డిండి ఎత్తిపోతలకు గ్రహణం

ABN , First Publish Date - 2021-12-24T05:35:13+05:30 IST

ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే యోచనతో చేపట్టి న డిండి ఎత్తిపోతల పథకం భ విష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిం ది. ప్రాజెక్టు పనులపై ఇకపై ముందుకెళ్లేదిలేదని ఎన్జీటీ (నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌)కు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది లిఖిత పూర్వకంగా తెలిపారు.

డిండి ఎత్తిపోతలకు గ్రహణం
అసంపూర్తిగా ఉన్న డిండి రిజర్వాయర్ల నిర్మాణ పనులు

ముందుకెళ్లేది లేదని ఎన్జీటీకి ప్రభుత్వం హామీ 

గడువు ముగిసి ఆరేళ్లయినా పూర్తికాని ప్రాజెక్టు 

ప్రజాభిప్రాయ సేకరణలోనూ వైఫల్యం

(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ)

ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే యోచనతో చేపట్టి న డిండి ఎత్తిపోతల పథకం భ విష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిం ది. ప్రాజెక్టు పనులపై ఇకపై ముందుకెళ్లేదిలేదని ఎన్జీటీ (నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌)కు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది లిఖిత పూర్వకంగా తెలిపారు.

నల్లగొండ జిల్లాలో 3.10లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో డిండి ఎత్తిపోతల పథకానికి 2015 జూన్‌లో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని నాడు సీఎం ప్రకటించగా, ఆ గడువు ముగిసి ఆరేళ్లయినా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఈ ప్రాజెక్టుతో భూములు కోల్పోతున్న నిర్వాసితులు పరిహారం కోసం నిత్యం ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. అనుమతులు, పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణచేసి ఆ నివేదికను సకాలంలో అనుమతులకు పంపి ఉంటే ఎన్జీటీలో ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని నిపుణులు పేర్కొంటున్నారు.

ముందుకుసాగని పనులు

డిండి ఎత్తిపోతల పనులకు సీఎం కేసీఆర్‌ 2015 జూన్‌ 12న శంకుస్థాపన చేశారు. రూ.6,190కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తిచేస్తామని నాడు సీఎం ప్రకటించారు. కాగా, ఆరున్నరేళ్లు గడిచినా గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్లు మినహా మిగతా పనులు ముందుకు సాగడంలేదు. ఇప్పటి వరకు రూ.2,800కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ పథకంలో భాగంగా ఎనిమిది రిజర్వాయర్లు నిర్మిస్తుండగా, గొట్టిముక్కల రిజర్వాయర్‌ పనులు 92శాతం, సింగరాజుపల్లి పనులు 87శాతం పూర్తయ్యాయి. కిష్టరాయన్‌పల్లి 14శాతం, చర్లగూడెం పనులు 40శాతం పూర్తికాగా, మిగతా రిజర్వాయర్ల పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. కాగా, అసలు ఈ పథకానికి నీటిని ఎక్కడి నుంచి కేటాయిస్తారో కూడా నేటికీ స్పష్టత లేదు. ఈ పథకానికి శంకుస్థాపన చేసి ఆరున్నరేళ్లు గడిచినా రిజర్వాయర్ల కింద భూ నిర్వాసితులకు నేటికీ పునరావాసం కల్పించలేదు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ సైతం పూర్తిగా అందలేదు. ఇంకా 600 ఎకరాల భూములకు సంబంధించిన పరిహారం చెల్లించాల్సి ఉంది. వీటి కోసం నిర్వాసితులు తరుచూ ఆందోళనలు చేస్తూ లాఠీదెబ్బలు తింటున్నారు. నిర్వాసితులపై పోలీసు కేసులు నమోదవుతున్నాయే తప్ప పరిహారం మాత్రం ఇవ్వడం లేదు.

లిఖితపూర్వక హామీ

డిండి ఎత్తిపోతల పథకం పనులను చేపట్టేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు (ఎన్జీటీ) స్పష్టం చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేస్తూ అక్టోబరు 29న ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో దానితో సంబంధం ఉన్న డిండి పనులను సైతం నిలిపినట్టు తెలిపింది. డిండి పనులను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాధి ఎ.సంజీవ్‌కుమార్‌ ఈ నెల 22న లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని ఎన్జీటీ రికార్డు చేసుకుంది.

ప్రజాభిప్రాయ సేకరణలో నిర్లక్ష్యంతో : మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రజాభిప్రాయ సేకరణలో రాష్ట్రప్రభుత్వం అలసత్వం మూలంగానే పనులపై ముందుకెళ్లేది లేదని ఎన్జీటీ ఎదుట చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు పనులు ప్రారంభంకాగానే ప్రజాభిప్రాయ సేకరణ సేకరిస్తే అటవీ, పర్యావరణ అధికారులు తమకు ఇబ్బంది లేదని నివేదిక ఇస్తారు. దాన్ని కేంద్రానికి పంపితే అనుమతులు వస్తాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అక్కడి ప్రభుత్వం ముందుగా ప్రజాభిప్రాయ సేకరణచేసి కేంద్రానికి పంపడంతో ఆ ప్రాజెక్టుకు అనుమతి వచ్చింది.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతుల గురించి ప్రజాభిప్రాయ సేకరణచేసి కేంద్రానికి పంపాలి.


చర్లగూడెం రిజర్వాయర్‌ పనులను అడ్డుకున్న భూనిర్వాసితులు 

మర్రిగూడ: చర్లగూడెం రిజర్వాయర్‌ పనులు చేపడుతుండగా నర్సిరెడ్డిగూడెం భూనిర్వాసితులు గురువారం అడ్డుకున్నారు. నర్సిరెడ్డిగూడెం భూనిర్వాసితులు ధర్నా చేస్తున్నప్పటికీ ఇరిగేషన్‌ అధికారులు యంత్రాలు పెట్టి పనులు నిర్వహిస్తుండగా అక్కడే ధర్నా చేస్తున్న భూనిర్వాసితులు అడ్డుకొని పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చేంతవరకు పనులు నిర్వహించేదిలేదన్నారు. ఒకవైపు మాకు పరిహారం, పునరావాసం కల్పించాలని 44 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే మీరు రిజర్వాయర్‌ పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసమని అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమంలో లోడే యాదయ్య, కుక్కల నర్సింహ, వెంకటయ్య, బాధిత నిర్వాసితులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-24T05:35:13+05:30 IST