చికిన్, చేపల కంటే బీఫ్ బాగా తినండి: బీజేపీ మంత్రి

ABN , First Publish Date - 2021-07-31T21:03:34+05:30 IST

రాష్ట్ర ప్రజలు చికెన్, మటన్, చేపల కంటే ఎక్కువగా బీఫ్ తినాలను స్వయంగా ఆయన పిలుపు..

చికిన్, చేపల కంటే బీఫ్ బాగా తినండి: బీజేపీ మంత్రి

షిల్లాంగ్: బీఫ్ తినడాన్ని మేఘాలయ బీజేపీ మంత్రి ఒకరు ప్రోత్సహిస్తూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు చికెన్, మటన్, చేపల కంటే ఎక్కువగా బీఫ్ తినాలని స్వయంగా ఆయన పిలుపు ఇచ్చారు. బీఫ్‌‍ తినడానికి తమ పార్టీ వ్యతిరేకమనే ఆపోహలకు తెరదించుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత అయిన సాన్‌బర్ షులియా గత వారంలో పశు సంవర్ధక, వెటర్నరీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.


''ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ నచ్చింది తినే స్వేచ్ఛ ఉంటుంది. చికెన్, మటన్ ,చేపల కంటే ఎక్కువగా బీఫ్ తినమని నేను ప్రోత్సహిస్తున్నాను. ఇందువల్ల పశు వధపై బీజేపీ నిషేధం విధించిందనే అపోహలు తొలగిపోతాయి'' అని షులియా అన్నారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న 'కౌ లెజిస్లేషన్' ప్రభావం మేఘాలయకు పశువుల రవాణాపై పడకుండా చూడాలని ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మతో మాట్లాడతానని కూడా ఆయన చెప్పారు. మేఘాలయ, అసోం మధ్య చిరకాల సరిహద్దు అంశంపై మంత్రి మాట్లాడుతూ, సరిహద్దులను, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడెంతైనా ఉందని చెప్పారు. అసోం ప్రజలు మన సరిహద్దుల్లోని ప్రజలను వేధిస్తూ ఉంటే కేవలం సంభాషణలు, టీ సేవనానికి పరిమితం కాకుండా ఎప్పడికప్పుడు, ఎక్కడ అవసరమైతే అక్కడ తక్షణం స్పందించాల్సిన తరుణం ఆసన్నమైనట్టేనని అన్నారు. హింసకు తాను వ్యతిరేకినని కూడా ఆయన చెప్పారు. ''శత్రువులు మీ ఇంటికి వచ్చి, మీపైన, మీ భార్యాపిల్లల పైనా దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం తిరగబడతాం. సరిహద్దుల విషయంలోనూ ఇదే చేయాల్సి ఉంటుంది. చట్టబద్ధమా, విరుద్ధమా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. మనలను మనం కాపాడుకోవాల్సి ఉంటుంది'' అని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2021-07-31T21:03:34+05:30 IST