షాకింగ్: తగ్గిపోతున్న భూమి అయస్కాంత శక్తి

ABN , First Publish Date - 2020-05-25T01:48:25+05:30 IST

శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. భూ అయస్కాంత శక్తి క్రమంగా తగ్గిపోతోందని, ఫలితంగా భూమి

షాకింగ్: తగ్గిపోతున్న భూమి అయస్కాంత శక్తి

న్యూఢిల్లీ: శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. భూ అయస్కాంత శక్తి క్రమంగా తగ్గిపోతోందని, ఫలితంగా భూమి చుట్టూ తిరుగుతున్న కొన్ని ఉపగ్రహాలలో సాంకేతికపరమైన అవాంతరాలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భూమిపై మనుగడకు ఈ అయస్కాంత క్షేత్రం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఇది సూర్యుడి నుంచి విడుదలయ్యే చార్జ్‌డ్ పార్టికల్స్, హానికారకమైన కాస్మిక్ రేడియేషన్ నుంచి ఇది మనలను రక్షిస్తుందని వివరించారు.


ఈ క్షేత్రం ఎక్కువగా భూమి లోపల ఉన్న సూపర్-హాట్ లిక్విడ్ ఐరన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది భూమి బాహ్యకేంద్రంగా ఉంటుంది. మన కాళ్ల కింద దాదాపు 3 వేల కిలోమీటర్ల కింద ఉంటుంది. ఇది విద్యుత్ ప్రవాహాలను సృష్టించి మన విద్యుదయస్కాంత క్షేత్రాన్ని మారుస్తుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) తెలిపింది. ఈ క్షేత్ర బలం, దిశ మారుతూ ఉంటుందని, గత 200 ఏళ్లలో దాదాపు 9 శాతం బలాన్ని ఇది కోల్పోయిందని ఈఎస్ఏ పేర్కొంది. 


ఈ అసాధారణ విషయాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు 1970-2020 మధ్య ఆఫ్రికా నుంచి దక్షిణ అమెరికా వరకు విస్తరించి ఉన్న ఒక పెద్ద ప్రాంతంలో అయస్కాంత క్షేత్రం గణనీయంగా బలహీనపడిందని గుర్తించారు. దీనిని ‘సౌత్ అట్లాంటిక్ అనోమలీ’ అని పిలుస్తారన్నారు. ఈ ప్రాంతం ఏడాదికి 20 కిలోమీటర్ల చొప్పున పశ్చిమ దిశగా పెరిగినట్టు వివరించారు. అయితే, అయస్కాంత క్షేత్రం తగ్గడానికి గల కారణం పూర్తిగా తెలియకపోవడంతో, దీని గురించి మరింతగా తెలుసుకోవడానికి పరిశోధకులు ఈఎస్ఏ సమూహ రాశిని ఉపయోగిస్తున్నారు.  



Updated Date - 2020-05-25T01:48:25+05:30 IST