నవంబరులో మునుగోడు ఎన్నిక!

ABN , First Publish Date - 2022-10-02T09:31:10+05:30 IST

తెలంగాణలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక నవంబరులో జరగడం ఖాయమని బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మాటల ద్వారా స్పష్టమవుతోంది.

నవంబరులో మునుగోడు ఎన్నిక!

  • పది రోజుల్లో షెడ్యూల్‌ వచ్చే అవకాశం 
  • బీజేపీ ముఖ్యులతో సునీల్‌ బన్సల్‌ వ్యాఖ్య
  • పోరుకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు 
  • దసరా తర్వాత నేతలందరిదీ మునుగోడు దారే

హైదరాబాద్‌/నల్లగొండ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక నవంబరులో జరగడం ఖాయమని బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మాటల ద్వారా స్పష్టమవుతోంది. అక్టోబరు రెండో వారంలో నోటిఫికేషన్‌, నవంబరులో ఉప ఎన్నిక ఉంటుందని.. ఈ నేపథ్యంలో అక్టోబరు 8లోపు మండలాల వారీగా సభలు, ఆర్థిక వ్యయానికి సంబంధించిన పనులు పూర్తి చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల నల్లగొండ జిల్లా నేతలకు సూచించారు. తాజాగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సునీల్‌ బన్సల్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పది రోజుల్లో ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉందని పార్టీ నేతలతో అన్నారు. 40-45 రోజుల్లో ఎన్నిక జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో నవంబరులో మునుగోడు ఉప ఎన్నిక ఖాయమని భావిస్తున్న వివిధ పార్టీల కీలక నేతలు.. దసరా తర్వాత అక్కడే మకాం వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


బీజేపీ నేతలకు బన్సల్‌ నిర్దేశం..

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి హైదరాబాద్‌లో  పార్టీ నేతలతో సునీల్‌ బన్సల్‌ సమీక్ష నిర్వహించారు. నవంబరులో ఉప ఎన్నిక జరగనున్నందున అందుకు అనుగుణంగా తక్షణ ప్రచార కార్యక్రమాలు కొనసాగించాలని ముఖ్య నేతలకు సూచించారు. ప్రతీ ఓటరును కనీసం మూడుసార్లు కలిసేలా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు. తొలుత పార్టీ స్టీరింగ్‌ కమిటీతో, తర్వాత మండల ఇన్‌చార్జ్‌లతో, అనంతరం నియోజకవర్గ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలాల వారీగా పోలింగ్‌ బూత్‌ కమిటీలపై సమీక్ష చేశారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, కులాలపై స్థానిక నేతల నుంచి వివరాలు తీసుకున్నారు. ‘‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటేనే కాంగ్రెస్‌ అన్న ముద్ర నల్లగొండ జిల్లాలో పాతుకుపోయింది. ఈ నేపథ్యంలో కమలంగుర్తును ఇంటింటికీ ప్రచారం చేయాలి’’ అని బన్సల్‌ సూచించినట్లు సమాచారం.


రూటు మార్చిన టీఆర్‌ఎస్‌..

దుబ్బాక, హుజూరాబాద్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వరుస ఓటములను విశ్లేషించుకున్న టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మునుగోడులో అందుకు భిన్నంగా ఓటర్లను కలవాలని నిర్ణయించినట్లు సమాచారం. విచ్చలవిడిగా కార్పొరేషన్‌ పదవులు, నేతల కొనుగోళ్లు, దళితబంధు లాంటి పథకాలు, ఒకరిద్దరు కీలక నేతలకే ఉప ఎన్నిక బాధ్యత వంటి వాటి జోలికి వెళ్లకూడదని నిర్ణయించారు. ఉప ఎన్నిక కోసం ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఒక మంత్రి లేదా ఎమ్మెల్యేకు బాధ్యతలు కేటాయించారు. వీరంతా స్థానికంగా ఉన్నా ఫలితం లేదని నిర్ణయించుకున్న టీఆర్‌ఎస్‌ పెద్దలు.. వారిని ఆయా ప్రాంతాలకు పంపడంలో జాప్యం చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. సీపీఐ, సీపీఎం నేతలతో గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేసి 7 నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావుల పర్యవేక్షణలో ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. 


రాహుల్‌ సభకు మునుగోడు ఓటర్లు..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన పాదయాత్ర కొన్ని రోజుల్లో రాష్ట్రానికి చేరుకోనుంది. ఈ సందర్భంగా శంషాబాద్‌లో బహిరంగ సభ పెట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. రాహుల్‌ సభకు మునుగోడు ఓటర్లను తరలించాలని కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయించారు. ఈ సభలో ఉప ఎన్నికకు సంబంధించి రాహుల్‌ పెద్దగా మాట్లాడే అవకాశం ఉండబోదని తెలిసింది. ఎక్కువ సమయం ఉపఎన్నిక గురించి ప్రసంగిస్తే.. అక్కడ ఫలితం తారుమారైతే రాహల్‌కు, పార్టీ ప్రతిష్ఠకు రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-10-02T09:31:10+05:30 IST