ఆర్థిక భవిష్యత్‌ తలకిందులు

ABN , First Publish Date - 2020-08-10T05:58:56+05:30 IST

కొవిడ్‌-19 మహమ్మారి ఆర్థిక వ్యవస్థతో పాటు వ్యక్తుల ఆర్థిక భవిష్యత్‌ను కుదిపేస్తోంది. డిజిటల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందించే ‘స్ర్కిప్‌బాక్స్‌’ సంస్థ జూలై నెలలో ‘ఫైనాన్షియల్‌ ఫ్రీడమ్‌ సర్వే-2020’ పేరుతో దేశవ్యాప్తంగా...

ఆర్థిక భవిష్యత్‌ తలకిందులు

  • కొవిడ్‌ దెబ్బతో మారిన చిత్రం 
  • రికవరికీ  మరో ఏడాది 
  • స్ర్కిప్‌బాక్స్‌ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి ఆర్థిక వ్యవస్థతో పాటు వ్యక్తుల ఆర్థిక భవిష్యత్‌ను కుదిపేస్తోంది. డిజిటల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందించే ‘స్ర్కిప్‌బాక్స్‌’ సంస్థ జూలై నెలలో ‘ఫైనాన్షియల్‌ ఫ్రీడమ్‌ సర్వే-2020’ పేరుతో దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో ఈ విషయం తేలింది. ఈ సర్వే కోసం స్ర్కిప్‌బాక్స్‌ దాదాపు 1,400 మంది వ్యక్తుల ఆర్థిక సన్నద్దతను పరిశీలించింది. వీరిలో 83 శాతం మంది పురుషులు. 17 శాతం మంది స్త్రీలు. 


భవిష్యత్‌పై బెంగ : సర్వేలో పాల్గొన్న వారిలో 45 శాతం మంది అంటే దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు ఆర్థిక భవిష్యత్‌ ఏమాత్రం బాగోలేదన్నారు. మరో ఏడాది వరకు ఆర్థిక వ్యవస్థ కోలుకునే సూచనలూ కనిపించడం లేదన్నారు. దీంతో ఎక్కడికక్కడ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. సగం మంది విచక్షణాపూరిత ఖర్చులు తగ్గించుకుని, కష్టకాలంలో ఆదుకునేందుకు పొదుపు మంత్రం పాటిస్తామన్నారు.


అవసరమైతేనే ఖర్చు : కరోనా దెబ్బతో కొందరికి ఉద్యోగాలు పోతే, మరికొందరి జీతాలు తగ్గిపోయాయి. చేతిలో ఉన్న నాలుగు డబ్బులు పొదుపుగా వాడుకునేందుకే చాలామంది ఇష్టపడుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 28 శాతం మంది అత్యవసర వస్తువులు తప్ప, వేరే వస్తువుల కొనుగోళ్లకు పోవడం లేదన్నారు. ఇంకో 22 శాతం మంది అత్యవసర ఖర్చుల కోసం ప్రత్యేక నిధి కోసం పొదుపు చేస్తున్నట్టు చెప్పారు. 


ఈఎంఐల భారం : కరోనా కష్ట కాలంలో చాలా మందికి ఈఎంఐలు చెల్లించడం భారంగా మారింది. సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది తమ నెలవారీ ఆదాయంలో 15 నుంచి 30 శాతం, 11 శాతం మంది సగం ఈఎంఐల కోసమే ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. దీంతో ఈ భారం తగ్గించుకోవాలని చూస్తున్నట్టు పది శాతం మంది తెలిపారు. 


పెట్టుబడుల ప్రణాళిక : కొవిడ్‌కు ముందు ఎడాపెడా ఖర్చు చేసిన చాలా మందికి ఇప్పుడు, ఆర్థిక భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది. దీంతో పొదుపు చేసే నాలుగు రాళ్లను మరింత పెంచుకోవడం ఎలా? అని ఆలోచిస్తున్నారు. అత్యవసర ఖర్చులు, రిటైర్‌మెంట్‌ తర్వాత అవసరాల కోసం పెట్టుబడుల ప్రణాళిక (ఫైనాన్సియల్‌ ప్లానింగ్‌)కు మొగ్గు చూపుతున్నారు. పిల్లల చదువులు, కొత్త ఇల్లు కొనుగోళ్లకు పెద్దగా మొగ్గు చూపడం లేదు. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌  కోసం అవసరమైతే బయటి వ్యక్తుల సాయం తీసుకుంటామని చెప్పడం విశేషం.


Updated Date - 2020-08-10T05:58:56+05:30 IST