సులభంగా నిర్మాణ అనుమతులు!

ABN , First Publish Date - 2020-08-06T07:34:03+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు ప్రభుత్వం టీఎ్‌సబీపా్‌సను అమల్లోకి తెచ్చింది. సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే అనుమతుల కోసం

సులభంగా నిర్మాణ అనుమతులు!

స్వీయ ధ్రువీకరణతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు

వెంటనే అనుమతులు మంజూరు 

75 గజాల్లోపు ఎలాంటి అనుమతులూ అక్కర్లేదు

టీఎస్‌బీపాస్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర


హైదరాబాద్‌, ఆగస్టు 5: రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు ప్రభుత్వం టీఎ్‌సబీపా్‌సను అమల్లోకి తెచ్చింది. సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరగాల్సి రావడంతో పాటు అధికారుల వేధింపులు, అవినీతి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది, పారదర్శకంగా, సులభంగా భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు గాను సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతుల ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ (టీఎ్‌సబీపా్‌స)’ను రూపొందించారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుంచే దీన్ని అమలు చేయాలని భావించినా.. కరోనా నేపథ్యంలో ఆలస్యమైంది. తాజాగా బుధవారం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ భేటీలో టీఎ్‌సబీపాస్‌ అమలుకు ఆమోదముద్ర వేశారు. టీఎ్‌సబీపాస్‌ రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలతో పాటు జీహెచ్‌ఎంసీలోనూ వర్తించనుంది. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులిచ్చేందుకు నిర్దేశిత సమయం కంటే చాలా ఎక్కువ కాలం పడుతోంది. టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల జోక్యం ఎక్కువగా ఉంటోంది. అనుమతుల కోసం ఒక్కో వ్యక్తి కనీసం 8 నుంచి 10 మంది అధికారులను కలవాల్సి వస్తోంది. ఒక్కోసారి వీరిని అనేకసార్లు కలవాల్సి రావడంతో అనుమతుల ప్రక్రియలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సులభతర అనుమతుల కోసం టీఎ్‌సబీపా్‌సను అమల్లోకి తెస్తున్నారు. స్వీయ ధ్రువీకరణ ఆధారిత టీఎ్‌సఐపాస్‌ ఆన్‌లైన్‌ వ్యవస్థను 2015 జులైలో అందుబాటులోకి తీసుకొచ్చారు. భవన నిర్మాణ అనుమతులకు కూడా అదే తరహా వ్యవస్థ అవసరమని నిర్ణయించిన సర్కారు టీఎ్‌సబీపా్‌సను రూపొందించింది. మరోవైపు కొత్త మునిసిపల్‌ చట్టం జీహెచ్‌ఎంసీ తప్ప మిగిలిన అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు వర్తిస్తుంది. అయితే 40 శాతానికి పైగా అనుమతులు జీహెచ్‌ఎంసీలోనే ఇస్తుంటారు. కానీ, ఇక్కడ కొత్త మునిసిపల్‌ చట్టం వర్తించదు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఈ పరిస్థితిని నివారించేందుకు గాను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణ సంస్థల్లోనూ టీఎ్‌సబీపాస్‌ చట్టం వర్తించేలా కేబినెట్‌లో ప్రతిపాదించారు. 


టీఎస్‌బీపాస్‌ వివరాలు..

మొబైల్‌ యాప్‌, tsbpass. telangana.gov.in    వెబ్‌సైట్‌, మీసేవ కేంద్రాలు, పురపాలక సంస్థలు/ కలెక్టర్‌ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాల్లో టీఎస్‌బీపాస్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు.

75 చదరపు గజముల లోపు(62.71 చదరపు మీటర్ల లోపు) గల ప్లాట్లలో (7 మీటర్ల ఎత్తు వరకు) భవన నిర్మాణానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. టోకెన్‌ అమౌంట్‌గా ఒక రూపాయి చె ల్లించి నమోదు చేసుకోవచ్చు. స్వీయ ధ్రువీకరణతో పాటు ప్లాటు విస్తీర్ణం, నిర్మించే అంతస్తుల వివరాలను వెల్లడించాలి. 

75 నుంచి 600 చదరపు గజాల ఇళ్ల స్థలాల్లో 10 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో స్వీయ ధ్రువీకరణ అనంతరం ఫీజు చెల్లించిన వారికి వెంటనే అనుమతులు ఇస్తారు. 

600 చదరపు గజాలపైన, 10 మీటర్ల కంటే ఎత్తయిన వాణిజ్య భవనాలు, లే అవుట్లకు ఒకే దరఖాస్తు చేయాలి. భవన నిర్మాణ అనుమతి పత్రం కోసం వివిధ విభాగాలను సంప్రదించాల్సిన అవసరం లేదు. 

21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతి ఇవ్వాలి. అలా కాని పక్షంలో 22వ రోజున ఆటోమేటిక్‌గా డీమ్డ్‌ అనుమతి ఆన్‌లైన్‌లో వచ్చేస్తుంది.  


స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఇచ్చిన అనుమతులను జిల్లా స్థాయిలో కలెక్టర్‌ 

నేతృత్వంలోని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ, జీహెచ్‌ఎంసీలో అయితే జోనల్‌ కమిషనర్‌ నేతృత్వంలోని కమిటీ తనిఖీ చేస్తుంది. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు, అవాస్తవాలు ఉన్నట్లు తేలితే అనుమతులను రద్దు చేస్తారు. 

స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఇచ్చిన అన్ని అనుమతులను టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. 

Updated Date - 2020-08-06T07:34:03+05:30 IST