ఆగస్టుకల్లా వెలిగొండ తొలిదశ

ABN , First Publish Date - 2020-02-21T09:45:25+05:30 IST

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆగస్టు నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పనులు వేగంగా పూర్తిచేయడానికి

ఆగస్టుకల్లా వెలిగొండ తొలిదశ

పనుల వేగవంతానికి ‘రివర్స్‌’

గత ప్రభుత్వం ప్రాజెక్టును విస్మరించింది

ఐదేళ్లలో 600 మీటర్లే తవ్వింది

మేమొచ్చాక 1.4 కి.మీ. మేర తవ్వాం

సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి

టన్నెల్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి

మార్కాపురం, ఫిబ్రవరి 20: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆగస్టు నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పనులు వేగంగా పూర్తిచేయడానికి అవసరమైతే రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలుచేయాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన  టన్నెళ్ల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనుల వేగవంతానికి మార్చి నెలాఖరుకు రూ.184 కోట్లు, ఆగస్టు నాటికి రూ.1,600 కోట్లు మంజూరు చేస్తామని జగన్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం విస్మరించిందన్నారు.


ఆ ఐదేళ్లలో కేవలం 600 మీటర్ల తవ్వకం పనులు జరిగాయని, వైసీపీ 7 నెలల పాలనలో 1.4 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వామని.. ప్రస్తుతం మొదటి టన్నెల్‌ తవ్వకం పనులు 17.8 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయని.. ఇక కిలోమీటరు మాత్రమే తవ్వాల్సి ఉందని తెలిపారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలో కృష్ణానదిలో నీటిమట్టం తగ్గుతుందని, హెడ్‌రెగ్యులేటర్‌ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులను గతంలో నిర్ణయించిన ధరలకు చేయడం ఇబ్బందిగా ఉందని పలువురు కాంట్రాక్టర్లు తెలిపారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టులను రద్దుచేసి అవసరమైతే రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలుచేయాలని సీఎం ఆదేశించారు. నిర్వాసితులకు పునరావాస చర్యలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. పునరావాస కాలనీల ఏర్పాటు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద నష్టపరిహారం చెల్లింపు వంటివి వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. 

Updated Date - 2020-02-21T09:45:25+05:30 IST