మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : స్పీకర్‌

ABN , First Publish Date - 2022-09-26T05:30:00+05:30 IST

మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లల విత్తనాలను విడుదల చేశారు.

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : స్పీకర్‌
ఇబ్రహీంపేట్‌లో మాట్లాడుతున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ, సెప్టెంబరు 26 : మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లల విత్తనాలను విడుదల చేశారు. అనంతరం పట్టణంలోని  తాడ్కోల్‌ రోడ్డులో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా బాన్సువాడ పట్టణంలోని ఆచార్య జయశంకర్‌ మినీ స్టేడియంలో పాత రేషన్‌కార్డులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్‌ మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్రంలో 26వేల చెరువులు, 72 రిజర్వాయర్లలో ఏడాదికి 83 కోట్ల ఉచిత చేప పిల్లలను విడుదల చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల ఖర్చుతో చేప పిల్లలను అందిస్తే మత్స్యకారులకు ఏడాదికి పది వేల కోట్ల ఆదాయం లభిస్తుందన్నారు. కుల వృత్తుల వారు స్వగ్రామంలోనే ఉపాధి పొంది ఆర్థికాభివృద్ధి సాధించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 

మహిళా పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన చాకలి ఐలమ్మ

వీరనారిమణి తెలంగాణ మహిళా పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత చాకలి ఐలమ్మ అని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొనియాడారు. సోమవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మీనా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో చాకలి ఐలమ్మ సేవలను కొనియాడారు. దొరలను ఎరిరించి భూమి కోసం పోరాడిన వీర వనిత, తుపాకీ పట్టి రజాకారులను ఎదురించిన గొప్ప వ్యక్తి ఐలమ్మ అని ఆయన పేర్కొన్నారు. 

బతుకమ్మ చీరల పంపిణీ

రాష్ట్రంలో ఆడపడుచులకు పుట్టింటి చీర పెట్టడం బతుకమ్మ పండుగ సంప్రదాయమని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని ఆచార్య జయశంకర్‌ మినీ స్టేడియంలో నిర్వహించిన పాత రేషన్‌కార్డులు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో లక్షా మూడు వేల మందికి చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.  ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, జిల్లా ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌ జుబేర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-26T05:30:00+05:30 IST