వంతెన నిర్మాణానికి గ్రహణం

ABN , First Publish Date - 2022-04-30T05:11:25+05:30 IST

ములకలచెరువు మండలం కాలవపల్లె సమీపంలో పాపాఘ్ని నది ప్రవహిస్తోంది. నదికి ఇరువైపులా అన్నమయ్య, సత్యసాయి జిల్లాల సరిహద్దుల్లో తారురోడ్లు ఉన్నాయి.

వంతెన నిర్మాణానికి గ్రహణం
కాలువపల్లె సమీపంలోని పాపాఘ్ని నదిపై వంతెన నిర్మించాల్సిన ప్రదేశం

కలగా మిగులుతున్న మూడు జిల్లాల ప్రజల స్వప్నం

నిర్మాణం పూర్తయితే ఏర్పడనున్న కొత్త మార్గం

కడప-బెంగళూరుకు తగ్గనున్న 60 కిలోమీటర్లు


రాయలసీమ పరిధిలోని మూడు జిల్లాలను దగ్గర చేసే పాపాఘ్ని నదిపై వంతెన నిర్మాణానికి నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. మూడు జిల్లాలను దగ్గర చేసే వంతెన నిర్మాణానికి గ్రహణం పట్టుకుంది. అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజల స్వప్నం కలగా మిగులుతోంది. వంతెన నిర్మాణం దశాబ్దాల నుంచి ప్రతిపాదనలకే పరిమితమైంది. కాగితాల దశ నుంచి బయటపడలేదు. వంతెన నిర్మాణం పూర్తి చేసి ఇరువైపులా రెండు కిలోమీటర్లు రోడ్డు వేస్తే కొత్త మార్గం ఏర్పడి కడప-బెంగళూరుకు 60 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. 


ములకలచెరువు, ఏప్రిల్‌ 29: ములకలచెరువు మండలం కాలవపల్లె సమీపంలో పాపాఘ్ని నది ప్రవహిస్తోంది. నదికి ఇరువైపులా అన్నమయ్య, సత్యసాయి జిల్లాల సరిహద్దుల్లో తారురోడ్లు ఉన్నాయి. ఈ నదిపై వంతెన నిర్మాణం చేపట్టి ఇరువైపులా రెండు కిలోమీటర్లు తారు రోడ్డు వేస్తే అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు కొత్త మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం బెంగళూరు నుంచి కడపకు వెళ్లేందుకు మదనపల్లె, రాయచోటి మీదుగా వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. పాపాఘ్నిపై వంతెన నిర్మిస్తే బెంగళూరు నుంచి చింతామణి, బి.కొత్తకోట, ములకలచెరువు, కాలువపల్లె, సత్యసాయి జిల్లా పెడబల్లి, గాలివీడు, రాయచోటి మీదుగా కడపకు కొత్త మార్గం ఏర్పడుతుంది. ఈ మార్గం వల్ల బెంగళూరు-కడపకు 60 కిలోమీటర్ల దూరం తగ్గి విలువైన ఇంధనం, సమయం ఆదా అవుతుంది. ములకలచెరువు, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం మండలాల ప్రజలు ఎన్‌పీ కుంట, గాండ్లపెంట, పెడబల్లి, గాలివీడు, రాయచోటి, కడప ప్రాంతాలకు వెళ్లేందుకు దగ్గర మార్గం ఏర్పడుతుంది. అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు వీలుంటుంది. ప్రస్తుతం గ్రామస్థులు పాపాఘ్నిపై తాత్కాలికంగా వేసుకున్న రోడ్డుతో ఆటోలు, ద్విచక్రవాహనాల రాకపోకలు సాగిస్తున్నారు. కాలువపల్లె నుంచి నది దాటితే అర కిలోమీటరు దూరంలోనే పెడబల్లి రోడ్డుకు చేరుకోవచ్చు. ప్రఖ్యాతి గాంచిన సత్యసాయి జిల్లాలోని తిమ్మమ్మమర్రిమాను చేరేందుకు కాలువపల్లె పంచాయతీలోని గ్రామాల ప్రజలు నది దాటి వెళితే ఎనిమిది కిలోమీటర్లు దూరం మాత్రమే ఉంది. ఇక్కడి నుంచి తిమ్మమ్మమర్రిమానుకు బస్సులో వెళ్లాలంటే ములకలచెరువు మీదుగా మూడు బస్సులు మారి 50 కిలోమీటర్ల వెళ్లాల్సి వస్తోంది. 1996లో రూ.5 లక్షలతో పాపాఘ్నిపై నిర్మించిన కాజ్‌వే నెల రోజుల వ్యవధిలోనే వరదలకు కొట్టుకుపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాగితాలకే పరిమితమైన పాపాఘ్నిపై వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 


పాపాఘ్నిపై వంతెనను ఎప్పుడు నిర్మిస్తారో...

పాపాఘ్నిపై వంతెనను ఎప్పుడు నిర్మిస్తారో ఏమో. వంతెన నిర్మిస్తే మూడు జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సాఆర్‌ కడప జిల్లాలకు కొత్త మార్గం ఏర్పడుతుంది. కడప నుంచి బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇంధనం, సమయం ఆదా అవుతుంది.

- ఎం.కృష్ణప్ప, కాయలవారిపల్లె


వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది

పాపాఘ్నిపై వంతెన నిర్మిస్తే వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్లు రోడ్డు వేస్తే కొత్త మార్గం ఏర్పడుతుంది. ఈ ప్రాంతం వారికి సత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లాలకు వెళ్లాలంటే దగ్గర దారి ఏర్పడుతుంది. వంతెన నిర్మాణం ఈ ప్రాంతం ప్రజలకు కలగా మిగిలింది.  

- కె.బాబాఫకృద్దీన్‌, కాలువపల్లె 

Updated Date - 2022-04-30T05:11:25+05:30 IST