ప్రజా సంక్షేమమే లక్ష్యంగా యంత్రాంగం కృషి

ABN , First Publish Date - 2021-01-27T06:39:40+05:30 IST

కాకినాడ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షేమం, అభివృద్ధి, జీవన ప్రమాణాలే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో ముందుకు వెళ్తోందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు ప్రజాప్రతినిదులు, అధికారులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆయన కొనియాడారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా యంత్రాంగం కృషి
జాతీయ పతాకానికి వందనం చేస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి

నవరత్నాల్లో ప్రాధాన్యతా అంశాలు విజయవంతంగా అమలు 

నివర్‌ తుపానుకు నష్టపోయిన 1,01,213 మంది 

రైతులకు రూ.59.10 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ

 పీఎం కిసాన్‌, రైతు భరోసాలతో 4.64 లక్షల 

మంది రైతులకు రూ.517.17 కోట్ల ఆర్థిక సహాయం

72వ గణతంత్ర వేడుకలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి


కాకినాడ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షేమం, అభివృద్ధి, జీవన ప్రమాణాలే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో ముందుకు వెళ్తోందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు ప్రజాప్రతినిదులు, అధికారులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆయన కొనియాడారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్‌ పెరేడ్‌ మైదానం ఆవరణలో మంగళవారం నిర్వహించిన వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. తొలుత ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలతో ప్రాధాన్యతాక్రమంలో అన్ని అంశాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. నివర్‌ తుపానులో నష్టపోయిన 1,01,213 మంది రైతులకు ప్రభుత్వం రూ.59.10 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించిందన్నారు. పీఎం కిసాన్‌, రైతు భరోసాలతో 4.64 లక్షల రైతులకు రూ.517.17 కోట్ల ఆర్థిక సహాయం అందించా మన్నారు. పంటల బీమా ద్వారా 13,821 మంది రైతుల ఖాతాల్లో రూ.18.32 కోట్లు జమ చేశామన్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద పంట రుణాల రూపేణా 1,06,887 మంది రైతులకు రూ.19.8 కోట్లు లబ్ధి చేకూర్చామన్నారు. జలకళ పథకం ద్వారా రైతులకు ఉచితంగా బోరు బావులు వేసి మోటార్లు ఏర్పాటుచేసే క్రమంలో 17 గ్రామీణ నియోజకవర్గాల్లో రిగ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్‌కేవీవై), జాతీయ ఆహార భద్రత మిషన్‌, రాష్ట్ర ప్రణాళిక పథకాలతో 36,657 ఉద్యానవన రైతుల ప్రయోజనం కోసం రూ.32.47 కోట్లతో వార్షిక ప్రణాళిక అమలు చేస్తున్నామని కలెక్టర్‌ వెల్లడించారు. వైఎస్సార్‌ చేయూత పథకం కింద పశుసంవర్థక శాఖ ద్వారా 45 నుంచి 56 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మహిళలకు పాడి పశువులు, మేకలు, గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తున్నామన్నారు.


వేట నిషేధ సమయంలో 24,611 మంది మత్య్సకారులకు భరోసా కింద రూ.26.62 కోట్లు ఆర్థిక సహాయం చేశామన్నారు. అమ్మఒడి కింద 4,83,622 మంది తల్లుల ఖాతాల్లో రూ.726 కోట్లు ప్రభుత్వం జమ చేసిందన్నారు. విద్యా కానుక కింద 4,39,318 మంది విద్యార్థులకు స్కూలు కిట్లు పంపిణీ చేశామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా 34వేల మందికి తొలి విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ జరుగుతోందన్నారు. గృహ నిర్మాణ శాఖ ద్వారా అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 3,84,218 మంది లబ్ధిదారులకు అందరికీ ఇళ్ల పథకంలో స్థలాలు ఇస్తున్నామన్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా జిల్లాలో 16, 24,243 మంది బియ్యం కార్డుదారులకు నెలనెలా రేషన్‌ అందిస్తున్నామన్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వారిళ్లకే నేరుగా సరుకులు పంపిణీ చేస్తామన్నారు. డీఆర్డీఏ, మెప్మా, ఉపాధి హామీ, మౌలిక సదుపాయాలు, భూ హక్కు, గ్రామ/వార్డు సచివాలయాలు, రెవెన్యు, పోలీసు శాఖల ద్వారా ప్రజా సంక్షేమానికి చేస్తున్న కృషిని కలెక్టర్‌ వివరించారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మె ల్సీ డాక్టర్‌ పండుల రవీంద్రబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జేసీలు సీహెచ్‌ కీర్తి, రాజకుమారి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, అదనపు ఎస్పీ కరణం కుమార్‌, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T06:39:40+05:30 IST