Abn logo
Oct 30 2020 @ 01:00AM

భూమీ పటమూ ప్రజలూ

ఇరవై దేశాల బృందం జి–20 కి అధ్యక్ష స్థానంలోకి తమ దేశం వచ్చినందుకు సంతోషంతో సౌదీ అరేబియా 20 రియాల్‌ నోటును విడుదల చేసింది. ఆ నోటు మీద అచ్చువేసిన ప్రపంచపటంలో జమ్మూకశ్మీర్‌ను, లద్దాఖ్‌ను భారతదేశంలో అంతర్భాగంగా చూపలేదు. ఆ భాగాలను వేరే రంగులో ముద్రించి, తమకు చెందని ప్రాంతాలుగా వాటిని సూచించినందుకు భారతదేశం తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. జి–20లో భారత్‌, సౌదీ రెండూ సహచరదేశాలు. కాగా, పాక్‌ అధీనంలో ఉన్న గిల్గిట్‌, కశ్మీర్‌ ప్రాంతాలను ఇతర ప్రాంతాలుగా చూపారని, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఒక కార్యకర్త ఆరోపించారు. పాక్‌ ప్రభుత్వం నుంచి ఎటువంటి వ్యాఖ్యా రాలేదు. ఆ ఇరవై రియాల్‌ నోటును పరిశీలించగా, భారత్‌, పాకిస్థాన్‌ల అధీనంలో ఉన్న యావత్‌ జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌, ఆక్సాయ్‌చిన్‌ మొదలైన ప్రాంతాలన్నిటినీ రెండు దేశాలకూ చెందని వాటిగా ఇతరప్రాంతాలుగా చూపినట్టు కనిపిస్తోంది. చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతాలను చైనా భూభాగంగాను, జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌లను ఇతర ప్రాంతంగాను, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను ఒక సరిహద్దుతో వేరుచేస్తూ పాకిస్థానేతర ప్రాంతంగానూ చూపించారు. 


గత ఏడాది ఆగస్టు 5 వ తేదీన జమ్మూకశ్మీర్‌ ప్రతిపత్తిని మారుస్తూ తీసుకున్న నిర్ణయం కీలకమైనది. దీర్ఘకాలిక పర్యవసానాలు, ప్రభావాలు కలిగినది. భారతదేశానికి సంబంధించినంతవరకు కశ్మీర్‌ సమస్య పరిష్కారం దిశగా ఒక పెద్ద ముందడుగు పడిందని ప్రభుత్వం చెప్పవచ్చు. కానీ, అంతర్జాతీయ సమాజం తమ పాత వైఖరులను మార్చుకోవడానికి తగిన వాతావరణం ఏర్పడలేదనే చెప్పాలి. జమ్మూకశ్మీర్‌ ప్రాంతం యావత్తూ వివాదాస్పదమైనదన్నట్టుగా అమెరికాతో సహా పటాలను విడుదలచేస్తూ ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి గుర్తించే పటం కూడా భారతదేశానికి అసంతృప్తికరంగానే ఉంటుంది. మొన్నటివరకు సౌదీ అరేబియా ఎటువంటి పటాన్ని ప్రచురించేదో తెలియదు కానీ, గిల్గిట్‌, ముజఫరాబాద్‌ వంటివి పాక్‌ అధీనంలో ఉన్నట్టుగా చూపించే పటాన్ని ఇప్పుడు కొద్దిగా సవరించి ఉంటే మాత్రం ఆ మేరకు అది తన పూర్వ వైఖరినుంచి కదలినట్టే. కానీ, ప్రపంచం దృష్టిలో చిత్రపటాలు వాస్తవికంగా ఉండాలంటే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారాలి.


కొద్దిరోజుల కిందట గిల్గిట్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటన రాగానే భారతప్రభుత్వం అందుకు అభ్యంతరం తెలిపింది. పాక్‌ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు తమవేనని భారత్‌ గుర్తుచేసింది. హక్కును ప్రకటించుకున్నది తప్ప, వాస్తవ అధికారం అక్కడి ప్రభుత్వానికే ఉన్నది. ఎప్పటికైనా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుని తీరతాము– అని ప్రస్తుత ప్రభుత్వం సంకల్పం చెప్పుకున్నది కానీ, అది సులభమేమీ కాదు. ఆర్టికల్‌ 370ను రద్దుచేసి, జమ్మూకశ్మీర్‌ను విభజించి, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడాన్ని చైనా కూడా అభ్యంతరపెట్టింది. కశ్మీర్‌ ఆక్రమణదారుల్లో చైనా కూడా ఉన్నది. పాక్‌తో కలిసి చైనాకు అనేక ఉమ్మడి ప్రయోజనాలున్నాయి.


ప్రపంచానికి ఇది పటాల అంశం కావచ్చు. భారత్‌కు, కశ్మీరీప్రజలకు ఇదంతా భూభాగాల సమస్య మాత్రమే కాదు. భౌగోళిక రాజకీయాలు, సామ్రాజ్యవాదులు వదిలివెళ్లిన సమస్యలు, సరికొత్త విస్తరణ వాదుల ఎత్తుగడలు– వీటన్నిటితో పాటు గుర్తించవలసిన సత్యం– కశ్మీర్‌ ప్రాంతాలలో మనుషులు, ప్రజలు ఉన్నారు. తమ అనిశ్చిత వర్తమాన, భవితవ్యాల గురించి కలవరపడుతున్నారు. దశాబ్దాల తరబడి వారిది ఉద్రిక్త జీవితమే అయింది. గత ఆగస్టు 5న కేంద్రం తీసుకున్న నిర్ణయం తక్కిన భారతదేశంలో అనేకమందికి ఆనందం కలిగించి ఉండవచ్చును కానీ, జమ్మూకశ్మీర్‌ ప్రజలకు అదొక భిన్నమైన అనుభవం. ఒక రాష్ట్రం మొత్తం దిగ్బంధం చెందడం, కమ్యూనికేషన్లకు కూడా ఆస్కారం లేకపోవడం, ప్రజలతో సంబంధం ఉన్న రాజకీయవాదులందరినీ నిర్బంధించడం– ఇవి సాధారణ విషయాలు కావు. మూడేళ్ల కిందటిదాకా ఉమ్మడి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన మెహబూబా ముఫ్తీ ఏడాది పాటు నిర్బంధంలో ఉన్నారు. ప్రజలు మౌనంగా ఉన్నారు. సహనంతో ఉన్నారు. సంతోషించదగ్గ విషయం. కానీ, వారిలో పరాయిభావన పెరగడం దేశానికి మంచిది కాదు. ఇప్పటికే కశ్మీర్‌ వేదిక మీద నెత్తుటి తర్పణం చాలా జరిగింది.


జమ్మూకశ్మీర్‌లో భూములను దేశంలోని ఎవరైనా కొనుగోలు చేయవచ్చునని కేంద్రం తాజాగా జారీచేసిన ఉత్తర్వు, అక్కడి ప్రజలను మరింతగా కలవరపరచి ఉంటుంది. దేశం నుంచి విడిగా ప్రత్యేక ఏర్పాట్లతో ఉండడం వల్ల, సంలీనం కావడం కష్టమనే అభిప్రాయం ఉన్నది నిజమే కానీ, ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల, నష్టపోయే ప్రమాదమున్నందువల్ల మాత్రమే ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయన్న చరిత్రనూ అర్థం చేసుకోవాలి. సంలీనమన్నది భాగస్వాములందరి ప్రమేయంతో, మనస్ఫూర్తి భాగస్వామ్యంతో జరగాలి. కశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియను స్థాపించకుండా, ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం వివేకం కాదు. మంచినిర్ణయమని భావించే తీసుకుని ఉండవచ్చు, కానీ, ప్రజలు దాన్ని అట్లా స్వీకరించకపోతే, ఫలితం ఉండదు. ప్రభుత్వాలు, నాయకులు భవిష్యత్తుకు జవాబుదారీగా ఉండాలి.

Advertisement
Advertisement
Advertisement