Advertisement
Advertisement
Abn logo
Advertisement

తీపి సమస్యకు తేలికైన వైద్యం!

ఆంధ్రజ్యోతి(09-03-2021)

అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన ఆరోగ్య సమస్యల్లో మధమేహం ఒకటి.  నోటి మాత్రలు, ఇంజెక్షన్లతో పాటు షుగర్‌ను నియంత్రణలో ఉంచే సరికొత్త వైద్య విధానాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. వాటి సహాయంతో మధుమేహాన్ని చెప్పుచేతల్లో పెట్టుకునే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు.


అపోహలు - నిజాలు

అపోహ: బరువు పెరిగితే మధుమేహమే!

నిజం: అధిక బరువు కచ్చితంగా అనారోగ్యకరమే! అయితే మధుమేహానికి అధిక బరువుతో పాటు మధుమేహం కలిగిన కుటుంబీకులను కలిగి ఉండడం, అధిక రక్తపోటు, అధిక విశ్రాంతితో కూడిన జీవనశైలి ప్రధాన కారణాలు.

అపోహ: వ్యాయామం రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది

నిజం: మధుమేహం నియంత్రణకు వ్యాయామం తోడ్పడుతుంది. మధుమేహ మందులు వాడుతున్నవాళ్లు వాటితో పాటు ఆహారనియమాలు, వ్యాయామాలతో ఇన్సులిన్‌ స్థాయిని సరిచూసుకుంటూ ఉండాలి. వ్యాయామం చేయడం మూలంగా చక్కెర స్థాయి తగ్గిపోతుందనుకోవడం సరి కాదు.

అపోహ: షుగర్‌ టెస్ట్‌ అవసరం లేదు

నిజం: రక్తంలో చక్కెర స్థాయి పెరిగినా, తగ్గినా తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి పదే పదే షుగర్‌ టెస్ట్‌ చేయించుకోవలసిన అవసరం లేదు అనుకుంటే పొరపాటు. తలతిరగడం, అతిమూత్రం, ఒళ్లు చల్లబడడం లాంటి మధుమేహానికి సంబంధించిన లక్షణాల తీవ్రతలో దీర్ఘకాలంలో మార్పులు వస్తాయి. కాబట్టి లక్షణాల ఆధారంగా చక్కెర స్థాయిని అంచనా వేయడం సరికాదు. క్రమం తప్పకుండా షుగర్‌ టెస్ట్‌ చేసుకుంటూ, మధుమేహాన్ని పర్వవేక్షించుకుంటూ ఉండాలి.

సాధారణంగా రక్తంలో చక్కెర 180 యూనిట్లకు మించితే అది మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీనినే ‘రీనల్‌ థ్రెషోల్డ్‌’ అంటారు. అయితే కొందరికి మధుమేహం లేకపోయినా, రక్తంలో చక్కెర స్థాయి పరిమితి మేరకే ఉన్నా, మూత్రం ద్వారా చక్కెర వృథా అయిపోతూ ఉంటుంది. మూత్రపిండాల్లో ఎంజైమ్‌ పనితీరు దెబ్బతినడమే ఇందుకు కారణం! ఈ పరిస్థితిని అడ్డుకోవడం కోసం పలు ఇన్హిబిటర్‌ మాలిక్యూల్స్‌ తయారయ్యాయి. అలాగే పిత్తాశయం పనితీరును అనుకరించే కృత్రిమ పరికరాలూ అందుబాటులోకి వచ్చాయి. 


సెమాగ్లూటైడ్‌: ఇంజెక్షన్‌, మాత్రల రూపంలో ఉండే ఈ సరికొత్త మాలిక్యూల్‌ జిఎల్‌పి - 1 మధుమేహం అదుపులో ఎంతో సమర్థమైనది. ఇంజెక్షన్‌ అయితే  వారానికి ఒకటి చొప్పున, మాత్రలను రోజూ ఒకటి చొప్పున తీసుకోవడం ద్వారా మఽధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.


కృత్రిమ పిత్తాశయం: మరీ ముఖ్యంగా టైప్‌ 1 డయాబెటిస్‌ ఉన్నవారికి ఇది ఉత్తమమైన చికిత్సా విధానం. కృత్రిమ పిత్తాశయాన్ని అనుకరించే ఈ పరికరం ఆరోగ్యవంతమైన పిత్తాశయం ఎలాగైతే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను పర్యవేక్షిస్తుందో, అంతే సమర్థంగా పనిచేస్తూ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. ఈ కృత్రిమ పిత్తాశయంలో కంటిన్యుయస్‌ గ్లూకోజ్‌ మానిటరింగ్‌ సిస్టం (సి.జి.ఎమ్‌), ఇన్సులిన్‌ ఇన్‌ఫ్యూజన్‌ పంప్‌, గ్లూకోమీటర్‌ను పోలిన బ్లడ్‌ గ్లూకోజ్‌ డివైజ్‌లు ఉంటాయి. కంప్యూటర్‌ పర్యవేక్షణతో నడిచే సిజిఎమ్‌, ఇన్సులిన్‌ ఇన్‌ఫ్యూజన్‌ పంప్‌లు ఒకదానితో ఒకటి అనుసంధానంగా పనిచేస్తూ ఉంటాయి. ‘క్లోజ్‌డ్‌ లూప్‌ కంట్రోల్‌’ అనే పేరున్న ఈ కృత్రిమ పిత్తాశయం కంటిన్యుయస్‌ గ్లూకోజ్‌ మానిటర్‌ సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిలను నిరంతరంగా పర్యవేక్షిస్తూ, అవసరమైన సమయాల్లో ఇన్సులిన్‌ పంప్‌ ద్వారా ఇన్సులిన్‌ను ఆటోమేటిక్‌గా విడుదల చేస్తూ ఉంటుంది. ఇందుకోసం అ పరికరంలో ఇన్సులిన్‌ రిజర్వాయర్‌ ఏర్పాటై ఉంటుంది. 


చక్కెరలో హఠాత్తుగా హెచ్చుతగ్గులు?

‘మందులు సక్రమంగానే వాడుతున్నా షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోతున్నాయి’ అనేది ఎక్కువ మంది మధుమేహుల ప్రధాన అభియోగం. అయితే చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులకు కారణం అందుకు వాడే మందులు పనిచేయకపోవడం వల్ల కాదు. 


ఆహార నియమాలు: మాత్రలు క్రమం తప్పకుండా తీసుకున్నాం కాదా... ఒక్క స్వీటు తింటే ఏం కాదులే! అనుకోవడం, లేదా రోజు కన్నా ఎక్కువగా భోంచేసి, అదనంగా ఒకటికి రెండు చక్కెర మాత్రలు వేసుకుంటే సరిపోతుంది అనుకోవడం కొందరికి పరిపాటి. కానీ ఇలాంటి పనులతో చక్కెర స్థాయిల్లో హఠాత్తుగా హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. వైద్యుల సలహా తీసుకోకుండా అవసరానికి మించి చక్కెర మాత్రలు వాడడం సరికాదు. అలాగే ఆహార నియమాల్లో మార్పుల గురించి, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి.


వ్యాయామం: క్రమం తప్పక వ్యాయామం చేసే సమయంలో అదుపులో ఉండే చక్కెర స్థాయిలు, బద్ధకించి, వ్యాయామం మానేస్తే హెచ్చుతగ్గులకు లోనవడం సహజం. కాబట్టి కంగారు పడకుండా, వ్యాయామాన్ని కొనసాగించాలి.


మందులు: మధుమేహం మందులను నియమిత వేళల్లో, క్రమంతప్పక వాడుకోవాలి. అయితే కొందరు మతిమరుపుతో మందులు వేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలి.


వ్యాధినిర్థారణ: కొన్ని సందర్భాల్లో మధుమేహ నిర్థారణలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మోనోజెనిక్‌ లేదా టైప్‌ - 1 డయాబెటిస్‌ టైప్‌ - 2 డయాబెటి్‌సగా నిర్థారణ చేసి వైద్యం సూచించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా మధుమేహం అదుపు తప్పుతుంది.


కాలేయం లేదా మూత్రపిండాల సమస్యలు: మధుమేహానికి కాలేయం, మూత్రపిండాల సమస్యలు తోడైతే చక్కెర స్థాయి అదుపు తప్పుతుంది. ఉండవలసిన మోతాదు కన్నా చక్కెర స్థాయి తగ్గుతుంది. కాబట్టి కాలేయ, మూత్రపిండాల పనితీరును కనిపెట్టే పరీక్షలు చేయించుకుని, సమస్యలు ఉంటే చికిత్సతో సరిదిద్దుకోవాలి.


హార్మోన్‌ సమస్యలు: హైపో థైరాయిడ్‌, హైపర్‌ థైరాయిడ్‌, ఎడ్రినల్‌ గ్రంథుల సమస్యలు ఉన్నప్పుడు కూడా షుగర్‌ లెవల్స్‌ అదుపు తప్పుతాయి. కాబట్టి ఈ సమస్యలను నిర్థారించే పరీక్షలు చేయించుకుని చికిత్స కొనసాగించాలి.


మోతాదు: ఇన్సులిన్‌ను సమయంలోగా తీసుకోకపోవడం మూలంగా షుగర్‌ లెవెల్స్‌ హఠాత్తుగా పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మధుమేహ మందుల మోతాదులో కూడా హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి చక్కెర స్థాయిని అదుపులో ఉంచే సరైన మధుమేహ మందుల మోతాదు ఎంచుకోవాలి. 


ఇన్సులిన్‌ను సమయంలోగా తీసుకోకపోవడం మూలంగా షుగర్‌ లెవెల్స్‌ హఠాత్తుగా పెరిగిపోతూ ఉంటా యి. కొన్ని సందర్భాల్లో మధుమేహ మందుల మోతాదులో కూడా హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. 


సెమాగ్లూటైడ్‌ ఇంజెక్షన్‌ 

స్థూలకాయం, మందులతో అదుపు చేయలేని మధుమేహంతో బాధపడే వారికి సెమాగ్లూటైడ్‌ ఇంజెక్షన్లతో ప్రయోజనం ఉంటుంది. వారంలో ఒకసారి తీసుకునే ఈ ఇంజెక్షన్‌తో క్లోమంలో ఉండే బీటా సెల్స్‌ ప్రేరేపితమై, ఇన్సులిన్‌ పెరుగుతుంది. అదే సమయంలో ఈ ఇంజెక్షన్‌... పిత్తాశయంలోని హార్మోన్‌ గ్లూకాగాన్‌ను నియంత్రించడం ద్వారా ఇన్సులిన్‌ తయారీని నిలువరిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 


డాక్టర్‌. వి. శ్రీ నగేష్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ అండ్‌ డయబెటాలజిస్ట్‌,హైదరాబాద్‌. 

Advertisement
Advertisement