స్వతంత్రం కోల్పోయిన ఈసీ

ABN , First Publish Date - 2021-04-17T06:18:43+05:30 IST

పాత తరహా పద్ధతుల్లో ప్రచారం నిర్వహించడం, ఓట్లను అర్థించడం అనే వాటికి కాలం చెల్లిపోయింది. ఎన్నికలు ఇంకెంతమాత్రం ప్రజాస్వామ్య ఉత్సవంగా జరగడం లేదు. అవి ప్రత్యేకంగా రూపకల్పన...

స్వతంత్రం కోల్పోయిన ఈసీ

పాత తరహా పద్ధతుల్లో ప్రచారం నిర్వహించడం, ఓట్లను అర్థించడం అనే వాటికి కాలం చెల్లిపోయింది. ఎన్నికలు ఇంకెంతమాత్రం ప్రజాస్వామ్య ఉత్సవంగా జరగడం లేదు. అవి ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఒక తంతుగా మిగులుతున్నాయే తప్ప ప్రజాస్వామ్య వేడుకగా ఉండడం లేదు. 


ఆరవ లోక్‌సభ (1977-–80)కు జరిగిన ఎన్నికలు అవి. ఆ సార్వత్రక ఎన్నికలలోనే నేను మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. అప్పుడు పరిస్థితి ఇంత వికృతంగా లేదు. ఆ ఎన్నికలలో అవాంఛనీయమైన విషయాలు ఉన్న మాట నిజమే గానీ నేడు మనం చూస్తున్నంత అసహ్యకర పరిణామాలు ఆనాడు అనూహ్యమైనవి. అత్యవసర పరిస్థితిలో జైళ్ళలో నిర్బంధించిన నాయకులు అందరినీ విడుదల చేశారు. ఒక శక్తిమంతమైన, పునరుజ్జీవితమైన ప్రతిపక్షం ఇందిరకు గట్టి పోటీ నిచ్చింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ ఎన్నికలలో, ఉత్తర భారతావనిని ఊపివేసిన ఎమర్జెన్సీ వ్యతిరేక పవనాలు వింధ్య పర్వతాలను దాటలేకపోయాయి. 1977 సార్వత్రక ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్ధంగా జరిగాయి. ఎన్నికల సంఘం స్వతంత్ర వైఖరితో వ్యవహరించింది. 


ప్రచారంలో ఉపయోగించే వాహనాలకు, పోస్టర్లు, కరపత్రాల ముద్రణకు, సమావేశాలు, సభల నిర్వహణకు అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. అది నిజమైన ఎన్నికల ప్రచారం. అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు ముట్టజెబుతున్నట్టు ఎక్కడా పుకార్లు కూడా వినిపించ లేదు. ఆధిపత్య కులాల (సాధారణంగా భూస్వామ్య వర్గాలు) వారు వ్యవహరించిన తీరు తెన్నులే ఎన్నికలలో అసహ్యకరమైన పరిస్థితులు సృష్టించాయి. నిరుపేదలు, దళితులు, ఆదివాసీలు ఎవరైనా సరే భూస్వాములు ఆదేశించిన విధంగా ఓటు వేయక తప్పదు. మైనారిటీ వర్గాల వారు మౌనంగా ఉన్నా నిర్భయంగా ఉన్నారు. తమతమ సామాజిక వర్గాల పెద్దలు నిర్దేశించిన విధంగా ఓటు వేశారు. ఆ సార్వత్రక ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగాయనడంలో సందేహం లేదు. అయితే ఒక నిజమైన ప్రజాస్వామ్యంలో జరగవలసినంత స్వేచ్ఛగా అవి జరగలేదు. 


సరే, వర్తమానానికి వద్దాం. ఇప్పుడు ఏ వర్గం ప్రజలూ మరో వర్గం ప్రజలకు భయపడడం లేదు. ఈ రీత్యా ప్రస్తుత ఎన్నికలు మరింత ప్రజాస్వామ్యయుతమైనవి అని చెప్పక తప్పదు. పార్టీలు, అభ్యర్థుల జయాపజయాలలో కులం ఒక కీలకపాత్ర వహిస్తోంది. అయితే గతంలో వలే కాదు. వర్గం అనేది చాలావరకు ప్రాధాన్యం కోల్పోయింది. ఇప్పుడు పేదలు ఎవరూ సంపన్నులకు భయపడడం లేదు. స్వేచ్ఛగా ఓటు వేస్తున్నారు. 


ఇప్పుటి ఎన్నికలలో కనిపిస్తున్న కొత్త వికృతాలు డబ్బు ప్రభావం, ఎన్నికల సంఘంమునుపటిలా స్వతంత్రంగా వ్యవహరించడం లేదనే శంక. ఈ భావన అత్యధికులలో గట్టిగా నెలకొని ఉంది. డబ్బు ప్రభావం, ఎన్నికల సంఘం అస్వతంత్రంగా వ్య వహరించడం రెండూ ప్రజాస్వామ్యానికి తీవ్ర హాని చేసేవే. ఉదాహరణకు తమిళనాడులో ఓటర్లకు డబ్బు పం పిణీని ఈసీ అరికట్ట లేక పోయింది. ప్రతి ఓటరుకు పార్టీలుడబ్బు ఇవ్వ జూపాయి. ఓటర్లందరూ ఆ డబ్బు తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న ప్రతి బహిరంగసభకు అపరిమితంగా డబ్బు ఖర్చు చేశారు. విశాల వేదికలు నిర్మించారు. ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభలకు జనాన్ని తీసుకువచ్చేందుకు వందలాది వాహనాలను అద్దెకు తీసుకున్నారు. వచ్చిన వారికి ఆహారంతో పాటు డబ్బు కూడా ఇచ్చారు. వాణిజ్య ప్రకటనలకు, సామాజిక మాధ్యమాల సంస్థలకు, టెలిఫోన్ కాల్స్‌కు, పెయిడ్ న్యూస్‌కు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. రాజకీయ పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయన్న విషయాన్ని ఎవరూ కాదనడం లేదు. అయితేఈ ఖర్చు ఎక్కడాఖర్చుచేసినవారి ఖాతాల్లో గానీ, ఆ వ్యయాలతో లబ్ధి పొందినవారి ఖాతాల్లో గానీ లెక్కకు రావడం లేదు. పార్టీలు, అభ్యర్థులుతాము చట్టం నిర్దేశించిన విధంగా మాత్రమే ఖర్చు చేస్తున్నామని అంటున్నారు.


పాత తరహా పద్ధతుల్లో ప్రచారం నిర్వహించడం, ఓట్లను అర్థించడం అనే వాటికి కాలం చెల్లిపోయింది. అసలు అవి మళ్ళీ తిరిగివస్తాయా? ఒక ఎన్నిక ఇంకెంత మాత్రంప్రజాస్వామ్య ఉత్సవంగా జరగడం లేదు. అది ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఒక తంతుగా మిగులుతోందే తప్ప ప్రజాస్వామ్య వేడుకగాఉండడం లేదు. భీతి గొల్పుతున్న మరొక పరిణామం ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి. పోలింగ్‌ కేంద్రాలకు బాధ్యులైన అధికారుల, ఇవీఎమ్‌లు, వివిపాట్‌లను నిర్వహించే సాంకేతిక నిపుణులు, ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ సిబ్బంది కార్యదక్షత, నిజాయితీని నేనుఅభినందిస్తున్నాను. అయితే ఎన్నికల ప్రక్రియపై మొత్తంగా ఎన్నికల సంఘం పర్యవేక్షణ తీరుతెన్నుల పట్ల నాకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. డిఎంకె నాయకుడు ఎ.రాజా ప్రత్యర్థి పార్టీ నాయకుడిపై ఒక అనాలోచిత, అవమానకర వ్యాఖ్య చేసినందుకు ఆయన ప్రచారంపై 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. అసోంలో బీజేపీ నాయకుడు హేమంత్ బిశ్వశర్మ సైతం అటువంటి అనాలోచిత, అవమానకర వ్యాఖ్య చేయడం జరిగింది. అయితే ఆయన ప్రచారంపై తొలుత 48 గంటల పాటు ఆంక్షలు విధించిన ఎన్నికల సంఘం వెన్వెంటనే ఆ ఆంక్షలను 24 గంటలకు కుదించింది! ఇది పక్షపాత వైఖరి కాదా? బెంగాల్లో మమతా బెనర్జీ చేస్తున్న ప్రతి ప్రసంగం పట్ల తీవ్ర అభ్యంతరాలువ్యక్తం చేస్తున్నారు.


చట్టపరమైన చర్యలు చేపడతామని ఆమెను హెచ్చరిస్తున్నారు. ఆమెకు నోటీసులు జారీ చేస్తున్నారు. చివరకు 24 గంటల పాటు ప్రచారంలో పాల్గొన కూడదని ఆమెపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి చేస్తున్న ప్రసంగాలు నిబంధనల పరిధిలోనే ఉంటున్నాయా? అభ్యంతరం తెలుపవలసినది వాటిలో ఏమీ ఉండడం లేదా? దీదీ ఓ దీదీ అని మమతాబెనర్జీని ఉద్దేశించి ప్రధాని మోదీ పరిహాస పూర్వకంగా అనడం సభ్యతగా ఉన్నదా? ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గురించి అలా ప్రస్తావించవచ్చా? ఒక జవహర్‌లాల్‌ నెహ్రూ, ఒక మొరార్జీ దేశాయి, ఒక వాజపేయి ఆ రీతిలో మాట్లాడడాన్ని నేను ఊహించలేను. అసలు బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను 33 రోజుల పాటు 8 దశలలో నిర్వహించడం ఎంతవరకు సబబు? ఇరుగుపొరుగునే ఉన్న తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో మొత్తం 404 శాసనసభా స్థానాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఒకే రోజున పోలింగ్ నిర్వహించారు. మరి 294 స్థానాలు ఉన్నపశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎనిమిది దశలలో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏమిటి? ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి బెంగాల్‌లో ఎక్కువ రోజులపాటు ప్రచారం చేసేందుకు వీలుగానే పోలింగ్‌ ప్రక్రియను అన్ని రోజులపాటు సాగదీశారన్నది స్పష్టం. 


ఎన్నికల సంఘానికి ఇప్పుడు టిఎన్ శేషన్ లాంటి అధికారి నేతృత్వం వహించాల్సిన అవసరముంది. ధైర్యం, పట్టుదల గల శేషన్ అధికారంలో ఉన్నవారికి భయపడకుండా తన రాజ్యాంగ బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన వ్యక్తి. ఎన్నికల సంఘం తీరుతెన్నులపై నేను ఇంకా పూర్తిగా ఆశలు కోల్పోలేదు. అయితే నేడు, మే 2వ తేదీ మధ్యదాని వ్యవహారశైలి ఏ విధంగా ఉండేది నిశితంగా గమనించవలసి ఉంది. ప్రజాస్వామ్య మనుగడ అనేది ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకోవడం పై ఉంది. ఎవరికి ఓటు వేయాలనే తమ నిర్ణయాన్ని ప్రజలు స్వేచ్ఛగా అమలుపరచడమనేది ఎన్నికల సంఘం స్వతంత్ర కార్యసరళిపై ఆధారపడి ఉంది.




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-04-17T06:18:43+05:30 IST