ఉగాది తర్వాత ఆర్జిత సేవలు

ABN , First Publish Date - 2021-02-28T07:54:58+05:30 IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూ.2,937.82 కోట్ల్ల అంచనాలతో ఆమోదించినట్టు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో శనివారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో

ఉగాది తర్వాత ఆర్జిత సేవలు

ఏప్రిల్‌ 14 నుంచి భక్తులకు అనుమతి

2,937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌

శ్రీవాణి ట్రస్టు ద్వారా ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలకు ఆర్థికసాయం

టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేదపాఠశాలలు ఇకపై శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంగా మార్పు


తిరుమల, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూ.2,937.82 కోట్ల్ల అంచనాలతో ఆమోదించినట్టు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో శనివారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. గతేడాది రూ.3,309 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఈ మేరకు రివైజ్‌ చేశారు. సమావేశానంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కొత్త బడ్జెట్‌ ఆదాయాల్లో ప్రధానంగా హుండీ ద్వారా రూ.1,110 కోట్లు, ప్రసాదాల అమ్మకాలతో రూ.375 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా రూ.131 కోట్లు, అద్దెగదులు, కల్యాణమండపాల ద్వారా రూ.93 కోట్లు, ఆర్జితసేవల ద్వారా రూ.70 కోట్లు, దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.210 కోట్లు, పెట్టుబడుల ద్వారా వడ్డీ రూ.533.10 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. కాగా తిరుపతిలో నిర్మిస్తున్న గరుడవారధి పనుల కోసం బడ్జెట్‌లో రూ.50 కోట్లను కేటాయించారు. ఈ సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

  • ఏప్రిల్‌ 14 నుంచి శ్రీవారి ఆర్జితసేవలకు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి. సేవకు వచ్చే భక్తులు మూడురోజుల ముందు కొవిడ్‌ పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి.
  • టీటీడీ పరిధిలోకి ఇతర ఆలయాలను తీసుకోవడానికి విధివిధానాల రూపకల్పన. శ్రీవాణి ట్రస్టు ద్వారా ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలకు ఆర్థికసాయం.
  • టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేదపాఠశాలలకు ఇకపై శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం పేరు మార్పు.
  • ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి ట్యాంకుల సామర్థ్యాన్ని 82.4 మెట్రిక్‌ టన్నుల నుంచి 180.4 మెట్రిక్‌ టన్నుల పెంపునకు ఆమోదం.
  • తిరుమలలో క్రమంగా 50 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయం. కొండపై అన్ని వసతి సముదాయాల్లో విద్యుత్‌ వినియోగంలో జవాబుదారీతనం పెంచేందుకు ఎస్పీడీసీఎల్‌ ద్వారా విద్యుత్‌ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం.
  • త్వరలో ముంబై, జమ్మూల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి భూమిపూజకు నిర్ణయం.
  • ఆయోధ్యలో రామమందిర నిర్మాణం ట్రస్టు టీటీడీకి భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం, భజన మందిరం, వసతి సముదాయం...ఈ మూడింటిలో ఏది కోరినా నిర్మాణం చేసేలా తీర్మానం.
  • గోవును జాతీయ ప్రాణిగా గుర్తించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని నిర్ణయం. 

Updated Date - 2021-02-28T07:54:58+05:30 IST