‘ఆట’ కడతారా..!

ABN , First Publish Date - 2021-07-27T06:34:11+05:30 IST

జిల్లాలో పేకాట ముఠాలు అడ్డుఅదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. ఎక్కడికక్కడ రహస్య స్థావరాల్లో డెన్‌లు ఏర్పాటుచేసుకుంటూ అడ్డేలేదన్నట్టు వ్యవహరిస్తున్నాయి. లక్షల నుంచి కోట్లలో టర్నోవర్‌ నిర్వహిస్తూ పోలీసుశాఖకు సవాల్‌ విసురుతున్నాయి. వారాంతాల్లో ఇతర జిల్లాల నుంచి జూదరులను ఆహ్వానిస్తూ పార్టీలతో పేకాటను రంజుగా మార్చుతున్నాయి. కొండలు, తోటలు, లాడ్జీలు, గోదాముల వరకు వేటినీ వదలకుండా జాతరలా జరిపిస్తున్నాయి. ముఖ్యంగా అనపర్తి కేంద్రంగా వైసీపీ కీలకనేత అనుచరుడు దందా నడుపుతూ ఎదురేలేదన్నట్టు వ్య

‘ఆట’ కడతారా..!

జిల్లాలో అడ్డూఅదుపూ లేకుండా

రెచ్చిపోతున్న పేకాట ముఠాలు

అనపర్తి కేంద్రంగా వైసీపీ ఓ కీలక నేత 

అనుచరుడు డెన్‌ల నిర్వహణ

రోజూ రూ.30 లక్షలకు పైగా టర్నోవర్‌.. 

వారాంతాల్లో రూ.అర కోటిపైనే

జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో 

రౌండ్ల వారీ ఆటలు

కొండలు, జీడి తోటలు, లాడ్జిలు, 

కల్యాణమండపాలే అడ్డాగా ఆటలు

అనేకచోట్ల స్వయంగా సహకరిస్తూ 

ఆర్జిస్తున్న కొందరు పెద్ద ఖాకీలు

నీరుగారిన నిఘా..  

కొత్త సార్‌ అయినా ఆటకట్టిస్తారని ఆశలు


జిల్లాలో పేకాట ముఠాలు అడ్డుఅదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. ఎక్కడికక్కడ రహస్య స్థావరాల్లో డెన్‌లు ఏర్పాటుచేసుకుంటూ అడ్డేలేదన్నట్టు వ్యవహరిస్తున్నాయి.  లక్షల నుంచి కోట్లలో టర్నోవర్‌ నిర్వహిస్తూ పోలీసుశాఖకు సవాల్‌ విసురుతున్నాయి. వారాంతాల్లో ఇతర జిల్లాల నుంచి జూదరులను ఆహ్వానిస్తూ పార్టీలతో పేకాటను రంజుగా మార్చుతున్నాయి. కొండలు, తోటలు, లాడ్జీలు, గోదాముల వరకు వేటినీ వదలకుండా జాతరలా జరిపిస్తున్నాయి. ముఖ్యంగా అనపర్తి కేంద్రంగా వైసీపీ కీలకనేత అనుచరుడు దందా నడుపుతూ ఎదురేలేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాకినాడ, జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో జూదానికి అడ్డేలేకుండాపోతోంది. అనేకచోట్ల సర్కిల్‌ పోలీసు బాస్‌లకు తెలిసే జరుగుతున్న ఈ తంతు వెనుక లక్షల్లో ఆదాయం సదరు ఖాకీలకు కాసుల పంట పండిస్తోంది. బయటకు పొక్కాక జరిగే దాడుల్లోను కొంత స్వాహా చేసేసి కేసుల్లేకుండా చేస్తున్నారు. 


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

అనపర్తి, కాకినాడ, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, పెద్దాపురం నియోజకవర్గాల్లో పేకాట మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. అధికారం చేతిలో ఉండడంతో కొందరు కీలక నేతలు కమీషన్లు పుచ్చుకుని, మరికొందరు అనుచరుల ద్వారా పేకాట ఆడిస్తున్నా రెండుచేతులా సంపాదిస్తున్నారు. పలుచోట్ల పోలీసు బాస్‌ల సూచనల మేరకు సురక్షిత స్థావరాల్లో కోత బంతి, మూడుముక్కలాట, రన్‌మోర్‌, మూడు కాసులాట ఆడిస్తున్నారు. ఎక్కడికక్కడ నీకింత నాకింత అన్న రీతిలో వాటాలు పంచేస్తూ పలుచోట్ల పోలీసులనూ దారికి తెచ్చుకుంటున్నారు. కాకినాడలో కొన్ని హోటళ్లు, లాడ్జిలు, ఇళ్లల్లో పేకాట నిత్యం జరుగుతోంది. శని, ఆదివారాల్లో ఈ టర్నోవర్‌ కోట్లలో ఉంటోంది. అక్కడికక్కడే మందు, విందు సదుపాయం కల్పిస్తున్నారు. ఒక్కో స్థావరం వద్ద రోజుకు రూ.30 లక్షల వరకు టర్నోవర్‌ జరుగుతుందనే విషయం తెలిసినా పోలీసులు కన్నెత్తి చూడడం లేదు. అనపర్తి నియోజకవర్గంలో స్థానిక కీలక నేత అనుచరుడు ఇతర జిల్లాల నుంచి జూదరులను ఆహ్వానించి మరీ గ్రూపులవారీగా పేకాట ఆడిస్తూ టేబుల్‌ కమీషన్‌ రూపంలో రోజూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. జగ్గంపేట నియోజకవర్గంలో రాజపూడి, మల్లిశాల, గండేపల్లి మండలం సూరంపా లెం, కిర్లంపూడి మండలంలో గెద్దనాపల్లి-పెద్దానాపల్లి మధ్య, తోటల్లో పేకాట రేయింబవళ్లు జాతరలా నిర్వహిస్తున్నారు. పామాయిల్‌, జీడితోటల్లో ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో కూడా దర్జాగా సాగుతున్నాయి. ఇక్కడున్న స్థానిక పోలీసు ఉన్నతాధికారికి మామూళ్లు లక్షల్లో ఇచ్చి కోట్లలో టర్నోవర్‌ చేస్తున్నారు. ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలంలో తిరుమాలి, శంఖవరం మండ లాల్లో శాంతి ఆశ్రమం వైపు వెళ్లే దారిలో కొండలు, గుట్టలు, తోటల్లో ముఠాలు దర్జాగా పేక ఆడిస్తున్నాయి. ఏరోజుకారోజు రెండు లక్షల వరకు స్థానిక పోలీసు నుంచి సర్కిల్‌బాస్‌ వరకు వాటాలు వెళ్లిపోతున్నాయి.


తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో  కొందరు పోలీసులే ముఠాలకు సురక్షిత స్థావరాల ఎక్కడోచెప్పి ఆడిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే తమ సర్కిల్‌ పరిధిలో పేకాట ఎంత ఎక్కువగా జరిగితే అంత ఆదాయం అన్నట్టు కొందరు పోలీసులు భావిస్తున్నారు. గతంలో తొండంగి ఎస్‌ఐగా పనిచేసిన గోపాలకృష్ణ మామూళ్లు పుచ్చుకుని పేకాట ఆడించారు. తీరా డీఐజీ ఆదేశాలమేరకు దాడిచేయక తప్పలేదు. దీంతో డబ్బులు ఇచ్చిన ముఠాలు ఎస్‌ఐపై దాడిచేశాయి. విషయం బయటకు పొక్కడంతో సస్పెండయ్యారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓ సీఐ స్వయంగా పేకాటను ప్రోత్సహిస్తున్నట్టు ఇంటెలిజెన్స్‌ నివేదికలు వెళ్లడంతో కొన్ని నెలల కింద వేటు పడింది. పిఠాపురం సర్కిల్‌ అధికారి మామూళ్ల వ్యవహారంపైనా గతంలో ఓ డీఎస్పీ విచారణ చేపట్టారు. గత జిల్లా పోలీసుబాస్‌ పేకాట ముఠాల దందా, ఖాకీల మద్దతు విషయం బయటకు వచ్చినా పట్టనట్టే వ్యవహరించారు. దీంతో పేకాటరాయుళ్లు రెచ్చిపోయారు. ఇప్పుడు కొత్త బాస్‌ రవీంద్రనాథ్‌ పేకాట ముఠాల కోరలు పీకాల్సిన తరుణం ఆసన్నమైంది. అటు ముఠాలకు సహకరిస్తున్న కొందరు పోలీసులను దారికి తేవాల్సి ఉందని ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది.

Updated Date - 2021-07-27T06:34:11+05:30 IST