Abn logo
Oct 8 2020 @ 00:00AM

బాడీగార్డును తెచ్చుకొమ్మన్నారు

ఫ్యాషన్‌కు కొత్త దారులు వెతుకుతోంది నవతరం. ఆకట్టుకొనే స్టయిల్‌ ఒక్కటే కాదు... పర్యావరణ హితం కూడా తమ అభిమతమని చాటుతోంది. పుణేకు చెందిన 27 ఏళ్ల పూజా ఆప్టే ఆ కోవకే వస్తుంది. ఇంజనీరింగ్‌ చదువు... ఆరెంకెల జీతం ఇచ్చే కొలువు... ఇవేవీ వద్దని పారేసిన టైర్లతో ఎకోఫ్రెండ్లీ పాదరక్షలు తయారు చేస్తోంది. దాన్నే కెరీర్‌గా మలుచుకుని... ఓ అంకుర సంస్థకు యజమానిగా మారిన పూజా ప్రయాణం ఇది... 


అందరిలానే నాదీ ఒకటే కల... బీటెక్‌ అవుతూనే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో మంచి జాబ్‌ కొట్టేయాలని! అనుకున్నట్టుగానే ర్యాంక్‌ వచ్చింది. మా సొంత పట్టణం పుణేలోనే ఇంజనీరింగ్‌ సీటు వచ్చింది. ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌తో బీటెక్‌ అయిపోయింది. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో మంచి ప్యాకేజీతో ఉద్యోగానికి కూడా సెలెక్ట్‌ అయ్యా. ఉద్యోగం చేస్తుండగానే ఎంబీఏ కట్టాను. కానీ ఎక్కడో వెలితి. ఇంకా ఏదో చేయాలనే తపన. దీంతో నాలుగేళ్ల ఉద్యోగానికి స్వస్తి చెప్పాను. కారణం... ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనే ఉద్దేశం. 


అంతా వద్దన్నారు... 

మల్టీనేషనల్‌ కంపెనీలో మంచి జీతం వచ్చే సౌకర్యవంతమైన ఉద్యోగం వదిలేస్తానంటే స్నేహితులు, సన్నిహితులు వద్దంటే వద్దన్నారు. కానీ ఆఫీసులో పనిచేస్తున్నంతసేపూ నా మనసు మనసులో ఉండేది కాదు. నాకు కావాల్సింది ఇది కాదని అర్థమైంది. పారిశ్రామికవేత్త కావాలని లోపల ఎక్కడో ఉంది. అది అలా బయటకు వచ్చింది. అయితే ఏ వ్యాపారం ప్రారంభించాలనే విషయంలో స్పష్టత లేదు. 


ఆలోచనకు రూపం... 

ఉద్యోగం వదిలేసిన తరువాత పూర్తి సమయాన్ని స్టార్టప్‌కు ఒక రూపం ఇవ్వడానికే వెచ్చించాను. ఏ ఉత్పత్తి అయితే బాగుంటుందని ఆలోచిస్తుంటే... అప్పుడు పాత టైర్లు గుర్తుకువచ్చాయి. వాటితో ఏంచేయగలం? పరిశోధించాను. అలా తట్టిందే పాదరక్షలు. పాత తరంలో కొంతమంది టైర్లతో చేసిన చెప్పులు వాడేవారు. ఇప్పుడు చెప్పులు కుట్టేవారు రిపేర్లకు తప్ప టైర్లను ఉపయోగించడంలేదు. సాధారణంగా పెద్ద పెద్ద పరిశ్రమలు వాటిని కత్తిరించి వాడుతుంటాయి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా వాయు కాలుష్యానికి కారణమవుతాయి. నేను ఇచ్చే ఉత్పత్తి పర్యావరణహితంగా ఉండాలి. అదే సమయంలో విభిన్నంగా, మన్నికగానూ ఉండాలి. ఈ ఆలోచనతోనే ‘బ్లింక్‌ గ్రీన్‌’ పేరుతో స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాను. 


అందుకే ఆ పేరు...

ఇదివరకు పాదరక్షల మన్నిక కోసం విమాన టైర్లను ఉపయోగించేవారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడైతే వాడి పడేసిన టైర్లను పునర్వినియోగించేవారెవరూ లేరు. నా కాన్సెప్ట్‌ అంటూ పెద్దగా ఏమీ లేదు. వ్యర్థాల నుంచి రూపొందిస్తున్నా... పాదరక్షలు చూడగానే ఆకట్టుకోవాలి. ట్రెండ్‌కు తగ్గట్టు ఫ్యాషనబుల్‌గానూ ఉండాలి. ఈ ఆలోచనతోనే నా ఉత్పత్తులకు ‘మెమిటల్‌’ అని పేరు పెట్టాను. ఇది రెండు సంస్కృత పదాల మిళితం. అంటే ‘చక్రం లేదా టైర్‌, సోల్‌’ అని అర్థం. వీటి డిజైనింగ్‌ కూడా నేనే చేస్తున్నాను. 


ఆరంభంలో ఇబ్బందులెన్నో... 

నేను ప్రారంభించిన ఉత్పత్తి పూర్తిగా భిన్నమైనది. మార్కెట్‌లో ఎక్కడా దొరకనిది. దీంతో ఆరంభంలో ఏవి ఎక్కడ దొరుకుతాయో, ఎలా రూపొందించాలో తెలియక చాలా ఇబ్బందులు పడ్డాను. మెటీరియల్‌ కోసం ముంబైలోని కుర్లా మార్కెట్‌కు వెళితే... బాడీగార్డ్‌ను తెచ్చుకోమని సలహా ఇచ్చారు అక్కడివారు. చెప్పులు కుట్టేవారు దొరకడం కూడా కష్టమైంది. రాను రాను కాస్త అనుభవం వచ్చింది. మొదట్లో ఓ ఎనభై ఏళ్ల కాగితాలు ఏరుకొనే ఆవిడ దగ్గర పారేసిన టైర్లు కొనుక్కొనేదాన్ని. సోల్‌కు టైర్ల మెటీరియల్‌ వాడతాను. రకరకాల డిజైన్లతో వస్త్రాలు కుట్టించి, పైన మెరుగులు అద్దుతాను. కొంతమంది చెప్పులు కుట్టేవారు వాటి తయారీ పని చూసుకొంటారు. నా దగ్గర దొరికేవన్నీ కస్టమైజ్‌డ్‌ పాదరక్షలే. జత రూ.500. కావాలనుకున్నవారు ముందుగా ఆర్డర్‌ ఇవ్వాలి. 


అవార్డులు... రివార్డులు... 

ప్రస్తుతానికి పెద్దగా లాభాలు లేకపోయినా ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నా. రాబోయే రోజుల్లో దీన్ని మరింత విస్తరించి, పర్యావరణహిత పాదరక్షలు అందరికీ చేరువయ్యేలా చూడడమే నా ధ్యేయం. నా ఈ ప్రయత్నానికి ‘స్టార్టప్‌ ఇండియా, మహారాష్ట్ర స్టేట్‌ ఇన్నోవేషన్‌ సొసైటీ’ సంయుక్తంగా నాగ్‌పూర్‌లో నిర్వహించిన ‘స్టార్టప్‌ యాత్ర’ (2018)లో ‘అప్‌కమింగ్‌ ఉమన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’ అవార్డు దక్కింది. దాంతోపాటు రూ.50 వేల నగదు బహుమతి కూడా అందుకున్నాను. ఇది నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నా సంకల్పానికి బలాన్నిచ్చింది.


బొటిక్స్‌ కోసం... 

మా స్టార్టప్‌ ఉత్పత్తులు అధికంగా స్థానిక బొటిక్‌ల వారు కొనుగోలు చేస్తున్నారు. డిజైనర్‌వేర్‌లా వారు విక్రయిస్తున్నారు. అందంగా, ఆకర్షణలో మార్కెట్‌లో దొరికే ఏ ఫుట్‌వేర్‌కూ ‘మెమిటల్‌’ తీసుపోదు. అయితే వాటితో పోలిస్తే ఇవి కాస్త బరువు ఎక్కువ. అదొక్కటి మినహాయిస్తే ఎంతో సౌకర్యాన్నిస్తాయి. కాలికి నప్పుతాయి. ప్రతి జతా చేత్తో తయారు చేసేదే. ఆర్డర్లు పెరిగితే ముంబై నుంచి పాట టైర్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాను. సంస్థ కోసం నేను పెట్టిన పెట్టుబడి యాభై వేల రూపాయలు మాత్రమే. ఆరంభంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదమోననే సందేహం కలుగుతుండేది. కానీ ఇప్పుడు నా కాన్సెప్ట్‌ నలుగురికీ తెలుస్తోంది. నా పేరు పదిమందికి పరిచయమవుతోంది. కష్టానికి తగిన ఫలితం కనిపిస్తున్నందుకు సంతోషంగా ఉంది.

ప్రత్యేకం మరిన్ని...