Abn logo
Mar 4 2020 @ 02:30AM

పార్లమెంటరీ సభ్యతలకు గ్రహణం

దేశంలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాలు పరస్పర శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు కనపడుతోంది. అధికారంలో ఉన్న వారికి ఉండాల్సిన ఒక విశాలమైన, ఉదారవాదంతో కూడిన దృక్పథం అవలంబించాలన్న ఆలోచన అధికారపక్షానికి ఉన్నట్లు కనపడడం లేదు. దీని వల్ల ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా అంతే శత్రుత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారు. 


గత రెండు రోజులుగా జరుగుతున్న పార్లమెంట్‌ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు చూస్తుంటే దేశంలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంపైనే ఒక రకమైన విరక్తి కలుగుతోంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో జరిగిన దానికన్నా ఘోరమైన దృశ్యాలు లోక్‌సభలో కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బిజెపి సభ్యులు ఒకర్నొకరు తోసుకున్నారు. తనపై భౌతిక దాడి జరిగిందని కాంగ్రెస్‌కు చెందిన దళిత మహిళా ఎంపి స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష సభ్యులు నల్లటి బ్యానర్లతో స్పీకర్ పోడియం వద్దకు దూసుకువచ్చి హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేశారు. ‘అమిత్ షా ముర్దాబాద్’ అని నినాదాలు చేశారు. మరో వైపు బిజెపి సభ్యులు కూడా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కానీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కానీ సభలో పరిస్థితిని అదుపుచేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో నేనుసభను నడపలేను. మిమ్మల్నిసభ జరిగినంతకాలం సస్పెండ్ చేస్తా’ అని ఓం బిర్లా హెచ్చరించాల్సి వచ్చింది. 


సభాధ్యక్షులు పార్లమెంట్‌ ఉభయ సభలను నిర్వహించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? గత కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో మత కల్లోలాల వల్ల భయానక వాతావరణం ఏర్పడి 45 మందికి పైగా మరణించారు. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబించాలి? సాధారణంగా అయితే మొదటి రోజే పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధానమంత్రి లేదా హోంమంత్రి అల్లర్లపై అధికారిక ప్రకటన చేయాలి. ఆ తర్వాత మతకల్లోలాలను ఖండిస్తూ శాంతి స్థాపనకోసం పార్లమెంట్‌లో  తీర్మానం ఆమోదింపజేయాలి. జరిగిన అల్లర్లకు సంబంధించి పార్లమెంట్‌లో చర్చకు అనుమతించాలి. కాని గత రెండు రోజులూ ప్రధానమంత్రి, హోంమంత్రి ఉభయ సభల్లో ఎక్కడా కనిపించలేదు. తమ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వారు పాల్గొన్నారు కాని సభల్లో ప్రవేశించి జరుగుతున్న గందరగోళాన్ని నివారించేందుకు యత్నించలేదు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా తమ అగ్రనేతలు ఇద్దరూ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. ఎంతసేపూ ఆయన ప్రతిపక్షాలను నిందించడం, 1984 అల్లర్లను ప్రస్తావించడంతోనే సరిపెట్టుకున్నారు. కేంద్ర మంత్రులకు కూడా ఒక లైన్ అంటూ అగ్రనేతలు ఇచ్చినట్లు కనపడడం లేదు. సెంట్రల్ హాలులో కనపడ్డ ఒకరిద్దరు బిజెపి ఎంపీలు కూడా ప్రధానమంత్రి సభకు వచ్చి ప్రకటన చేస్తే బాగుండేది కదా అన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.


ఇంతకీ  మోదీ, అమిత్ షా ఏమి ఆలోచిస్తున్నారు? సభలో గందరగోళం ఏర్పడి సభ్యులు కొట్టుకోవాలనే భావిస్తున్నారా? నిజానికి హోంమంత్రి అమిత్ షా సభను ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నట్లు కనపడడం లేదు. ఢిల్లీ అల్లర్లకు ఆయనే బాధ్యుడని, ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో సభ విశ్వాసాన్ని ఆయన ఏవిధంగా చూరగొనగల రు? నిజానికి  హోంమంత్రి అమిత్ షా అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని కూడా భావించినట్లు కనపడడం లేదు. గతంలో ఇలాంటి అల్లర్లు జరిగినప్పుడు హోంమంత్రి ఆ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు విశ్వాసం కల్పించేవారు. కాని ఢిల్లీలో హింసాకాండ జరిగిన  ఈశాన్య ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడే సాహసం అమిత్ షా చేయలేకపోయారు. అదే సమయంలో బెంగాల్, ఒడిషాలో పర్యటించి పౌరసత్వ చట్టం కొనసాగించి తీరతామని ప్రకటించారు. విచిత్రమేమంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను అల్లర్ల జరిగిన ప్రాంతాలకు పంపడం. తానేదో ప్రజా నాయకుడన్నట్లుగా పర్యటించిన  అజిత్ దోవల్ రంగ ప్రవేశం చేసిన  తర్వాతే అక్కడి పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. అల్లర్ల సమయంలో ఏక పక్షంగా వ్యవహరించి, హింసాకాండకు ప్రేక్షకులుగా వ్యవహరించారని, కొన్ని చోట్ల తామే జనాన్ని చితకబాదారని పేరు తెచ్చుకున్న ఢిల్లీ పోలీసులు ఇప్పుడు ఆ ప్రాంతంలో సిబిఎస్ఇ పరీక్షలు రాస్తున్న విద్యార్థినులకు పుష్పగుచ్ఛాలు ఇస్తూ శాంతి ప్రవచనాలు చెబుతున్నారు. అల్లర్లకు సంబంధించి పుకార్లు వ్యాపించకుండా హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. అల్లర్ల సమయంలో ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఇప్పుడెవరు ఆదేశాలు ఇస్తున్నారు?


దేశంలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాలు పరస్పర శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు కనపడుతోంది. అధికారంలో ఉన్న వారికి ఉండాల్సిన ఒక విశాలమైన, ఉదారవాదంతో కూడిన దృక్పథం అవలంబించాలన్న ఆలోచన అధికారపక్షానికి ఉన్నట్లు కనపడడం లేదు. దీని వల్ల ప్రతిపక్షంలో ఉన్న వారు కూడా అంతే విధంగా శత్రుత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ కనపడితేనే కొట్టుకునేవిధంగా ఇరువర్గాలూ వ్యవహరిస్తున్నాయి. పివి నరసింహారావు హయాంలో కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌లో జరిగిన సమావేశానికి భారత్ తరపున వాదించేందుకు బిజెపి నేత అటల్ బిహారీ వాజపేయిని పంపారు. కాని ఇప్పుడే అంతర్జాతీయ వేదికలలోనైనా కశ్మీర్ సమస్యపై చర్చ జరిగితే మన తరఫున వాదించేందుకు నరేంద్రమోదీ ఏ ప్రతిపక్ష నేత నైనా పంపగలరా? ఎందుకు ఆయన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలపై ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోలేకపోతున్నారు? పాకిస్థాన్‌ను ఓడించి 1971లో బంగ్లాదేశ్‌ను ఏర్పర్చినప్పుడు వాజపేయి కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ‘అపరదుర్గ’గా అభివర్ణించారు. ఇప్పుడు ప్రతిపక్షనేతల్లో ఎవరైనా నరేంద్ర మోదీని, ఆయన చేస్తున్న సాహస కృత్యాలకు అభినందించే అవకాశం ఉన్నదా?


ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాల్సిన ఆరోగ్యకరమైన లక్షణాలన్నీ హరించుకుని పోయే విధంగా ఇవాళ ప్రభుత్వాము, ప్రతిపక్షాలూ వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్షాలను శత్రువులుగా భావించకూడదని, రాజకీయ ప్రత్యర్థులుగానే భావించాలని గతంలో లాల్ కృష్ణ ఆడ్వాణీ సైతం చెప్పారు. కాని ఇవాళ ఇరువురూ పరస్పర శత్రువులుగా, ఒకర్నొకరు అంతం చేసుకునేందుకు పోటీ పడుతున్న వారిగా వ్యవహరిస్తున్నారు.


ప్రజాస్వామ్యంలో పటిష్ఠమైన ప్రతిపక్షం, పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ ప్రధాన లక్షణాలు. కాని ఈ మూడూ ఇవాళ మృగ్యమవుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ అల్లర్లపై పోలీసులు వ్యవహరించిన తీరుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచిన హైకోర్టు జస్టిస్ మురళీధరన్‌ను రాత్రికి రాత్రి బదిలీ చేసే ఉత్తర్వులు వచ్చాయి. నిజానికి ఆయనను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇదివరకే నిర్ణయించినప్పటికీ ఆయనకు సాధారణంగా ఇచ్చే 14 రోజుల  వ్యవధి కూడా  ఇవ్వకుండా ఆగమేఘాలపై బదిలీ చేశారని వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇలాంటి అసాధారణ ఉత్తర్వులను ఎన్నడూ చూడలేదని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. జస్టిస్ మురళీధరన్ స్థానంలో మరునాడు అదే కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఎఎన్ పాటిల్, జస్టిస్ హరిశంకర్ అంతకు ముందు బెంచ్ జారీ చేసిన ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోలేదు సరికదా అత్యవసరంగా విచారించాల్సిన అంశంగా కూడా భావించలేదు. అందువల్ల జస్టిస్ మురళీధరన్ బదిలీ రాజకీయ వర్గాల్లోనే కాదు, న్యాయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు కొలీజియం చేస్తున్న బదిలీలు కూడా ప్రశ్నార్థకమవుతున్నాయి.


దేశంలో అన్ని వ్యవస్థలూ బలహీనమవుతున్నాయని వ్యాఖ్యానాలు వినపడుతున్న తరుణంలో పార్లమెంటరీ వ్యవస్థ కూడా మరింత బలహీనపడుతున్నదని గత రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. లేకపోతే మొదటి రోజే చర్చ సజావుగా జరిగేందుకు ప్రభుత్వాధినేతలు తగిన వాతావరణం ఏర్పర్చేవారు. తద్వారా ప్రతిపక్షాలు వెల్‌ లోకి దూసుకురావడం, సభలో గందరగోళం సృష్టించడం తప్ప తమకు గత్యంతరం లేనట్లు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ లోక్‌సభా నేత అధీర్ రంజన్ చౌదరి సైతం స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వెళ్లడాన్ని ఏమనుకోవాలి? ప్రతిపక్షాన్ని ప్రభుత్వాలు విస్మరించడం చరిత్రలో ఇది కొత్త కాదు.


ప్రజాస్వామ్యయుతంగానే రాజ్యాంగాన్ని నియంతృత్వ పరికరంగా మార్చిన ఘట్టాలు హిట్లర్ సమయంలోనూ, ఇందిరా గాంధీ కాలంలోనూ కనిపించాయి. ‘మెజారిటీ ప్రజల అధికారం సార్వభౌమికం, అత్యున్నతం అయిన చోట ఆ మెజారిటీ చట్టాలు చేసి ఏది తప్పో, ఏది సరైనదో నిర్ణయిస్తుంది. ఈ సిద్ధాంతం ఆచరణలోనూ, తార్కికంగానూ నియంతృత్వ రాజ్యానికి దారితీస్తుంది. సైనిక బలంతో కాక ప్రజాసమూహంతో వచ్చే ఆధునిక నియంతృత్వ విధానానికి దోహదం చేస్తుంది. ఇది పైకి ప్రజాస్వామికంగా కనిపించే నియంతృత్వం..’ అని ఆడ్వాణీ తన ఆత్మకథ ‘నా దేశం- నా జీవితం’లో రాసుకున్నారు. హిట్లర్‌కు ప్రతిపక్షంతో పనిలేదని, ఇందిరాగాంధీకి కూడా అంతేనని ఆయన అన్నారు. మెజారిటీ ప్రజల ఆకాంక్షలను భగ్నం చేస్తున్న మైనారిటీ పార్టీలుగా ఇందిర ప్రతిపక్షాలను నిరంతరం అభివర్ణించారని ఆడ్వాణీ విమర్శించారు. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతున్నదా?


విచిత్రమేమంటే సభలో సంఖ్యాబలం తక్కువ ఉండడం వల్ల ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర వహించే స్థితిలో కనపడడం లేదు. కాంగ్రెస్  పూర్తిగా నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోవడంతో తన అస్తిత్వాన్ని నిరూపించుకునేందుకు, సంక్షోభం నుంచి ఇతరుల దృష్టిని మళ్లించేందుకు రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఎప్పుడు ఏ దేశంలో ఉంటారో తెలియని రాహుల్ గాంధీ ట్వీట్లు చేయడం ద్వారా తన ఉనికిని ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు. ‘ప్రతి దేశ చరిత్రలోనూ నాయకులు పరీక్షను ఎదుర్కొనే సమయం వస్తుందని, నిజమైన నాయకుడు ఇవాళ కరోనా వైరస్, ఆర్థిక వ్యవస్థ వంటి తీవ్ర సంక్షోభాల్ని ఎదుర్కోవాలి’ అని రాహుల్ గాంధీ తాజాగా ట్వీట్ చేశారు.  కాని, కాంగ్రెస్‌లో ఏర్పడిన తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొనగల నాయకత్వ సామర్థ్యం తనకున్నదో లేదో నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అనుకోవడం లేదా? ఇవాళ సెంట్రల్ హాలులో ఏ కాంగ్రెస్ నాయకుడి ముఖం చూసినా నాయకత్వ సంక్షోభం తాలూకు విషాద మేఘాలు తచ్చాడుతున్నట్లు కనిపిస్తోంది. గాంధీ కుటుంబం నాయకత్వం వహిం చాలని వారి ఆశీస్సులతో బతికే నేతలు, అధికారులే భావిస్తున్నారని, నిజానికి ఈ కుటుంబ నాయకత్వం సంకెళ్లు తెంచుకుంటే కాని తమ పార్టీకి భవిష్యత్ లేదని సెంట్రల్ హాలులో ఒక మాజీ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.


వీధుల్లో ప్రజలు కొట్టుకోవడాన్ని, పార్లమెంట్‌లో సభ్యులు కొట్టుకోవడాన్నీ అనుమతిస్తూ ఒక రకమైన ఘర్షణాయుత వాతావరణాన్ని ఏర్పర్చి దేశ మౌలిక సమస్యల పరిష్కారంలో తమ వైఫల్యంనుంచి దృష్టి మళ్లించాలని అధికార పక్షం అనుకోవడం సహజం. తమ రాష్ట్రంలో భీకరమైన హింసాకాండను కళ్ళ  ముందే చూసిన వారికి ఢిల్లీ అల్లర్లు చాలా చిన్న విషయం. ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన కూడా వారిలో ఉన్నట్లు కనపడడం లేదు. గతంలో ఇందిరాగాంధీని గద్దెదించడానికి ఒక జయప్రకాశ్ నారాయణ్ వంటి నాయకుడు ఆవిర్భవించి దేశంలో చిన్నాచితకా పక్షాలను ఏకం చేసి ఒక జనతా ఫ్రంట్‌ను ఏర్పరిచారు. ఇప్పుడు ఆ రకంగా దేశంలో  వివిధ పార్టీలను ఏకం చేయగలిగిన శక్తి ఎవరికున్నది? ‘చరిత్ర పునరావృతమైతే, ఊహించనిది ఎప్పుడూ జరిగితే తన అనుభవం నుంచి నేర్చుకోవడంలో మనిషి ఎంత అసమర్థుడో అర్థమవుతుంది’ అని జార్జి బెర్నార్డ్ షా అన్నారు. మన రాజకీయ నాయకులు తమ అసమర్థతను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Advertisement
Advertisement
Advertisement