకరు నాకు చెప్పాడు. ముగ్గురు మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్న తాను నోట్లరద్దుతో నగదు రూపేణా ఆర్జన లేక సమస్యల్లో పడ్డానని, చివరకు డ్రైవింగ్‌ను జీవనాధారంగా చేసుకున్నానని అతడు వివరించాడు. శ్రమశక్తి క్రమబద్ధీకరణ అనేది శ్రమ సాంద్ర ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. ఫలితంగా నిరుద్యోగిత పెరిగిపోతుంది. నిరుద్యోగ సమస్య నెదుర్కోవడం 2022 సంవత్సరంలో ఆర్థికవ్యవస్థ సవాళ్లలో ప్రధానమైనది. రెండో సవాల్ పర్యావరణపరమైనది. ఇటీవల టమాట ధర ఇతోధికంగా పెరిగిపోయింది. భూతాపం వల్ల పంటకు ఎనలేని నష్టం జరిగిన ఫలితంగానే దాని ధర పెరిగిపోయింది. భూతాపం, వల్ల పంటలకు హాని ప్రపంచవ్యాప్త పరి ణామం. దాన్ని అరికట్టడమనేది మన దేశ ప్రభుత్వానికి సాధ్యమయ్యే పని కాదు. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం చేయగలిగేది కూడా ఉంది. ఉదాహరణకు థర్మల్ విద్యుత్కేంద్రాలు వెలువరించే కాలుష్యకారక ఉద్గారాల విషయంలో నిబంధనలను ప్రభుత్వం ఇటీవల బలహీనపరిచింది. థర్మల్ విద్యుత్కేంద్రం ఉద్గారాల వల్ల వాయుకాలుష్యాన్ని అనుమతిస్తే కాలుష్య నియంత్రణ యంత్రాల వ్యయం ఉండదని, ఫలితంగా విద్యుత్ చౌకగా ఉత్పత్తి అయి, ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందనేది ప్రభుత్వ ఆలోచన. ఇది నిజమే అయినప్పటికీ అనుమతిస్తున్న కాలుష్యం వల్ల ఆర్థికవ్యవస్థకు మూడు విధాల నష్టం జరుగుతుందనే వాస్తవాన్ని కూడా మనం విస్మరించకూడదు.
మొదటి నష్టం- భూతాపం పెరిగిపోవడం. దీనివల్ల ఆర్థికవిపత్తులు మరింత ఎక్కువగా సంభవిస్తాయి. బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం భారీమొత్తాలను వెచ్చించవలసి ఉంది. ఇటువంటి నష్టపరిహారాల చెల్లింపులే తమ 2021–22ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై ఎనలేని భారాలు మోపాయని మహారాష్ట్ర మంత్రి ఒకరు నాకు చెప్పారు. రెండో నష్టం- టమాట లాంటి నిర్దిష్ట పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. అది నేరుగా ఆర్థికాభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. స్థూల దేశీయోత్పత్తిలో ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయిన వ్యవసాయరంగ వాటా మరింతగా తగ్గిపోతుంది. దీంతో పాటు టమాట ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ద్రవ్యోల్బణం తప్పకుండా అధికమవుతుంది. మూడో నష్టం- పలు రకాల కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యభద్రతా వ్యయాలు అమితంగా పెరిగిపోవడం. ఉత్తరప్రదేశ్‌లో సింగరౌలి ప్రాంతంలోని ప్రజలు రొమ్ము పడిశం, కేన్సర్ మొదలైన వ్యాధుల బారిన పడుతున్నారు. పలు థర్మల్ విద్యుత్కేంద్రాలకు నెలవు అయిన సింగరౌలిలో వాయుకాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయినందునే ప్రజారోగ్యానికి తీవ్రహాని జరుగుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ప్రజల ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోతోంది. ఆయా వ్యాధుల చికత్సకు అవుతున్న వ్యయం వారిపై పెను ఆర్థికభారాన్ని మోపుతోంది. బలహీన కాలుష్య నియంత్రణ విధానాల లాభనష్టాలను శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేయడం ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లలో ముఖ్యమైనది.
భరత్ ఝున్‌ఝున్‌వాలా
(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్)