Abn logo
Jun 3 2020 @ 00:21AM

వృద్ధి అవశ్యం!

 • మళ్లీ ప్రగతి పథంలోకి భారత్‌
 • లాక్‌డౌన్‌లో చేపట్టిన చర్యలు దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదం
 • మున్ముందు మరిన్ని సంస్కరణలు
 • ప్రపంచం కోసం భారత్‌లో తయారీ
 • సీఐఐ సదస్సులో ప్రధాని మోదీ 


న్యూఢిల్లీ:  కరోనా సంక్షోభాన్ని తట్టుకుని భారత్‌ మళ్లీ ప్రగతి పట్టాలెక్కడం అవశ్యమని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ‘అన్‌లాక్‌ 1’ దశ నుంచే వృద్ధిని తిరిగి సాధించే ప్రక్రియ మొదలైందని.. దేశ సామర్థ్యం, సంక్షోభ నిర్వహణ దక్షతపై తనకు నమ్మకం ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యాల్లో ఒకటని.. లాక్‌డౌన్‌ సమయంలో చేపట్టిన సంస్కరణలు దేశానికి దీర్ఘకాలంలో దోహదపడనున్నాయని  పేర్కొన్నారు. వృద్ధి గతిని మార్చేలా ప్రభుత్వం మున్ముందు మరిన్ని సంస్కరణలు చేపడుతుందని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో వృద్ధి భారీగా క్షీణించనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ భారత పరపతి రేటింగ్‌ను తగ్గించింది. మరుసటి రోజునే దేశ ఆర్థిక వృద్ధిపై ప్రధాని ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 125వ వార్షిక సదస్సులో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా మోదీ ప్రసంగించారు. కీలక రంగాల్లో స్వావలంబన కోసం అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 


స్వావలంబన, వృద్ధికి మోదీ మంత్ర 

 • ఇంటెంట్‌ (సంకల్పం)
 • ఇంక్లూజన్‌ (సమ్మిళితం)
 • ఇన్వె్‌స్టమెంట్‌ (పెట్టుబడి)
 • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (మౌలిక వసతులు)
 • ఇన్నోవేషన్‌ (ఆవిష్కరణ) 1. భారత కార్పొరేట్‌ రంగం ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకుని నిలబడాలి. ఈ కఠిన సమయంలో  గ్రామీణ భారతాన్ని భాగస్వామ్యం చేసుకుని ముందుకు సాగాలి
 2. ఒకవైపు కరోనా వైరస్‌ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతూనే, మరోవైపు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆర్థిక స్థిరత్వం, వృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది
 3. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలించుకుంటూ వచ్చింది. మళ్లీ వృద్ధిపథంలో పయనించే విషయంపై పారిశ్రామిక రంగం ఇప్పటికే చర్చించుకుంటోంది
 4. తప్పకుండా వృద్ధిని తిరిగి సాధిస్తాం. రైతులు, చిరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో పాటు నైపుణ్యం, సాంకేతికత, ఆవిష్కరణలు, మేధోసంపత్తి ఇందుకు తోడ్పతాయన్న నమ్మకం ఉంది
 5. స్వావలంబన సాధన కోసం పారిశ్రామిక వర్గాల ప్రయత్నాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
 6. ప్రస్తుతం ప్రపంచం విశ్వసనీయ భాగస్వామి కోసం చూస్తోంది. భారత్‌కు ఆ సత్తా ఉంది 
 7. కరోనా సంక్షోభ కాలంలో భారత్‌పై ప్రపంచ దేశాలకు పెరిగిన నమ్మకం ద్వారా అన్ని రంగాలు లబ్ధి పొందాలి. 
 8. ప్రభుత్వ ఆశయ సాధన దిశగా పారిశ్రామిక రంగం రెండడుగులు ముందుకేస్తే.. మీకు మద్దతుగా ప్రభుత్వం నాలుగు అడుగులు ముందుకేస్తుంది. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రధానిగా నేను మీకు హామీ ఇస్తున్నా
 9. ప్రపంచానికి అవసరమయ్యే ఉత్పత్తులన్నింటినీ భారత్‌ తయారు చేయాలి. అత్యవసర దిగుమతులను కనీస స్థాయికి తగ్గించుకోవాలి 
 10. స్థానికంగా సమర్థవంతమైన సరుకు సరఫరా వ్యవస్థ కోసం భారత్‌ భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది
 11. మా ప్రభుత్వానికి సంస్కరణలు కేవలం యాదృచ్ఛిక లేదా చిందరవందర నిర్ణయాలు కావు. వ్యవస్థాగతమైన, ప్రణాళికబద్ధమైన, ఏకీకరణ, అనుసంధానిత, భవిష్యత్‌కు సంబంధించిన ప్రక్రియ. మాకు సంస్కరణలు సాహసోపేత నిర్ణయాలు. వ్యవస్థాగత సమస్యలకు తార్కిక ముగింపు
 12. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం వ్యూహాత్మకేతర రంగాల్లో ప్రైవేట్‌ వర్గాలకు తలుపులు తెరిచింది. కమర్షియల్‌ మైనింగ్‌ ద్వారా బొగ్గు ఉత్పత్తిలో ప్రభుత్వ గుత్తాధిపత్యానికి తెరదించింది. అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో ప్రైవేట్‌ రంగ పెట్టుబడులకు అనుమతించాం.  దీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న కార్మిక సంస్కరణలను చేపట్టాం 
 13. వృద్ధిని తిరిగి సాధించడం కష్టమేమీ కాదు.. స్వావలంబనే ఇందుకు మార్గం. కేవలం భారత్‌ కోసమే గాక ప్రపంచ అవసరాలను తీర్చే స్థాయిలో దేశీయంగా ఉత్పత్తి చేపట్టాల్సిన అవసరం ఉంది. 

Advertisement
Advertisement
Advertisement