యాచారం: పోలీసుల అదుపులో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు
యాచారం/ఆమనగల్లు/కందుకూరు/శంషాబాద్, జూలై 2: దళిత వర్గీకరణ చేయాలని, ప్రధాన మంత్రి రాకను నిరసిస్తూ శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సడక్‌బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ఎమ్మార్పీఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. యాచారంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సాగర్-హైదరాబాద్ ప్రధానరహదారిపై ధర్నాకు దిగారు. గంటపాటు ధర్నా చేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. పోలీసులు అక్కడికి చేరుకొని 18మంది కార్యకర్తలను అరెస్టు చేసి సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అదేవిధంగా ఆమనగల్లులో ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో అదుపులోకి తీసుకున్న ఎమ్మార్పీఎస్ నేతలను సాయంత్రం సొంత పూచికత్తుపై విడుదల చేసినట్లు ఎస్‌ఐలు ధర్మేశ్, హరిశంకర్‌గౌడ్, రమేశ్, వరప్రసాద్‌లు తెలిపారు. అదేవిధంగా కందుకూరులో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ముచ్చర్ల నర్సింహ, నాయకులు బి.యాదయ్య, కిష్టయ్యలను అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశారు.