మహిళా సంఘాలకు ఈ-ఆటోలు, బైక్‌లు

ABN , First Publish Date - 2022-01-26T05:30:00+05:30 IST

వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నది.

మహిళా సంఘాలకు ఈ-ఆటోలు, బైక్‌లు

 పర్యావరణ పరిరక్షణే లక్ష్యం 

156 మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయం


సంగారెడ్డిటౌన్‌, జనవరి26: వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నది. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈమేరకు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, విక్రయాలను సర్కారు ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మహిళా సంఘాల సభ్యులకు ఈ ఆటోలు, ద్విచక్రవాహనాల కొనుగోలుకు రుణాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. స్త్రీ నిధి ద్వారా తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లాలో 890 గ్రామైఖ్య సంఘాలుండగా వాటి పరిధిలో 23,663 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఆయా సంఘాల్లో 2.50 లక్షల మంది మహిళలు సభ్యులు గా ఉన్నారు. వీరంద రూ ప్రతినెలా పొదుపు చేస్తూ బ్యాంకుల ద్వారా        రుణాలు తీసుకుంటూ ఆర్థికంగా బలపడుతున్న విషయం తెలిసిందే. తా జాగా స్త్రీ నిధి ద్వారా ఈ-ఆటోలు, బైక్‌ల కొనుగోలుకు ప్రత్యేకంగా రుణాలు ఇవ్వాలని ఐకేపీ, మెప్మా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

156 మందికి ఇవ్వాలని నిర్ణయం

 జిల్లాలో స్త్రీ నిధి ద్వారా వచ్చే మార్చి నెలాఖరులోగా 156 మందికి ఈ-ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ-ఆటో, ఈ ట్రాలీ కోసం రూ.3 లక్షల వరకు రుణం ఇస్తారు. తీసుకున్న రుణాలను 11 శాతం వార్షిక వడ్డీతో 60 నెలల వారీగా వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్‌ ఆటోల్లో ఐదుగురు ప్రయాణించవచ్చు. రెండు గంటల ఛార్జింగ్‌ చేస్తే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వీలుంటుంది. ఎలక్ర్టిక్‌ ద్విచక్రవాహనాలకు స్త్రీ నిధి ద్వారా రూ.75 వేల రుణం ఇస్తారు. వీటికి 46 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాహనాలు విద్యుత్‌ బ్యాటరీతో నడుస్తాయి. వీటికి పెట్రోలు ఖర్చు ఉండదు. 

జనరిక్‌ మెడికల్‌ స్టోర్లకు కూడా..

జిల్లాలో జనరిక్‌ మెడికల్‌ స్టోర్ల (సాధారణ ఔషధాల దుకాణం)ను ప్రోత్సహించేందుకు స్త్రీ నిధి ద్వారా ప్రత్యేకంగా  రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే మార్చి నెలాఖరు వరకు జిల్లాలో 10 యూనిట్లను మంజూరు చేయగా, ఇప్పటి వరకు ముగ్గురు లబ్ధిదారులను గుర్తించారు. వీరికి రూ. 3నుంచి రూ.5 లక్షల వరకు రుణా లు ఇవ్వనున్నారు. తీసుకున్న రుణాలను 11 శాతం వార్షిక వడ్డీతో 60 నెలల వాయిదాల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

అర్హులు వీరే

జనరిక్‌ మెడికల్‌ స్టోర్ల కోసం రుణాలు పొందాలంటే స్వయం సహాయక సంఘాల్లో సభ్యు లై ఉండాలి. ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యుల పిల్లలకు కూడా ఈ రుణం సదుపాయం వర్తిస్తుంది. లబ్ధిదారులు డీఫార్మసీ, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. డ్రగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.

Updated Date - 2022-01-26T05:30:00+05:30 IST