సాగునీటి వనరులకు గ్రహణం

ABN , First Publish Date - 2021-07-25T05:28:49+05:30 IST

సాగునీటి వనరులు లేని షాద్‌నగర్‌ ప్రాంత రైతులు కేవలం వర్షాధారంపైనే సాగు చేస్తున్నారు. వర్షాలకు వాగుల్లో ప్రవహించే వరద నీటికి అడ్డంగా నిర్మించిన ఆనకట్టల ద్వారా వచ్చే నీటితో వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు.

సాగునీటి వనరులకు గ్రహణం

  • వృఽథాగా పోతున్న వరదనీరు
  • పూడికతో నిండిన నవాబులు నిర్మించిన భీమారం ఆనకట్ట
  • లక్ష్యం నెరవేరని అయ్యవారిపల్లి ఆనకట్ట
  • 30 ఏళ్లు గడుస్తున్నా చెరువులోకి చేరని వరదనీరు
  • కనుమరుగవుతున్న పాటు కాలువలు
  • వినియోగంలోకి తేవాలంటున్న రైతులు 

షాద్‌నగర్‌రూరల్‌: సాగునీటి వనరులు లేని షాద్‌నగర్‌ ప్రాంత రైతులు కేవలం వర్షాధారంపైనే సాగు చేస్తున్నారు.  వర్షాలకు వాగుల్లో ప్రవహించే వరద నీటికి అడ్డంగా నిర్మించిన ఆనకట్టల ద్వారా వచ్చే నీటితో వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు. దశాబ్దాల కింద రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఆనకట్టలు నిరాదరణకు గురి కావడంతో భూములు సాగుకు నోచుకోవడం లేదు. మిషన్‌కాకతీయలో చెరువుల పూడికతీత పనులు చేసిన అధికారులు ఆనకట్టలను మాత్రం పట్టించుకోలేదు. దీంతో రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

నిరాదరణకు గురైన భీమారం ఆనకట్ట

ఉమ్మడి కొందుర్గు మండలం వీరసముద్రం గ్రామ శివారులో పుట్టి రావిర్యాల, తంగెళ్లపల్లి, బీమారం, కాంసాన్‌పల్లి గ్రామాల మీదుగా బాలానగర్‌ మండలం సూరారం గ్రామాన్ని కలుపుతూ ఏడాది పాటు జీవనదిగా ప్రవహించే వాగుపై నాటి నవాబులు భీమారం శివారులో అధునాతనంగా ఆనకట్టను నిర్మించారు. ఆనకట్టలో నిలిచిన నీరు సుమారు 200 ఎకరాలకు రెండు పంటలకు అందేది. ఏళ్ల తరబడి పూడిక తీయకపోవడం వల్ల నీటి నిల్వ భాగంలో మట్టి పేరుకుపోయింది. దీంతో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కొంత వరకు కాలువ మరమ్మతులు చేసినా ప్రస్తుతం సమస్య మొదటికొచ్చింది. నాడు నిర్మించిన ఆనకట్ట నేటికీ చెక్కు చెదరలేదు. పూడిక నిండి పోవడం వల్ల ప్రతి ఏడాది వర్షపు నీరు వృథాగా డిండి నదిలోకి పోతోంది. 

లక్ష్యానికి దూరంగా అయ్యవారిపల్లి ఆనకట్ట

బీమారం ఆనకట్టకు పైభాగంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్‌ పి.శంకర్‌రావు వరద నీరు వృథాగా పోకుండా అయ్యవారిపల్లి శివారులోని నల్ల చెరువులోకి నీటిని మళ్లించేందుకు సుమారు రూ.కోటితో ఆనకట్టను నిర్మించారు. ఆనకట్టకు కుడికాలువ ద్వారా అయ్యవారిపల్లి శివారులోని నల్లచెరువులోకి, ఎడమకాలువ ద్వారా చించోడు శివారులోని బొమ్ము చెరువులో వరద నీటిని మళ్లించాలని సంకల్పించారు. నల్లచెరువు వరకు కాలువ నిర్మాణం జరిగినా చిన్నచిన్న సాంకేతిక లోపాల వల్ల నీరు మాత్రం నేటికీ చెరువుల్లోకి చేరడం లేదు. మిషన్‌ కాకతీయలో కాలువ మరమ్మతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నల్ల చెరువు నిండితే  వంద ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. అంతేగాకుండా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా నీటి వనరులను వినియోగంలోకి తేవాలని రైతులు కోరుతున్నారు.

చెరువుల్లోకి వర్షపు నీటిని మళ్లించే పాటు కాలువలు కాలగర్భంలో కలుస్తున్నాయి. రియల్‌ వ్యాపారం పుంజు కోవడం భూములకు ధరలు పెరగడంతో పాటుకాలువలు  కనుమరుగవుతున్నాయి. ఫరూఖ్‌నగర్‌ మండలంలో  ఏడు ఆయకట్టు చెరువులతో పాటు 120 పైగా కుంటలున్నాయి. వీటి పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని చెరువులు కనుమరుగవగా, మరి కొన్ని చెరువులకు వర్షపు నీరు తీసుకువచ్చే పాటు కాలువలు ఆక్రమణకు గురయ్యాయి. ఎలికట్ట శివారులోని లాడెం చెరువుకు అనుసంధానంగా ఉన్న పాటు కాలువ పూర్తిగా ఆక్రమణకు గురైంది. పరిశ్రమల ఏర్పాటుతో కాలువ ఆనవాళ్లు కనిపించడం లేదు. ఆక్రమణకు గురైన కాలువను కాపాడాలని గ్రామస్థులు ఉన్నతాధాకారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మిషన్‌ కాకతీయలో పాటు కాలువలను గుర్తించకపోవడంతో కనుమరుగవుతున్నాయి. కబ్జాల నుంచి పాటు కాలువలకు విముక్తి కల్పించాలని రైతులు కోరుతున్నారు.

పూడిక తీస్తే బాగుంటుంది

భీమారం ఆనకట్టలో పూడిక తీయాలి. మట్టి పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. నీరునిలిస్తే భూగర్భ జలాలు పెంపొందుతాయి. ఆరుతడి పంటలను కూడా పండించుకోవచ్చు. అధికారులు చొరవ తీసుకుని పనులు చేపట్టాలి.

- నరేందర్‌రెడ్డి, కాంసాన్‌పల్లి

చెరువులోకి నీరు వచ్చే విధంగా చేయాలి

వర్షపు నీరు వృథాగా పోకుం డా నల్ల చెరువులోకి వచ్చే విఽ దంగా చర్యలు తీసుకోవాలి. దీని ద్వారా వంద ఎకరాలు సాగులోకి వస్తుంది. ఏళ్లు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.  

-  ఆంజనేయరెడ్డి, రైతు 

అయ్యవారిపల్లి

Updated Date - 2021-07-25T05:28:49+05:30 IST