కొవిడ్‌ వంకతో సంప్రదాయాలను మంటగలుపుతారా?

ABN , First Publish Date - 2021-01-21T18:30:18+05:30 IST

సత్యదేవుడి సన్నిధిలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు..

కొవిడ్‌ వంకతో సంప్రదాయాలను మంటగలుపుతారా?

సంక్రాంతి సంబరాలు నిలుపుదలపై రత్నగిరి పాలకవర్గం సీరియస్‌


అన్నవరం(తూర్పు గోదావరి): సత్యదేవుడి సన్నిధిలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు నిర్వహించకపోవడంపై పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్‌ పేరుతో సంస్కృతి, సంప్రదాయాలను మంటగలుపుతారా? అని అధికారులను ప్రశ్నించారు. కనీసం ఆలయ ప్రాంగణంలో ముగ్గు కూడా వేయలేదని విస్మయం వ్యక్తం చేశారు. సింహాచలం, ఇతర ఆలయాల్లో సంక్రాంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారని, అక్కడ లేని నిబంధనలు ఇక్కడేంటి అని ప్రశ్నించారు. రత్నగిరిపై చైర్మన్‌ రోహిత్‌ అధ్యక్షతన బుధవారం పలు అభివృద్ధి అంశాలపై పాలకమండలి చర్చి ంచింది. ఇటీవల రత్నగిరిపై నిర్వహించిన కోటి తులసి పూజకు దాతల నుంచి రూ.8,50,195 విరాళాలు రాగా ఖర్చులు పోను మిగిలిన రూ.5,37,795 నగదును బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని పాలక మండలి నిర్ణయించింది. స్వామివారి ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి  కిలో రూ.462.50 కొనుగోలు చేయడానికి అంగీకారం లభించింది.


సత్యగిరిపై విష్ణుసదన్‌ సమీపంలో సుమారు 60 గదులు నిర్మించేందుకు దాతలు సుముఖత వ్యక్తం చేయగా, మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అన్నదాన విభాగంలో వడ్డన సిబ్బందికి ఇచ్చే కమిషన్‌ రేటు పెంచేందుకు గాను కమిషనర్‌ ఆమోదానికి పంపాలని తీర్మానించారు. రూ.10.85 లక్షల వ్యయంతో 102 సీసీ కెమెరాలు వాటికి సంబంధించిన పరికరాల ఏర్పాటుకు పాలక మండలి ఆమోదం లభించింది. సమావేశంలో ఈవో త్రినాథరావు, సహాయ కమిషనర్‌ రమే్‌షబాబు, సభ్యులు వాసిరెడ్డి జగన్నాఽథం, కొండవీటి సత్యనారాయణ, బదిరెడ్డి ఆశాలత, గాదె రాజశేఖరరెడ్డి, ముత్యాల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T18:30:18+05:30 IST