చాణక్యనీతి: ఇవి లభించిన వ్యక్తికి జీవితంలో అన్నీ సమకూరినట్టే!

ABN , First Publish Date - 2022-05-04T12:30:08+05:30 IST

చాణక్య నీతిలో ఆచార్య చాణక్య.. స్వర్గాన్ని

చాణక్యనీతి: ఇవి లభించిన వ్యక్తికి జీవితంలో అన్నీ సమకూరినట్టే!

చాణక్య నీతిలో ఆచార్య చాణక్య.. స్వర్గాన్ని గురించి కలలుగనే వారి కోసం కొన్ని విషయాలు చెప్పాడు. మనిషికి తన జీవితంలో కొన్ని అంశాలు సమకూరితే అతని జీవితం స్వర్గతుల్యమవుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

విధేయుడైన కుమారుడు

విధేయుడైన కుమారుడు ఉంటే ఆ తండ్రికి భూమిపై స్వర్గం దక్కుతుందని చాణక్య నీతి చెబుతుంది. చక్కగా చూసుకునే కుమారుడు దక్కితే ఆ తండ్రి చాలా అదృష్టవంతుడు. అటువంటి తండ్రి జీవితం ఆనందంతో నిండిపోతుంది. అలాంటి వ్యక్తికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. యోగ్యమైన పిల్లలు కలిగివుండటం తల్లిదండ్రులకు స్వర్గ ప్రాప్తిలాంటిది. అలాంటి పిల్లలను చూసి తండ్రి గర్వపడతాడు.



సుఖ దుఃఖాలలో తోడుగా నిలిచే భార్య 

చాణక్యనీతిలో తెలిపిన వివరాల ప్రకారం.. భార్య సహకారం దక్కిన వ్యక్తి చాలా అదృష్టవంతుడు. భార్యాభర్తలు జీవిత రథానికి రెండు చక్రాలు. భర్తను సరిగా అర్థం చేసుకుని.. ఆపద సమయంలో అతనికి నీడలా అండగా నిలిచి, సరైన మార్గనిర్దేశం చేసి, ప్రోత్సహించే భార్య దొరికితే భర్తకు ఈ భూమి స్వర్గంగా మారుతుంది. యోగ్యురాలైన భార్య ఉన్న వ్యక్తికి భూమిపై స్వర్గం కనిపిస్తుంది. తెలివైన భార్య తన భర్త విజయంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం భార్య గొప్పదనం భర్త ఇబ్బందులు పడినప్పుడు మాత్రమే తెలుస్తుంది. 

సంపద విషయాలలో సంతృప్తి 

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం సంతృప్తి కలిగిన వ్యక్తిని దుఃఖం అంతగా చుట్టుముట్టదు. దుఃఖానికి అతి పెద్ద కారణం దురాశ. అందుకే దురాశకు దూరంగా ఉంటూ, తనకు ఉన్నదానితో సంతృప్తి చెందే వ్యక్తికి ఈ భూమిపై స్వర్గం కనిపిస్తుంది. సంపదపై దురాశ కారణంగా చాలామంది తమ ఆనందాన్ని, శాంతిని వదులుకుంటున్నారు. ఫలితంగా జీవితంలో చిక్కులు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఇవి మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దీంతో ఆ వ్యక్తికున్న సామర్థ్యం దెబ్బతింటుంది. ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.

Read more