ఈ యాప్స్‌తో ఈజీగా!

ABN , First Publish Date - 2020-08-01T07:56:08+05:30 IST

మీ దగ్గర ఎంత మంచి స్మార్ట్‌ఫోన్‌ ఉన్నా, అందులో సరైన యాప్స్‌ లేకుంటే ఉపయోగం ఉండదు.

ఈ యాప్స్‌తో ఈజీగా!

మీ దగ్గర ఎంత మంచి స్మార్ట్‌ఫోన్‌ ఉన్నా, అందులో సరైన యాప్స్‌ లేకుంటే ఉపయోగం ఉండదు. ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం ప్లేస్టోర్‌లో బోలెడు వినూత్నమైన యాప్స్‌ ఉన్నాయి. మరి ఎలాంటి యాప్స్‌ ఎంచుకోవాలి? ఏ యాప్‌ ఏ రకమైన పనికి ఉద్దేశించింది?  ఆ విశేషాలు ఇవి...


ఫోన్‌లో నోట్స్‌ రాసుకోవడానికీ, రిమైండర్లు పెట్టుకోవడానికీ చాలా యాప్స్‌ లభిస్తూనే ఉంటాయి. అయితే https://bit.ly/33et6nw అనే లింకులో లభించే Notification Notes అనే యాప్‌ భిన్నంగా పనిచేస్తుంది. ఇందులో బిల్‌ పేమెంట్స్‌ మొదలుకుని, ముఖ్యమైన వారికి ఫోన్‌ చెయ్యడం వరకూ మీరు చేయదలుచుకున్న ముఖ్యమైన పనులను నోట్స్‌ రూపంలో రాసుకోవచ్చు. అంతేకాకుండా ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉండేందుకు ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోని నోటిఫికేషన్‌ ప్యానల్‌లో అమర్చుకోవడానికి ఈ యాప్‌ పనికొస్తుంది. ఇలా చేయడం ద్వారా   ముఖ్యమైన విషయాలను మర్చిపోవడం జరగదు. దీంట్లో వివిధ నోట్స్‌ని గ్రూప్‌ చేసుకోవచ్చు. లాక్‌స్ర్కీన్‌లో కూడా మిస్‌ అవకుండా కన్పించేలా ఏర్పాటు చేసుకోవచ్చు.


ఆటోమేటిక్‌గా చేసేస్తుంది

నిద్రపోయే ముందు ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో పెట్టడం చాలామందికి అలవాటు. అలాగే బ్యాటరీ 15-20 శాతానికి పడిపోగానే చాలామంది బ్రైట్‌నెస్‌ తగ్గిస్తుంటారు. ఇలా వివిధ సెట్టింగులను మనం చేయాల్సిన పనిలేకుండా వాటంతట అవే  సెట్‌ అవడానికి MacroDroid అనే యాప్‌ను ప్రయత్నించవచ్చు.  https://bit.ly/3jQqCSl లింక్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇది చాలా శక్తిమంతమైన యాప్‌. దీన్ని వాడడం కొద్దిగా అలవాటు చేసుకుంటే మళ్లీ మళ్లీ చేయాల్సిన అనేక పనుల్ని ఆటోమేట్‌గా చేసుకోవచ్చు. ఉదాహరణకి Amazon Prime Video ఓపెన్‌ చెయ్యగానే వాల్యూమ్‌ లెవల్‌ మీకు కావలసిన విధంగా దానంతట అదే సెట్‌ అయ్యేలా చేసుకోవచ్చు, ఒక నిర్థిష్టమైన సందర్భంలో బ్లూటూత్‌, జీపీఎస్‌, వై-ఫై లాంటివి మన ప్రమేయం లేకుండా ఆఫ్‌ అయ్యేలా చేసుకోవచ్చు. ఏ సందర్భంలో ఏం జరగాలి అన్న రూల్స్‌ సెట్‌ చేసుకోవడం కొద్దిగా అలవాటు చేసుకుంటే చాలు.  


పూర్తి స్ర్కీన్‌లో...

ఆండ్రాయిడ్‌ 9, 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల నుంచి నేవిగేషన్‌ బటన్ల స్థానంలో గెశ్చర్‌ కంట్రోల్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అది కూడా పరిమితంగానే పనిచేస్తుంది. ప్రస్తుతం మీ ఫోన్‌ స్ర్కీన్‌లో బ్యాక్‌, హోమ్‌ వంటి బటన్లు ఎక్కడ ఉంటాయో అదే ప్రదేశంలో వేలితో స్వైప్‌ చేసినప్పుడు మాత్రమే గెశ్చర్‌ కంట్రోల్‌ పనిచేస్తుంది. సరిగ్గా అదే ప్రదేశంలో వేలితో స్వైప్‌ చెయ్యడం కొద్దిగా కష్టమైన వ్యవహారం. అలా కాకుండా మీ ఫోన్‌ స్ర్కీన్‌ మొత్తంలో కుడి, ఎడమ, స్ర్కీన్‌పైనా, కింద అంచుల వద్ద వేలితో స్వైప్‌ చేస్తే వివిధ పనులు పూర్తయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి Full Screen Gestures అనే యాప్‌ ఉపయోగపడుతుంది. ఈ కింది లింకు నుంచి ఈ యాప్‌ని పొందొచ్చు https://bit.ly/3jVB5M5


అన్ని చోట్ల నుంచి కాపీ!

మీ ఫోన్‌లో ఎక్కడైనా కొంత టెక్ట్స్‌ ఎంపిక చేసుకుంటే దాన్ని కాపీ చేయడానికి ఆప్షన్‌ స్ర్కీన్‌పై కన్పిస్తుంది కదా! అయితే కొన్ని యాప్స్‌లో ఇలా టెక్ట్స్‌ సెలక్ట్‌ చేసుకుని కాపీ చేయడం సాధ్యపడదు. అలాంటప్పుడు universal Cop  అనే యాప్‌ భేషుగ్గా పనిచేస్తుంది. ట్విట్టర్‌లో ట్వీట్స్‌, యూట్యూబ్‌ వీడియోల్లోని డిస్ర్కిప్షన్‌, ఇన్‌స్టాగ్రామ్‌ డిస్ర్కిప్షన్‌, ఇతర కొన్ని యాప్స్‌లోని టెక్ట్స్‌ కాపీ చెయ్యడానికి వీల్లేకుండా డిజేబుల్‌ చేసి ఉన్నప్పుడు ఈ యాప్‌ పనికొస్తుంది. దీన్ని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని, ఏ యాప్‌లో అయినా కావలసిన టెక్ట్స్‌ ఎంపిక చేసుకుని లాంగ్‌ ప్రెస్‌ చేస్తే అది వెంటనే క్లిప్‌బోర్డ్‌లోకి కాపీ అయిపోతుంది. https://bit.ly/2EBFlAp లింక్‌ ద్వారా ఈ యాప్‌ను పొందొచ్చు.


యాప్స్‌లో వెదకడానికి...

మీకు కావలసిన యూట్యూబ్‌ వీడియోలు వెదకాలంటే యూట్యూబ్‌ యాప్‌ ఓపెన్‌చేయాల్సిందే! అలాగే గూగుల్‌ మ్యాప్స్‌లో ఏదైనా లొకేషన్‌నావిగేట్‌ చెయ్యాలన్నా ఆ యాప్‌ ఓపెన్‌ చేయాల్సిందే. టెలీగ్రామ్‌లో కావలసిన కన్వర్‌జేషన్‌ వెదికి పట్టుకోవడానికీ దాన్ని ఓపెన్‌ చెయ్యక తప్పదు. ఇలా ప్రతీ యాప్‌ ఓపెన్‌ చేసి మీకు కావలసిన కంటెంట్‌ కోసం వెదకడం కాకుండా పలు యాప్స్‌ని కంటెంట్‌ని ఒకే ఒక కీవర్డ్‌తో వెదికి పట్టుకోవడానికి Sesame అనే యాప్‌ పనికొస్తుంది. దీని సాయంతో అనేక యాప్స్‌లో సమాచారాన్ని వెదకొచ్చు. ఫోన్లో బ్రైట్‌నెస్‌, ఫాంట్‌ సైజ్‌, బ్యాటరీ వంటి వివిధ కీలకమైన సెట్టింగ్స్‌ని దీని ద్వారానే నేరుగా పొందొచ్చు. మీ ఫోన్‌లో కావలసిన కాంటాక్ట్స్‌, వాట్సప్‌ సంభాషణలు కూడా సులభంగా పొందొచ్చు. తప్పకుండా ప్రయత్నించవలసిన అప్లికేషన్‌ ఇది. https://bit.ly/2Dnjjk4 లింకు నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


స్టేటస్‌ బార్‌ కోసం!

యాపిల్‌ ఐఓయస్‌తో పోలిస్త్తే ఆండ్రాయిడ్‌ని మనకు నచ్చిన విధంగా కస్టమైజ్‌ చేసుకోవచ్చు. Super Status Bar లాంటి యాప్‌ ఉంటే మరింత ఎక్కువగా మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. స్టేటస్‌ బార్‌ ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందడానికి ఉపయోగపడుతుంది. స్టేటస్‌ బార్‌లో ఏయే అంశాలు కనిపించాలి, వేటిని డిజేబుల్‌ చేయాలి అన్నది దీంట్లో సెట్టింగులు మార్చుకోవచ్చు. స్ర్కీన్‌ మీద డబుల్‌ ట్యాప్‌ చేస్తే స్ర్కీన్‌ ఆఫ్‌ అయ్యే విధంగానూ, బ్యాటరీ బార్‌ ఎలా ఉండాలన్నదీ కూడా మార్చుకోవచ్చు. అనేక ఉపయుక్తమైన సెట్టింగ్స్‌ మనకు దీనిలో లభిస్తున్నాయి.https://bit.ly/3jSW0q లింకులో యాప్‌ లభిస్తుంది.


అన్నీ పీసీ నుంచే...

ఆఫీస్‌ పనుల కోసం పీసీ లేదా ల్యాప్‌టాప్‌ ఉపయోగించే సమయంలో ఫోన్‌కి మెసేజ్‌ లేదా వాట్సప్‌ మెసేజ్‌ వస్తే ఫోన్‌ తీసుకుని రిప్లై ఇవ్వడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఉపయోగపడేదే MightyText అనే యాప్‌. ఇది గూగుల్‌ క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ ద్వారా ఫోన్‌లోని దాదాపు అన్ని పనులూ నేరుగా పీసీ ద్వారానే చేసుకునే అవకాశం కల్పిస్తుంది. మీరు ఫోన్‌ పక్కన పడేసినా ఫోన్‌కి వచ్చే మెసేజ్‌లు, ఇతర యాప్స్‌ నుంచి వచ్చే నోటిఫికేషన్లని ఇది మీ పీసీ స్ర్కీన్‌పై చూపిస్తుంది. అలాగే అక్కడి నుంచి మీరు రిప్లైలు కంపోజ్‌ చేసుకోవచ్చు. ఈజీగా కాల్స్‌ అటెండ్‌ చెయ్యడం, కాల్‌ చేయడం సాధ్యపడుతుంది. https://bit.ly/2P7NRck లింక్‌ నుంచి ఈ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పీసీలో క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి దీని ఎక్స్‌టెన్షన్‌ కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.


నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar



Updated Date - 2020-08-01T07:56:08+05:30 IST