నా రాజీనామాతో బీజేపీలో భూకంపం: స్వామి ప్రసాద్ మౌర్య

ABN , First Publish Date - 2022-01-12T22:51:51+05:30 IST

తన రాజీనామాతో భారతీయ జనతా పార్టీలో భూకంపం మొదలైందని మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. మంగళవారం తన మంత్రి పదవితో పాటు భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీలో..

నా రాజీనామాతో బీజేపీలో భూకంపం: స్వామి ప్రసాద్ మౌర్య

లఖ్‌నవూ: తన రాజీనామాతో భారతీయ జనతా పార్టీలో భూకంపం మొదలైందని మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. మంగళవారం తన మంత్రి పదవితో పాటు భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే మౌర్య రాజీనామా చేసిన కొద్ది సమయానికే బీజేపీకి చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎస్పీలో చేరారు. ఇక బుధవారం మరో మంత్రి దారా సింగ్ చౌహాన్ సైతం తన మంత్రి పదవితో పాటు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.


ఈ సందర్భంగా మౌర్య మాట్లాడుతూ ‘‘నేను మంత్రిగానే తప్పుకున్నాను. బీజేపీ నుంచి త్వరలోనే తప్పుకుంటాను. ఇప్పుడు అయితే నేను సమాజ్‌వాదీ పార్టీలో చేరడం లేదు’’ అని జోకులు చేశారు. అనంతరం మాట్లాడుతూ ‘‘బీజేపీని నేను తిరస్కరించాను. ఇక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. జనవరి 14న సమాజ్‌వాదీ పార్టీలో చేరుతున్నాను. పెద్ద నేతల నుంచి కానీ చిన్న నేతల నుంచి కానీ నాకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు’’ అని అన్నారు. అఖిలేష్ యాదవ్ తనకు ఇప్పటికే అభినందనలు తెలిపారని, ఈరోజు రేపు తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి వాళ్ల అభిప్రాయాలు తీసుకుంటానని మౌర్య అన్నారు.


ఉత్తరప్రదేశ్‌లోని 403 సీట్లు అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుంది. అనంతరం ఫిబ్రవరి 14,20,23,27, మార్చి 3, 7వ తేదీల్లో జరిగే పోలింగ్‌తో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మార్చి 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లతో ఘన విజయం సాధించింది. 39.67 శాతం ఓట్ల షేర్ సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ 47, బీఎస్‌పీ 19, కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకున్నాయి.

Updated Date - 2022-01-12T22:51:51+05:30 IST