Abn logo
Apr 14 2021 @ 01:29AM

బెంగాల్‌లో బీజేపీ నేతలకూ ఈసీ శ్రీముఖం

కోల్‌కతా/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: తీవ్రమైన వ్యాఖ్యలతో కోడ్‌ ఉల్లంఘించిన అభియోగంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రచారంపై ఒకరోజు పాటు  నిషేధం విధించిన ఎన్నికల సంఘం ఇవే అభియోగాలపై ముగ్గురు బీజేపీ నాయకులకూ నోటీసులిచ్చింది. కూచ్‌బెహార్‌లోని శీతల్‌కుచిలో సీఐఎ్‌సఎఫ్‌ దళాలు నలుగుర్ని కాదు 8 మందిని కాల్చి చంపాల్సిందని వ్యాఖ్యానించిన రాహుల్‌ సిన్హా అనే బీజేపీ నేతపైనా ప్రచారంలో పాల్గొనకుండా 48 గంటల పాటు నిషేధం విధించింది. మరిన్ని శీతల్‌కుచిలు జరుగుతాయన్న బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌కు సంజాయిషీ నోటీసు జారీచేసింది. నందిగ్రామ్‌లో మమత ప్రత్యర్థి సువేందు అధికారికి కూడా మెత్తగా చీవాట్లు పెట్టింది. బేగమ్‌(మమత) మళ్లీ గెలిస్తే బెంగాల్‌ మినీ పాకిస్థాన్‌ అవుతుందని సువేందు అనడం తప్పు అనీ, కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికింది. అటు మమతా బెనర్జీ తన ప్రచారంపై ఈసీ నిషేధాన్ని నిరసిస్తూ కోల్‌కతాలోని మేయో రోడ్డులో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. టీఎంసీ నేతలను, కార్యకర్తలను అనుమతించకపోవడంతో వీల్‌చెయిర్‌లోనే ఒంటరిగా కూర్చుని తన నిరసన తెలిపారు.  

Advertisement
Advertisement