ఈ దీపావళికి ఎకో ఫ్రెండ్లీ దీపాలు

ABN , First Publish Date - 2020-10-20T22:16:08+05:30 IST

దేశంలో చైనా వస్తువుల ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. భారతీయ వస్తువులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా పండుగల సమయంలో వినియోగించే లైట్లు, రంగులు, దీపాలు, క్యాండిల్స్‌,...

ఈ దీపావళికి ఎకో ఫ్రెండ్లీ దీపాలు

దేశంలో చైనా వస్తువుల ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. భారతీయ వస్తువులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా పండుగల సమయంలో వినియోగించే లైట్లు, రంగులు, దీపాలు, క్యాండిల్స్‌, డెకొరేషన్‌ ఐటమ్స్‌.. తదితరాల కోసం ఇన్నాళ్లూ చైనా పైనే మనం అధికంగా ఆధారపడ్డాం. కానీ ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. చైనా నుంచి వచ్చే అనేక వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో దేశీయ తయారీకి మార్గం సుగమమైంది. అనేకమంది ఆయా వస్తువుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై మక్కువ చూపుతున్నారు. 


హిందువులకు అత్యంత ప్రధానమైన పండుగలు.. దసరా, దీపావళి. దేశ వ్యాప్తంగా ఈ పర్వదినాలను హిందువులంతా జరుపుకొంటారు. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా దీపాలకు భారీ డిమాండ్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌లో ఆవు పేడతో దీపాలను తయారు చేసే కుటీర పరిశ్రమను స్థాపించారు. ఇవి ఎకో ఫ్రెండ్లీ దీపాలు కావడంతో వీటికి డిమాండ్‌ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ పరిశ్రమలో దాదాపు 100 మంది మహిళలు పనిచేస్తున్నారు. వారంతా ఉదయాన్నే ఆవు పేడను సేకరించి వాటితో ప్రతి రోజూ దాదాపు వెయ్యికి పైగా దీపాలను తయారు చేస్తున్నారు. 


ఆవు పేడతో తయారు చేసిన ఈ దీపాల ధర కూడా ఎంతో తక్కువగా ఉంటుందని పరిశ్రమ నిర్వాహకురాలు సంగీత గౌడ్‌ చెబుతున్నారు. మట్టి దీపాల ధర దాదాపు రూ.5 నుంచి రూ.10 వరకు ఉంటుందని, కానీ ఆవు పేడతో తయారు చేసిన ఈ ఎకో ఫ్రెండ్లీ దీపాల ధర కేవలం రూ. ఒకటిన్నర లేదా రూ. 2 మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. అవులను హిందువులు ఎంతో పవిత్రంగా కొలుస్తారని, లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఆమె కూర్చునే ఆసనానికి కూడా ఆవు పేడతో లేపనం చేస్తారని, అలాంటి ఆవు పేడతో తయారు చేసిన దీపాలను వినియోగించడంవల్ల పండుగల శోభ మరింత పెరుగుతుందని సంగీత అంటున్నారు. సైన్స్‌ పరంగా కూడా ఆవు పేడ మంచి యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుందని రుజువైందని, ఆవు పేడ భూమిలో ఎంతో సులువుగా కలిసి పోతుందని, అంతేకాకుండా ఈ ఎకో ఫ్రెండ్లీ దీపాలతో కాలుష్యం పెరిగే అవకాశం లేకపోగా నేలకు మరింత సారం అందుతుందని సంగీత అన్నారు.


ఆవు పేడతో దీపాలు తయారు చేసే పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలల్లో ఉపాధి కల్పనకు గొప్పగా ఉపయోగపడుతుందని సంగీత అన్నారు. ఈ పరిశ్రమను కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసుకోవచ్చని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా బలపడేందుకు కూడా ఉపయోగపడుతోందని అన్నారు. గ్రామీణ మహిళలంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి చిన్న కుటీర పరిశ్రమగా ఆవు పేడ దీపాలను తయారు చేసి మార్కెటింగ్‌ చేసుకోవచ్చని సూచించారు.


ఇలాంటి పరిశ్రమల వల్ల మనదేశంలో చైనా వస్తువుల విక్రయం తగ్గడమే కాక.. నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది. మనం కూడా ఇలాంటి దేశీయ వస్తువులనే వినియోగించి దేశానికి ఉపయోగపడదాం. వేడుకలను మరింత ఆనందమయం చేసుకుందాం.

Updated Date - 2020-10-20T22:16:08+05:30 IST