Abn logo
Feb 26 2021 @ 03:08AM

పర్యావరణహితంగా భవనాల నిర్మాణం

  • ఐటీపీఐ అధ్యక్షుడు ఎన్‌కే పటేల్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): దేశంలో గృహాలు, భవనాల నిర్మాణం పర్యావరణహితంగా  ఉండేలా తమ వంతు కృషిచేస్తున్నామని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ప్లానర్స్‌ ఇండియా (ఐటీపీఐ) అధ్యక్షుడు ఎన్‌కే పటేల్‌ అన్నారు.  విశాఖలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 69వ జాతీయ పట్టణ ప్రణాళికాధికారుల సదస్సులో దేశవ్యాప్తంగా 250 మంది ప్రత్యక్షంగా, మరో 350 మంది పరోక్షంగా  పాల్గొననున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పటేల్‌  మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గృహ నిర్మాణంలో వస్తున్న కొత్త విధానాలు, సాంకేతికతతోపాటు తీరప్రాంతాల్లో నిర్మాణాలకు సంబంధించిన చట్టాలు, నిర్మాణాల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై పట్టణ ప్రణాళికాధికారులకు సదస్సులో అవగాహన కల్పిస్తారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐదు ప్రాంతీయ కేంద్రాలు, మరో 24 ప్రాంతీయ చాప్టర్ల ద్వారా ఐటీపీఐ తన సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తోందన్నారు. ఐటీపీఐ సదస్సుకు ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ‘స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు-చేరుకునేందుకు కృషి’ నినాదం ప్రకటించిందన్నారు. 2030 నాటికి లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన చర్యలపై సదస్సుల్లో చర్చిస్తామన్నారు. ఏపీఆర్‌సీ చైర్మన్‌ బి.బాలాజీ, ఐటీపీఐ ఉపాధ్యక్షుడు రాముడు  తదితరులు మాట్లాడారు.


Advertisement
Advertisement
Advertisement