పర్యావరణహిత నిర్మాణాలు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-07-12T07:26:14+05:30 IST

పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై దేశ నిర్మాణరంగ నిపుణులు దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. భవన నిర్మాణ రంగంలో సౌందర్యంతో పాటు సౌకర్యాన్ని సమ్మిళితం చేసి ప్రజల జీవితాలను మరింత ఆనందమయంగా తీర్చిదిద్దేందుకు...

పర్యావరణహిత నిర్మాణాలు చేపట్టాలి

  • నూతన ఆవిష్కరణలు చేయాలి: వెంకయ్య


న్యూఢిల్లీ, జూలై 11(ఆంధ్రజ్యోతి): పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై దేశ నిర్మాణరంగ నిపుణులు దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. భవన నిర్మాణ రంగంలో సౌందర్యంతో పాటు సౌకర్యాన్ని సమ్మిళితం చేసి ప్రజల జీవితాలను మరింత ఆనందమయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేషనల్‌ కన్వెన్షన్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్‌-2020 సదస్సును శనివారం ఆయన ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం కూడా ఒకటని, సింధు నాగరికత తర్వాతి కాలంలో కోణార్క్‌ దేవాలయం మొదలుకొని ఆధునిక నిర్మాణాల వరకు భారతీయ నిర్మాణ విజ్ఞానంలో స్థానిక శిల్పుల నైపుణ్యత, వినియోగించిన సామగ్రి, సాంకేతికత పాత్ర చాలా ప్రత్యేకమని వివరించారు. ఈ వారసత్వ నిర్మాణ శైలిలోని గొప్పదనాన్ని అవగతం చేసుకొని, పర్యావరణహితాన్ని మదిలో ఉంచుకొని ప్రజల అవసరాలకు సరిపోయేలా నిర్మాణాలు చేపట్టడంపై దృష్టి సారించాలన్నారు. భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని కూడా ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. స్మార్ట్‌ సిటీస్‌, అందరికీ ఇళ్లు వంటి పథకాలను ప్రశంసించిన వెంకయ్య ఆయా ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం ఇవ్వాలని వెంకయ్యనాయుడు అన్నారు. 


Updated Date - 2020-07-12T07:26:14+05:30 IST