11 గ్రామాల్లో భూ ప్రకంపనాలు

ABN , First Publish Date - 2021-07-24T06:30:25+05:30 IST

పుంగనూరు పరిసరగ్రామాల్లో భూప్రకంపనలకు జడిసి జనం భయాందోళనతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

11 గ్రామాల్లో భూ ప్రకంపనాలు
షికారిపాళ్యంలో నెర్రెలు చీలిన ఇళ్లు

భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు  


పుంగనూరు, జూలై 23: పుంగనూరు పరిసర గ్రామాల్లో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 3-30 గంటల నుంచి 5-45 గంటలలోపు మూడుసార్లు  భూమి కంపించడం వల్ల ఇళ్లలోని పాత్రలు, వస్తువులు కిందపడడంతో ప్రజలు ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.బోడేవారిపల్లె పంచాయతీ ఈడిగపల్లె, చిలకవారిపల్లె, కోటగడ్డ, మొరసనపల్లె, అక్కింవారిపల్లె, నేతిగుట్లపల్లె పంచాయతీలోని షికారిపాళ్యం, ఆరంట్లపల్లె, ఆవులపల్లె, కంభంవారిపల్లె, ఎర్రగుంట్లపల్లె, కురవూరు గ్రామాల్లో భూప్రకంపనలు సంభవించాయి. హఠాత్తుగా పెద్దశబ్దంతో భూమి ఊగినట్లు అన్పించిందని స్థానికులు చెబుతున్నారు.కొందరి ఇళ్ల గోడలు నెర్రెలు బారడం, వస్తువులు పడిపోయి వుండడం గమనించారు.ఈ విషయం తెలియగానే కలెక్టర్‌ హరినారాయణన్‌ తహసీల్దార్‌ వెంకట్రాయులును గ్రామాల్లో విచారించి నివేదిక పంపాలని ఆదేశించారు. దీంతో ఆర్‌ఐ రాంప్రసాద్‌, వీఆర్వో వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి నరసింహులు తదితరులతో తహసీల్దార్‌ గ్రామాల్లో విచారణ చేపట్టారు. షికారిపాళ్యంలోని విజయ్‌, అనిత, కాళిదాస్‌ తదితరులు తమ ఇళ్ల గోడలు బీటలు వారాయని, కిటికీ అద్దాలు పగిలి, పాత్రలు, వస్తువులు కింద పడిపోయాయని తెలిపారు. మిగిలిన గ్రామాల్లో ఎలాంటి ఆస్తినష్టం సంభవించలేదని,భూమి కంపించడంతో జనం భయబ్రాంతులకు గురైనట్లు తహసీల్దార్‌ వివరించారు. బోడేవారిపల్లె పంచాయతీలో గతంలో కూడా భూకంపం వచ్చినట్లు గ్రామస్తులు చెప్పుకొచ్చారు.వ్యవసాయం కోసం రైతులు 1000 అడుగులకు పైగా చాలా బోర్లు వేశారు. రెండుమార్లు ఈ ప్రాంతంలోనే భూమి కంపించడానికి గల కారణాలను అన్వేషించాల్సిన అవసరముంది. 


భయంతో పరుగులు తీశాం: అనిత, షికారిపాళ్యం

 అందరూ నిద్రపోతున్న సమయంలో భయంకరమైన శబ్దం వచ్చింది. ఇల్లు ఏమైనా పడిపోతుందా అనే అనుమానంతో బయటికి పరుగులు తీశాం. ఇంటి కిటికీ అద్దం పగిలింది. పాత్రలు పడిపోయాయి. అప్పటికే ఊర్లో అందరూ భయంతో రోడ్డుపై ఉన్నారు.దాదాపు గంట పాటు ఇళ్లలోకి వెళ్లలేదు.  


పెద్ద శబ్దం వచ్చింది: బాలకృష్ణారెడ్డి, చిలకవారిపల్లె

భూమి కదులుతూ పెద్ద శబ్దం వచ్చింది. ఏదో ప్రమాదం జరిగిందని భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చాం. మూడుసార్లు భూకంపం రావడంతో చాలా సేపు బయటే ఉన్నాం. కానీ ఏలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. మా వ్యవసాయ బోరులో మాత్రం మోటరు ఆన్‌ చేయకపోయినా నీరు బోరు నుంచి వాటంతట అవే ఉబుకుతున్నాయి. 

Updated Date - 2021-07-24T06:30:25+05:30 IST