సాగు ఎలా?

ABN , First Publish Date - 2020-05-23T09:46:32+05:30 IST

జిల్లా సాగునీటి వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టు కాలువలు పూర్తిగా దెబ్బతిని రైతులను వెక్కిరిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మించినప్పటి

సాగు ఎలా?

జూరాల ఎడమ ప్రధాన కాల్వకు 54 చోట్ల దెబ్బతిన్న లైనింగ్‌

రూ.4 కోట్లతో మరమ్మతు చేయాలని గతంలోనే ప్రతిపాదనలు

కాలువల మరమ్మతులు, పూడిక తీతపై నేడు సమావేశం


ఆంధ్రజ్యోతి, మే 22, వనపర్తి: జిల్లా సాగునీటి వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్టు కాలువలు పూర్తిగా దెబ్బతిని రైతులను వెక్కిరిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు సరైన రీతిలో మరమ్మతులు చేపట్టకపోవడం, పూడిక తొలగింపు చేయకపోవడంతో పొలాలకు నీరందడం కష్టంగా మారింది. మరమ్మతులు చేయాలని రైతులు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది. అసలే పూడికతో ప్రాజెక్టు సామర్థ్యం పేరుకుపోతున్న ఏటికేడు తగ్గుతోంది. దీంతోపాటు కాల్వల పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో చివరి ఆయకట్టు వరకు నీరందించలేని పరిస్థితి ఉంది.


గతంలో మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి జూరాల ఎడమ ప్రధాన కాల్వను పరిశీలించి.. 54 చోట్ల లైనింగ్‌ దెబ్బతిన్నట్లు గుర్తించారు. మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటివరకు అది ఆచరణకు నోచుకోలేదు. పీజేపీ అధికారులు రూ.4 కోట్లతో లైనింగ్‌, పూడికతీత పనులు చేపట్టాలని ప్రతిపాదనలు పంపించారు. మరో నెల రోజుల్లో ప్రాజెక్టుకు వరద మొదలు కాబోతోంది. కాల్వలు ఇలాగే ఉంటే చివరి ఆయకట్టులో ఉన్న వీపనగండ్ల, చిన్నంబావి మండలాలతో పాటు పెబ్బేరు, శ్రీరంగాపూర్‌ మండలాల్లోని పిల్ల కాలువల కింద కూడా నీరందించలేని పరిస్థితి ఏర్పడనుంది. ఎడమ కాలువ మొత్తం 100 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా.. డిస్ర్టిబ్యూటరీలు, పిల్ల కాలువల్లో భారీగా పూడిక పేరుకుపోయింది.


గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా పరిషత్‌ సమావేశంలో కూడా సభ్యులంతా ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పిల్ల కాలువలు, డిస్ర్టిబ్యూటరీల్లో పూడికను ఉపాధిహామీ పథకం ద్వారా తొలగించాలని, కాలువలు ఉన్న గ్రామాల్లో మొదటి ప్రాధాన్యంగా పూడికతీత పనులను పెట్టుకోవాలని తీర్మానం చేశారు. ఆత్మకూరు, అమరచింత మండలాల్లో ఇప్పటికే పూడికతీత పనులు ఉపాధిహామీ ద్వారా మొదలయ్యాయి. జూరాల కాలువల కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు నీరందించాలంటే ప్రాజెక్టులో ఉన్న పూడికను కూడా విడతలవారీగా తొలగించాలనే అభిప్రాయం కూడా ఉంది.


ప్రాజెక్టులో మూడు టీఎంసీల మేర పూడిక ఉంది. దాంతో ఎగువ నుంచి వరద ఉధృతంగా వస్తున్నా.. అందుకు తగ్గట్లుగా నిల్వ చేసుకోవడానికి అవకాశం లేకుండా పెయింది. రబీలో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉండటం లేదు. కాలువల మరమ్మతులపై సాగునీరు, ఆయకట్టు అభివృద్ధి శాఖ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో లైనింగ్‌ మరమ్మతులు, ప్రధాన కాలువలో పూడిక తొలగింపునకు నిధులు మంజూరయ్యే విదంగా ప్రయత్నించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-05-23T09:46:32+05:30 IST