ఈ నెల 25న ఈబీసీ నేస్తం

ABN , First Publish Date - 2022-01-22T08:35:49+05:30 IST

అగ్రవర్ణ పేద మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 25 తేదీన దీనిని ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

ఈ నెల 25న ఈబీసీ నేస్తం

  • అగ్రవర్ణ పేద మహిళలకు ఏటా 15 వేల సాయం.. మూడేళ్లలో 45 వేలు
  • రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం.. 
  • 11వ వేతన సవరణకు ఆమోదం
  • ఓటీఎస్‌ 2 వాయిదాల్లో కట్టే చాన్సు.. 
  • కృష్ణపట్నం ప్లాంటు ప్రైవేటుకు
  • ధాన్యం కొనుగోలుకు 5 వేల కోట్లు.. 
  • కొన్న 21 రోజుల్లోనే చెల్లింపులు
  • ధాన్యం కొనుగోలుకు 5 వేల కోట్లు
  • కొత్త వైద్య కళాశాలలకు 7,880 కోట్లు
  • ఓటీఎస్‌ రెండు వాయిదాల్లో కట్టే చాన్సు
  • మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు


అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): అగ్రవర్ణ పేద మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 25 తేదీన దీనిని ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో  కేబినెట్‌ సమావేశం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సవరణకు ఆమోదం తెలిపింది. వారి పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే నియోజకవర్గాల్లో చేపట్టే జగనన్న టౌన్‌షిప్పుల్లో ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రతిపాదననూ ఆమోదించింది. వాటిలో 10 శాతం ప్లాట్లను 20 శాతం రాయితీతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాలని నిర్ణయించింది. సమావేశానంతరం కేబినెట్‌ భేటీ వివరాలను సమాచార, పౌరసంబంధాలు, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు రూ.5,000 కోట్లు కేటాయించామని.. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే రైతుకు నగదు చెల్లింపులు జరపాలని కేబినెట్‌ తీర్మానించిందని చెప్పారు.


మంత్రివర్గ నిర్ణయాలివీ.. 

ఈబీసీ నేస్తం అమలుకు ఆమోదం. 45-60 ఏళ్ల మధ్యనున్న 3,92,674 మంది అగ్రవర్ణ మహిళలకు ఏటా రూ.15,000 చొప్పున మూడేళ్లలో రూ.45,000 అందజేత. ఇందుకోసం రూ.589.01 కోట్ల వ్యయం.16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.7,880 కోట్ల ఖర్చుకు ఆమోదం. ఇప్పటికే ఉన్న 11 వైద్య కళాశాలల అభివృద్ధికి రూ.3,820 కోట్ల విడుదలకు నిర్ణయం. ఒక జిల్లా-ఒక మెడికల్‌ కాలేజీ ప్రతిపాదనకు అంగీకారం. 

ఉద్యోగులకు నూతన పీఆర్సీకి ఆమోదం. కొవిడ్‌తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో స్వల్ప మార్పు. వన్‌టైం సెటిల్మెంట్‌ (ఓటీఎస్‌) రెండు వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం. గ్రామీణ ప్రాంతాల్లో దీపావళి, ఉగాది పర్వదినాల్లో కట్టే వెసులుబాటు.

వరుస నష్టాలు చవిచూస్తున్న కృష్ణపట్నం పవర్‌ ప్లాంట్‌ ఆపరేషనల్‌ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్వహణ బాధ్యతలు వేరొకరికి అప్పగించేందుకు అవసరమైన బిడ్డింగ్‌కు ఆమోదం. ఇందులో పనిచేసే ఏపీ జెన్కో సిబ్బంది 

మాతృసంస్థకు బదిలీ.

సామాజిక పింఛను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచేందుకు ఆమోదం.

కడప, కర్నూలు నుంచి విమానాలు నడిపేందుకు ఇండిగోతో ఒప్పందం. కడప-విజయవాడ, కడప-చెన్నై, కర్నూలు-విజయవాడకు వారానికి 4 సర్వీసులు. మార్చి 27 నుంచి ప్రారంభం.

ఎండోమెంట్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకాల్లో సవరణలకు నిర్ణయం.

ఓటీఎస్‌, టిట్కో, విశాఖలోని మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ్‌సకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీల మినహాయింపు.

ఐసీడీఎ్‌సకు బాలామృతం, ఫోర్టిఫైడ్‌ ఆహారం.. తాజా అమూల్‌ పాలు సరఫరాకు ఆమోదం.

ఏపీఐఐసీ నోడల్‌ ఏజెన్సీగా ఆటోనగర్‌లలో ఉన్న భూములను బహుళ అవసరాలకు వినియోగించుకునేందుకు అవసరమైన గ్రోత్‌ పాలసీకి ఆమోదం.

విశాఖ జిల్లా ఎండాడలో రాజీవ్‌ గృహకల్ప ప్రాజెక్టులో నిరుపయోగంగా పడిఉన్న భూములను హెఐజీ, ఎంఐజీ కాలనీల కోసం వాడుకునేందుకు అంగీకారం. 

ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ పరిధిలో అనకాపల్లిలో రీజినల్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (రార్స్‌)కు ఉచితంగా 50 ఎకరాల భూమి కేటాయింపు.

కిడాంబి శ్రీకాంత్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి తిరుపతిలో ఐదెకరాలు కేటాయింపు.

విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు భూ కేటాయింపు.

ఎన్‌ఎంసీ నిబంధన మేరకు 8 అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టుల మంజూరు. ఆయుష్‌ విభాగంలో నేచురోపతి, యోగా డిస్పెన్సరీల్లో 78 పోస్టులు మంజూరు.

మున్సిపాలిటీగా మారిన వైఎ్‌సఆర్‌ తాడిగడపలో పంచాయతీగా ఉన్నప్పుడు ఉన్న 59 పోస్టులు సదరు మున్సిపాలిటీకి బదిలీ.

కర్నూలు జిల్లా డోన్‌ బాలికల బీసీ గురుకుల పాఠశాల మంజూరు. జూనియర్‌ కాలేజీకి, బేతంచర్లలో బాలుర గురుకుల పాఠశాలలో 59 పోస్టులు మంజూరు.

మీట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు ఏడు పోస్టులు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస తొగరాంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో 13 పోస్టులు మంజూరు.

Updated Date - 2022-01-22T08:35:49+05:30 IST