ఎర్త్‌డ్యాం ముందు అక్రమంగా తవ్వకాలు

ABN , First Publish Date - 2022-08-16T03:39:24+05:30 IST

సోమశిల జలాశయం వద్ద అభివృద్ధి పనుల పేరిట ఇసుక అక్రమ తవ్వకాలకు తెరలేపారు. జలాశయం ముందు ఎర్త్‌డ్యాం వద్ద ఉన్న ఇ

ఎర్త్‌డ్యాం ముందు అక్రమంగా తవ్వకాలు
జలాశయం ముందు ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతులు

 అభివృద్ధి పనుల పేరిట ఇసుక తరలింపు

 జలాశయానికి పొంచి ఉన్న ముప్పు

 పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

అనంతసాగరం, ఆగస్టు 15: సోమశిల జలాశయం వద్ద అభివృద్ధి పనుల పేరిట ఇసుక అక్రమ తవ్వకాలకు తెరలేపారు. జలాశయం ముందు ఎర్త్‌డ్యాం వద్ద ఉన్న ఇసుక దిన్నెలను రాత్రిపూట తవ్వకాలు చేసి అక్రమంగా తరలిస్తున్నా జలవనరుల శాఖ ఇంజనీర్లు  పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. గడిచిన రెండేళ్ల కాలంలో సోమశిలకు భారీ వరదలు వచ్చి డ్యాం కట్టడాలు పూర్తిస్ధాయిలో ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ పనులను తర్వగా పూర్తిచేసి వచ్చే వరదల నుంచి జలాశయ కట్టడాలను పరిరక్షించేలా ప్రభుత్వం రూ.99.11 కోట్లను విడుదల చేసింది. ఈ పనుల్లో భాగంగా ఆఫ్రాన్‌లో డివైండింగ్‌ వాల్‌ నిర్మాణాన్ని కొంతకాలంగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పనులకు అవసరమైన ఇసుకను నిర్ధేశించిన ప్రభుత్వ రీచ్‌ నుంచి తెచ్చుకోవాల్సి ఉండగా నిబంధనలు ఉల్లంఘించి జలాశయం సమీపంలో ఉన్న ఇసుకను తరలిస్తూ పని కానిచ్చేస్తున్నారు. రాత్రిపూట ఎక్స్‌వేటర్‌లతో ఇసుక తవ్వకాలు జరిపి దోపిడీకి పాల్పడుతున్నారు. అయినా ఇంజనీర్లలో చలనం లేక పోవడం గమనార్హం. అభివృద్ధి పనులకు కేవలం 300 మీటర్ల దూరంలో ఇసుక దిన్నెలు ఉండడం దోపిడీ చేసేందుకు మార్గం సులభతరమైంది.


 తవ్వకాలతో ముప్పు


 భద్రతా దృష్ట్యా జలాశయం వద్ద నుంచి సుమారు 5 కిలోమీటర్ల వరకు పెన్నానదిలో ఎలాంటి తవ్వకాలు జరపకూడదు. ఈవిషయాన్ని పరిగణలోకి తీసుకొని గతంలో సోమశిల గ్రామ సమీపంలోని ఇసుక రీచ్‌ను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అయితే నిబంధనలు అతిక్రమించి జలాశయం చెంతనే ఇసుకను తోడేస్తే భవిషత్తులో సంభవించే విపత్తులకు ప్రజలు మూల్యం చెల్లించుకోల్సిన పరిస్థితి ఉంటుంది.  అయినా ఇది చాలా చిన్నవిషయంగా పరిగణించి అధికారులు నిర్లక్ష్యం వ్యవహించడం పలువురికి ఆందోళన కలిగిస్తోంది. కాంట్రాక్టర్‌ అధికారులను గుప్పిట్లో ఉంచుకోని ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. 


చర్యలు చేపట్టాం..


సోమశిల జలాశయం వద్ద ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు చేపట్టాం. వాచ్‌మన్‌ను కాపలా ఉంచడంతోపాటు రహదారి వద్ద రాళ్లు వేసి దారి మూయించి వేశాం. ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాం.

- బీ.దశరథరామిరెడ్డి, ఈఈ సోమశిల


---------------------




Updated Date - 2022-08-16T03:39:24+05:30 IST