9 కోట్లకు పైగా అమెరికన్లు.. ఇప్పటికే ఓటు వేసేశారట!

ABN , First Publish Date - 2020-11-01T07:53:25+05:30 IST

అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎర్లీ ఓటింగ్‌(ఎన్నికల తేదీ కంటే ముందుగానే ఓటు వేయడం)లో ఓటర్లు పాల్గొని తమ

9 కోట్లకు పైగా అమెరికన్లు.. ఇప్పటికే ఓటు వేసేశారట!

వాషింగ్టన్: అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎర్లీ ఓటింగ్‌(ఎన్నికల తేదీ కంటే ముందుగానే ఓటు వేయడం)లో ఓటర్లు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో నవంబర్ మూడో తేదీన జరిగే ఎన్నికలకు ముందే ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖ పార్టీలు ఓటర్లకు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో ఓటర్లు భారీ ఎత్తున ఓట్లు వేసేందుకు ముందుకొస్తున్నారు. అమెరికాలో ఎర్లీ ఓటింగ్‌లో భాగంగా ఇప్పటివరకు 9 కోట్లకు పైగా అమెరికన్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్టు యూఎస్ ఎలక్షన్స్ ప్రాజెక్ట్ తాజాగా వెల్లడించింది. నాలుగేళ్ల క్రితం ఎన్నికల తేదీ ముందు రోజు వరకు కేవలం 4.7 కోట్ల మంది మాత్రమే ఎర్లీ ఓటింగ్‌లో పాల్గొన్నారు. అంతేకాదు.. గత ఎన్నికల్లో మొత్తంగా 13.8 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటే.. ఈ సారి ఎర్లీ ఓటింగ్‌లోనే ఈ సంఖ్య దాటే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 


ఓటర్లు మెయిల్ లేదా వ్యక్తిగతంగా పోలింగ్ బూత్‌కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఎర్లీ ఓటింగ్ డెమొక్రాటిక్ పార్టీకి ఎక్కువ ప్రయోజనం చేకూర్చవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వెనుక పడ్డారని ఇప్పటికే అనేక పోల్స్ వెల్లడించాయి. ట్రంప్ కరోనాను సరిగ్గా ఎదుర్కోలేదని అమెరికన్లు భావిస్తున్నట్టు.. ఈ అంశం డెమొక్రాట్లకు లాభంగా మారనున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. మరోపక్క ఇప్పటికే దాదాపు 2 కోట్ల రిజిస్టర్డ్ డెమొక్రాట్లు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1.3 కోట్ల మంది రిజిస్టర్డ్ రిపబ్లికన్లు కూడా ఓటు వేశారు. గత ఎన్నికల్లో ఓటు వేయని చాలా మంది ఈ సారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. గత శతాబ్దంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2020-11-01T07:53:25+05:30 IST