అదిగో..ఇదిగో..!

ABN , First Publish Date - 2021-11-30T06:50:33+05:30 IST

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) జిల్లాలో టిడ్కో ఇళ్ల పరిస్థితి ఘోరంగా మారింది. నిర్మాణాలు పూర్తిచేసు కుని ఏళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖాళీగానే ఉంచుతోంది. గృహ ప్రవేశాల కోసం లబ్ధిదారులు ఎదురుచూసీచూసీ అలిసిపోయారు. ప్రతిపక్ష టీడీపీ ఆందోళనలు చేసిన ప్రతిసారీ అదిగో ఇచ్చేస్తున్నాం అంటూ తేదీ

అదిగో..ఇదిగో..!

జిల్లాలో టిడ్కో భవనాలకు మోక్షం ఇంకెన్నాళ్లకో 

ఇస్తాం.. ఇచ్చేస్తాం అంటూ ప్రభుత్వం కాలక్షేపం

రూ.38.98 కోట్లతో మౌలిక వసతులకు టెండర్‌ జారీ

ఫేజ్‌-1, ఫేజ్‌-2 కింద తొమ్మిది వేల ఇళ్లకు సౌకర్యాలు నిల్‌

ఈ పనులు మొదలై పూర్తవడానికి ఏడాదైనా పట్టే పరిస్థితి 

అటు టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకురాని నేపథ్యం 

సొంతిళ్లు చేతికి వస్తాయో రావోనని లబ్ధిదారుల ఆవేదన

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో టిడ్కో ఇళ్ల పరిస్థితి ఘోరంగా మారింది. నిర్మాణాలు పూర్తిచేసు కుని ఏళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖాళీగానే ఉంచుతోంది. గృహ ప్రవేశాల కోసం లబ్ధిదారులు ఎదురుచూసీచూసీ అలిసిపోయారు. ప్రతిపక్ష టీడీపీ ఆందోళనలు చేసిన ప్రతిసారీ అదిగో ఇచ్చేస్తున్నాం అంటూ తేదీ ప్రకటించడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. డిసెంబరుకు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం హామీ దగ్గరపడుతున్నా చప్పుడు మాత్రం లేదు. ఫేజ్‌-1, ఫేజ్‌-2లో నిర్మించిన కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రం తాజాగా రూ.38 కోట్లతో సర్కారు టెండర్లు పిలిచింది. ఇవి పూర్తికావడానికి ఏడాదికిపైనే పట్టనుంది. అంటే అప్పటి వరకు ఇళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. మరోపక్క ప్రభుత్వం పిలిచే టెండర్లకు కాంట్రాక్టర్లు అసలు స్పందించడం లేదు. ఈ తరుణంలో టిడ్కో పనులు చేప ట్టేందుకు ఎవరూ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో టిడ్కో కథ కంచికి చేరడం ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారింది. నగరాలు, పట్టణాల్లోని పేదలకు సొంతింటి కల నెరవేర్చే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం జిల్లాలో ఎన్టీఆర్‌ గృహా నిర్మాణ పథకం కింద టిడ్కో ఇళ్ల కాలనీలు నిర్మించింది. జిల్లాలో మొదటి విడత అమలాపురం బోడసకుర్రులో 1,632 ఇళ్లు, పెద్దా పురం వాలుతిమ్మాపురంలో 1,728, పిఠాపురం రూరల్‌ గోర్సలో 864, సామ ర్లకోట పరిధిలో రెండుచోట్ల 1,056, రామచంద్రపురంలో 1,088, మండపేట గొల్లపుంతలో 4,064, రాజమహేంద్రవరం పరిధిలోని బొమ్మూరులో 2,528, తొర్రేడు 896 కలిపి మొత్తం 13,856 ఇళ్లు నిర్మించారు. ఇందులో 90 శాతం ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధమవగా లాటరీలో లబ్ధిదారులకు కేటాయించారు. ఫేజ్‌-2, ఫేజ్‌3 కింద అప్పటి ప్రభుత్వం కాకినాడ పర్లోవపేటలో 2,056, రాజ మహేంద్రవరం మోరంపూడి డి-బ్లాక్‌లో 224, ధవళేశ్వరంలో 256, ఫేజ్‌-3 కింద రామచంద్రపురం కొత్తూరులో 960, పెద్దాపురంలో 1,584, మండ పేటలో 2,064, రాజమహేంద్రవరం పరిధిలోని బొమ్మూరులో 1,200, నామ వరం 1,104, సింహాచలనగర్‌లో 96 చొప్పున మొత్తం రెండు విడతల్లో కలిపి 23,410 ఇళ్లు మంజూరుచేసి నిర్మాణాలు ప్రారంభించింది.


ఇందులో చాలా ఇళ్లు సింహభాగం నిర్మాణం పూర్తి చేసుకున్నాయి.ఈలోపు ప్రభుత్వం మార డంతో లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించకుండా ఆపేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లు ఇస్తే తమకు పేరు రాదనే ఉద్దేశంతో గడచిన రెండున్నరేళ్లుగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం నాన్చుతోంది. కాలనీలో ఇళ్లకు పాత ప్రభుత్వంలో వేసిన రంగులను మార్చి వైసీపీ జెండా రంగులు వేసింది. కానీ ఇళ్లు మాత్రం చేతికి ఇవ్వలేదు. ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకపోతే బలవంతంగా గృహప్రవేశాలు చేయిస్తామంటూ టీడీపీ డెడ్‌లైన్‌విధించింది. దీంతో సీఎం జగన్‌ ఇటీవల నిర్వహించిన సమీ క్షలో డిసెంబరు నాటికి ఇళ్లు అందిస్తామని ప్రకటించారు.


కానీ గడువు సమీ పించినా ఆ దిశగా అడుగులు లేవు. చివరకు ఫేజ్‌-1,2,3 టిడ్కో కాలనీల్లో రహదారులు, డ్రెన్లు, నీటి వసతి కల్పించేందుకు వీలుగా టెండర్‌ సర్కారు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఫేజ్‌-1లో 90 శాతం మౌలిక వసతులు రెండున్నరేళ్ల కిందే పూర్తవగా, ఫేజ్‌-2,3లో పెద్దఎత్తున మౌలిక సదుపా యాలు నిర్మించాలి. ఇందుకోసం మొత్తం మూడు విడతలకు సంబంధించి గుర్తించిన కాలనీలో వసతులకు రూ.38.98 కోట్లు ఖర్చవుతాయని అంచనా. డిసెంబర్‌ 16 టెండర్‌ దాఖలుకు చివరి తేదీ. వాస్తవానికి ఇప్పుడు పనులు చేపడితే ఏడాదికి వరకు కాలనీల్లో మౌలిక వసతులు పూర్తికావు. అటు మొదటివిడత సిద్ధమైన ఇళ్లు డిసెంబరులో ఇచ్చే ఉద్దేశం ఉంటే ఈపాటికే ఆ కాలనీల్లో వసతుల కల్పన పూర్తిచేయాలి. కానీ ఇదేదీ జరగలేదు.దీంతో ఇళ్లు ఇప్పట్లో లబ్ధిదారులకు అందడం కష్టమే. మరోపక్క రహదారుల దగ్గర నుంచి ఆసుపత్రుల వరకు ప్రభుత్వం ఏ టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన శూన్యంగా ఉంటోంది. టెండర్‌ దక్కించుకుంటే ప్రభుత్వం బిల్లులు ఇవ్వదని అర్థమైపోయి అంతా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు పిలిచిన రూ.38.98 కోట్ల టెండర్‌కు కాంట్రాక్టర్ల ముందకు వస్తారనే నమ్మకం అధికారుల్లో లేదు. దీంతో టిడ్కో కాలనీల్లో పనులు ఎలా చేస్తారో చూడాలి.

Updated Date - 2021-11-30T06:50:33+05:30 IST