అగ్నిగుండంలా అగ్ర‌రాజ్యం.. 52 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడే..

ABN , First Publish Date - 2020-06-02T16:49:32+05:30 IST

అగ్ర‌రాజ్యం అమెరికా న‌ల్ల‌జాతి నిర‌స‌న‌ల‌తో అట్టుడుకుతోంది. ఇంత‌కుముందెన్న‌డూ లేని విధంగా గ‌త వారం రోజులుగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి.

అగ్నిగుండంలా అగ్ర‌రాజ్యం.. 52 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడే..

వాషింగ్ట‌న్ డీసీ: అగ్ర‌రాజ్యం అమెరికా న‌ల్ల‌జాతి నిర‌స‌న‌ల‌తో అట్టుడుకుతోంది. ఇంత‌కుముందెన్న‌డూ లేని విధంగా గ‌త వారం రోజులుగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. మే 25న తెల్ల‌జాతి పోలీసుల‌ చేతిలో జార్జి ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయుడు చ‌నిపోవ‌డంతో అగ్ర‌రాజ్యం అగ్నిగుండంలా మారింది. మృతుడి స్వ‌రాష్ట్ర‌మైన‌ మిన్నెసోటాలోని మిన్నెపోలిస్‌లో ప్రారంభ‌మైన నిర‌స‌న‌లు ఇప్పుడు దేశంలోని సుమారు 20 రాష్ట్రాల‌కు వ్యాపించాయి. దాదాపు 52 ఏళ్ల త‌ర్వాత ఇలాంటి ఆందోళ‌న‌లు ప్ర‌స్తుతం యూఎస్‌లో జ‌రుగుతున్నాయని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


1968లో మార్టిన్ లూథ‌ర్ కింగ్(జూనియ‌ర్‌) దారుణ హ‌త్య‌కు గురైన స‌మ‌యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రిగాయి. మ‌ళ్లీ ఐదు ద‌శాబ్దాల త‌ర్వాత అగ్ర‌రాజ్యంలో నిర‌స‌న సెగ‌లు మిన్నంటుతున్నాయి. ఇక శ్వేత జాత్యహంకార దాడులపై మొదలైన ఆందోళ‌న‌లు తాజాగా శ్వేతసౌధాన్ని కూడా తాకాయి. జాత్యహంకారంపై జనాగ్రహం క‌ట్ట‌లు తెంచుకుంది. ఆగ్రహోదగ్రులైన ఆందోళనకారులు రాళ్లు, సీసాలు విసురుతూ శ్వేతసౌధం సమీపంలోని భవనాలను ధ్వంసం చేశారు. నిర‌స‌న‌కారుల‌ను చెద‌ర గొట్టేందుకు రంగంలోకి దిగిన పోలీసులు బాష్పవాయువును ప్రయోగించిన ఫ‌లితం లేకుండా పోయింది.


ఈ నేప‌థ్యంలో శ్వేతసౌధం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను శ్వేతసౌధంలోని సురక్షిత స్థావరమైన బంకర్‌లోకి త‌ర‌లించాయి. ‌కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ట్రంప్‌ గంటకుపైగా బంకర్‌లోనే ఉన్నట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కొంది. మ‌రోవైపు ట్రంప్ ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు సైన్యాన్ని బ‌రిలోకి దింపుతామ‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మనార్హం.    

Updated Date - 2020-06-02T16:49:32+05:30 IST