పట్టాలుగా.. డీ పట్టాలు

ABN , First Publish Date - 2022-05-30T06:40:40+05:30 IST

చుక్కల భూములను కమర్షియల్‌గా మార్చేశారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టాలను మ్యుటేషన పేరుతో ఆనలైనలో పట్టాలుగా సృష్టించేశారు.

పట్టాలుగా.. డీ పట్టాలు
సర్వేనెంబరు 506కు సంబంధించి అడంగల్‌లో వివిధ పేర్లతో పట్టాగా చూపుతున్న వైనం

భూమాయ

మ్యుటేషన ముసుగులో తతంగం

రూ.కోట్లకు పెరిగిన భూములు విలువ

ఆ అధికారికి రూ.కోట్లలో ముడుపులు

కార్యాలయంలో మందు.. విందు.. ఇంకా..


చుక్కల భూములను కమర్షియల్‌గా మార్చేశారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టాలను మ్యుటేషన పేరుతో ఆనలైనలో పట్టాలుగా సృష్టించేశారు. దీంతో రూ.లక్షల విలువ చేసే ఆ భూములు ఇప్పుడు రూ.కోట్లలో పలుకుతున్నాయి. వీటిని రిజిస్ర్టేషన చేసుకుంటున్న రియల్‌ వ్యాపారులు రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగాన్ని ముందుండి నడిపించిన రెవెన్యూ అధికారులకు రూ.కోట్లలో ముడుపులు అందుతున్నాయి. అనంతపురం రెవెన్యూ డివిజన పరిధిలోని కూడేరు మండలంలో ఈ భూ దందా జరుగుతోంది. ప్రభుత్వ భూములకు ఇష్టారాజ్యంగా పట్టాలు సృష్టించి బురిడీ కొట్టిస్తున్నారు. డైక్లాట్‌లో మాత్రం చుక్కల భూమిగానే స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా డీ పట్టాలను తక్కువ ధరకు కొనుగోలు చేసిన కొందరు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడు తున్నారు. కూడేరు మండలంలో ఈ వ్యవహారం పరిపాటిగా మారింది. అక్కడ పనిచేస్తున్న ఓ అధికారి అంతా తానై చక్రం తిప్పుతున్నారు. 

- అనంతపురం క్రైం



మ్యుటేషన పేరుతో మాయ

ప్రభుత్వ భూములను అమ్మకూడదు, కొనకూడదు. కానీ రెవెన్యూ అధికారులు దొడ్డిదారి చూపించి, వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఎలాంటి అనుమానం రాకుండా, వాటిని సాధారణ పట్టాలుగా సృష్టించేస్తున్నారు. కూడేరు మండలం కమ్మూరు గ్రామ సర్వే నెంబరు 506లో డైక్లాట్‌ ప్రకారం 19.10 ఎకరాల చుక్కల భూమి ఉంది. భూ పంపిణీలో భాగంగా డీ పట్టాలిచ్చారు.  1953 కంటే ముందే పట్టా ఇచ్చి ఉంటే, ఆర్‌హెచ ఎంటరై ఉంటుంది. కానీ ఈ భూమికి ఆర్‌హెచ ఎంటర్‌ కాలేదు. డీ పట్టాలను సీసీఎల్‌ఏ ద్వారా డిలీషన (డీ పట్టా తొలగించి పట్టాగా ఇవ్వడం) చేయాలి. లేదంటే ఎనఓసీ రావాలి. ఎనఓసీ రానికారణంగా మ్యుటేషన (అడంగల్‌లో కరెక్షన) చేసి పట్టాగా సృష్టించారు. ఇలా చేస్తే 1బీ అడంగల్‌ కూడా వచ్చేస్తుంది. దీని ద్వారా రిజిస్ర్టేషన చేసుకోవడానికి అవకాశముంటుంది. అలా రిజిస్ర్టేషనతో ఈసీ ఎంటర్‌ కావడంతో పాటు డాక్యుమెంట్‌ ద్వారా భూమి విలువ పెరుగుతుంది. ఇప్పుడు అక్కడ భూమి విలువ రూ.80 లక్షల నుంచి రూ.కోటికి పైగా పలుకుతోంది. ఆరుగురికి పైగా భాగస్వాములు ఉన్నారు. ఈ భూమిని అమ్మకానికి పెట్టారు. ఒకరి పేరుతో 4.80 ఎకరాలు, మరొకరి పేరుతో 4.80 ఎకరాలు, మరో ఐదుగురి పేరుతో రెండు ఎకరాలు చొప్పున పట్టాలు సృష్టించారు. ఇదంతా రెవెన్యూ  కార్యాలయంలోని ఓ అధికారి సమక్షంలోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. 


ఆ ఒక్కచోటే  రూ.1.50 కోట్ల ముడుపులు

కమ్మూరు గ్రామంలోని సర్వే నెంబరు 539లో 24.40 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి డీ పట్టాలకు కూడా మ్యుటేషన ముసుగులో పట్టాలు సృష్టించేశారు. ప్రధాన రహదారి పక్కన ఉండటం, ఆ భూములకు డీ పట్టా నుంచి పట్టాగా మారడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది కూడా ఆర్‌హెచలో ఎంటర్‌ కాలేదు. ఇంతవరకు రిజిస్ర్టేషన కూడా కాలేదు. కానీ అధికారులు మాత్రం అడంగల్‌లో కరెక్షన చేసి డీ పట్టా నుంచి పట్టా సృష్టించేశారు. ప్రస్తుతం ఆ పట్టాను సొంతం చేసుకున్న యజమానులు అమ్మకానికి పెట్టారట. అగ్రిమెంట్‌లతో వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. సర్వే నెంబరు 499లోనూ కొంత వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇక్కడ దాదాపు 4.50 ఎకరాలకు సంబంధించి తకరారు చేసినట్లు తెలిసింది. సర్వే నెంబరు 506లో అలా పట్టాలు సృష్టించినందుకు, ఆ అధికారి రూ.60 లక్షలు డిమాండ్‌ చేశారని, రూ.40 లక్షల వరకు ముట్టిందని విశ్వసనీయ సమాచారం. ఇక సర్వే నెంబరు 539లో సైతం రూ.50 లక్షల వరకు ముడుపులు అందినట్లు సమాచారం. సర్వే నెంబరు 499తో పాటు మరికొన్నింటిలోనూ పట్టాల సృష్టికర్తకు పెద్ద మొత్తంలో ముట్టినట్లు తెలిసింది. ఇలా మొత్తం ఆ గ్రామ పరిధిలోనే రూ.1.50 కోట్ల వరకు ముడుపులు అందుకున్నట్లు సమాచారం. అదే మండలంలోని బ్రాహ్మణపల్లి, మరికొన్ని ప్రాంతాల్లో ఇదే తరహా వ్యవహారాలు నడిపారని సమాచారం. 


అంతా అక్కడే..

.భూముల్లో అక్రమాలకు పాల్పడే ఆ రెవెన్యూ అధికారి బాగా ఎంజాయ్‌ చేస్తారట. ఏకంగా తహసీల్దార్‌ కార్యాలయంలోనే తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటారని విశ్వసనీయంగా తెలిసింది. స్పందన నిర్వహించే గదిలోనే మద్యం మత్తులో మునిగి తేలుతారని అంటున్నారు. అదే గదిలోనే అసాంఘిక కార్యకలాపాలు నడుపుతారని ప్రచారం జరుగుతోంది. దీని గురించి ఆ కార్యాలయ వర్గాలు కోడై కూస్తున్నాయి. 

Updated Date - 2022-05-30T06:40:40+05:30 IST