తూ.గో.జిల్లా: అనపర్తి మండలం కొప్పవరంలో వింత ఆచారం

ABN , First Publish Date - 2022-02-28T21:39:48+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, కొప్పవరంలో మాత్రం వింత ఆచారం ఉంది. ఇక్కడ భక్తులను పూజారి బడితతో కొడుతుంటారు.

తూ.గో.జిల్లా: అనపర్తి మండలం కొప్పవరంలో వింత ఆచారం

తూ.గో.జిల్లా: సాధారణంగా దేవుడికి మొక్కులు చెల్లించుకోవాలంటే భక్తులు ఏం చేస్తారు? కొబ్బరికాయలు కొట్టి, డబ్బులు హుండీలో వేసి కోర్కెలు నెరవేర్చమని కోరుకుంటారు. కానీ తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, కొప్పవరంలో మాత్రం వింత ఆచారం ఉంది. ఇక్కడ భక్తులను పూజారి బడితతో కొడుతుంటారు. ఇక్కడ పూజారితో బడిత పూజ చేయించుకుంటే అమ్మ కరుణిస్తుందని భక్తుల నమ్మకం. కర్రి వంశీయుల ఆరాధ్య దైవంగా సత్తెమ్మ అమ్మవారిని కొలుస్తుంటారు. సుమారు 2వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అమ్మవారి వింత ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. రెండేళ్లకొసారి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారి కత్రి కుండను మిద్దిపై నుంచి దింపి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా పూజలు నిర్వహించిన కత్రి కుండను మహిళలు తలపై ధరిస్తే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. దీంతో సుమారు 4 వందల మంది మహిళలు కత్రి కుండను ధరించి సంతానం కోసం దేవతను మొక్కుతారు. అదే విధంగా రెండో రోజున భక్తులు వేషాలు ధరించి ఊరి చివరన ఉన్న నాగుల పుట్టకు చేరుకుని పూజుల చేసి నాగేదేవకు పాలుపోస్తారు. ఆలయ ప్రాంగణంలో గణపతి ఆకారంలో ఉన్న వేపచెట్టుకు భక్తులు పూజలు నిర్వహించి ముడుపులు కట్టుకుంటారు.


ఆలయ ప్రాంగణంలో పూజారి బెత్తంతో సిద్ధంగా ఉంటారు. భక్తుల్ని బెత్తంతో దండించి ఆశీర్వదిస్తారు. ముందు సాఫీగా సాగే బెత్తం బాదుడు రాను రాను ఊపందుకుంటుంది. పూజారితో బెత్తం దెబ్బలు తినేందుకు భక్తులు ఉత్సాహంగా ముందుకు వస్తారు. ఈ తతంగం కన్నుల పండువగా సాగుతుంది. ఇలా దెబ్బలు తినడం భక్తులు అదృష్టంగా భావిస్తారు. ఇలా బడిత పూజ చేయించుకుంటే అమ్మ తమను కరుణిస్తుందని భక్తుల విశ్వాసం. పుట్ట వద్దకు వెళ్ళేందుకు రకరకాల వేషాలు ధరించిన భక్తులు మోటారుసైకిళ్లపై తిరుగుతుండడంతో ఊరంతా కొత్త వాతావరణం ఏర్పడింది. కోయ దొరలు, శక్తి వేషాలు, పురుషులు మహిళలు గాను, చిన్నారులు ఈశ్వరుడు, శ్రీకృష్ణుడు తదితర వేషాలతో భక్తులను ఆకట్టుకున్నారు.

Updated Date - 2022-02-28T21:39:48+05:30 IST