మునుగోడుకు కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-10-05T08:22:33+05:30 IST

మానని గాయంలా సలుపుతున్న హుజూరాబాద్‌ ఓటమి..

మునుగోడుకు కేసీఆర్‌

  • పండగ తర్వాత కదనరంగంలోకి గులాబీ దండు
  • ఎలాగైనా ఈ ఎన్నికలో గెలిచి తీరాలన్న పట్టుదల
  • ఒక్కో ఎంపీటీసీ పరిధి ఒక్కో యూనిట్‌గా విభజన
  • మొత్తం నియోజకవర్గంలో 86 యూనిట్ల గుర్తింపు
  • ఒక్కొక్క యూనిట్‌ బాధ్యతా ఒక్కొక్క కీలక నేతకు
  • వారి కింద ప్రతి 50 ఓట్లకూ ఒక నేత కేటాయింపు
  • నియోజకవర్గంలో ఒక గ్రామం బాధ్యత కేసీఆర్‌కు
  • కేటీఆర్‌, హరీశ్‌ సహా పన్నెండు మంది మంత్రులు, 
  • 76 మంది ఎమ్మెల్యేలు రేపటి నుంచి అక్కడే
  • ప్రతి ఎమ్మెల్యే తమ వెంట కీలకమైన 15 మంది
  • నేతలను మునుగోడుకు తీసుకెళ్లాలని ఆదేశం
  • కీలక నేతలతో భేటీ అయి చర్చించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, నల్లగొండ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మానని గాయంలా సలుపుతున్న హుజూరాబాద్‌ ఓటమి.. ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మనుగడకే ముప్పు వస్తుందన్న ఆందోళన నేపథ్యంలో.. మునుగోడులో గెలుపును సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎంతగా అంటే.. ఆ నియోజకవర్గంలో ఒక గ్రామం బాధ్యతను తానే స్వయంగా తీసుకునేంత!! అంతేకాదు.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి హరీశ్‌ రావు సహా.. 12 మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దింపాలని నిర్ణయించారు. నియోజకవర్గంలోని ఒక్కో ఎంపీటీసీ పరిధిని ఒక్కో యూనిట్‌గా విభజించి.. ఆ యూనిట్ల బాధ్యతలను ఒక్కో నేతకు అప్పగించారు. ఒక్కో ఎంపీటీసీ పరిధిలో సుమారు 2500 నుంచి 3 వేల దాకా ఓట్లు ఉంటాయి. ఒక్కోచోట ఒక గ్రామమే ఒక ఎంపీటీసీ యూనిట్‌గా ఉంటే.. మరికొన్ని చోట్ల రెండు, మూడు గ్రామాలు కలిపి ఒక్కో యూనిట్‌గా ఉన్నాయి. నియోజకవర్గంతా కలిపి ఇలాంటి యూనిట్లు మొత్తం 86 ఉన్నట్టు టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఒక యూనిట్‌కు సీఎం కేసీఆర్‌, మరొకదానికి కేటీఆర్‌, ఇంకొక దానికి హరీశ్‌.. ఇలా నేతలందరూ తమకు కేటాయించిన యూనిట్లలో ప్రతి ఓటూ పార్టీకే వచ్చేలా కృషి చేయాల్సి ఉంటుంది.


అది కూడా ఏ యూనిట్‌లో ఏ సామాజికవర్గం వారు ఎక్కువగా ఉంటే.. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఆ యూనిట్‌ బాధ్యత ఇచ్చారు. హరీశ్‌రావుకు మర్రిగూడ మండల కేంద్రాన్ని కేటీఆర్‌కు గట్టుప్పల మండల కేంద్రాన్ని, ఎర్రబెల్లికి చండూరు మునిసిపాలిటీలోని రెండు వార్డులు, ఎమ్మెల్యే ఎల్‌ రమణకు మరో రెండు వార్డులను అప్పగించినట్టు తెలుస్తోంది. మళ్లీ ఈ నేతలందరి కిందా ప్రతి 50 ఓట్లకూ ఒక నాయకుడిని నియమించాలని నిర్ణయించారు. అంటే.. దాదాపు నియోజకవర్గంలో ప్రతి 10-15 కుటుంబాలకూ ఒక నేత బాధ్యుడుగా ఉంటారన్నమాట. అంతేకాదు.. యూనిట్‌ బాధ్యత తీసుకునే ప్రతి ఎమ్మెల్యే తనతోపాటు.. గతంలో ఎన్నికల్లో తమ గెలుపు కోసం పనిచేసిన అనుభవం ఉన్న అత్యంత కీలకమైన 15 మంది అనుచరులను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. మునుగోడులో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత వారిపైన కూడా ఉంటుంది. ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి అనుచరులను తరలించడం ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


హడావుడిగా సమావేశం..

జాతీయ పార్టీ ఏర్పాటులో కొంతకాలంగా బిజీగా ఉన్న సీఎం కేసీఆర్‌.. ఉప ఎన్నికకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో మునుగోడుపై దృష్టి సారించారు. దుబ్బాక, హుజూరాబాద్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన అనుభవాల దృష్ట్యా.. మునుగోడులో ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకుండా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని, గెలిచి తీరాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు మంగళవారం  ఆయన పార్టీ కీలక నేతలతో ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌ రెడ్డి, నల్గొండ జిల్లా పార్టీ ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. నిజానికి ఆ సమయంలో మంత్రి హరీశ్‌ వేరే కార్యక్రమంలో ఉన్నా.. ఈ సమావేశం కోసం హడావుడిగా పిలిపించారు. మునుగోడు ఉప ఎన్నిక అత్యంత కీలకమైనదని.. ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని సీఎం కేసీఆర్‌ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అండగా ఉంటాయని.. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమరుపాటు లేకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని నిర్దేశించారు.

 

టీఆర్‌ఎస్‌ పేరుతోనే..

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆ పేరుతోనే పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పేరును బీఆర్‌ఎ్‌సగా మారుస్తూ తీర్మానం చేసినా.. కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని ఎంత తొందరగా ఆమోదిస్తుందనే దానిపై స్పష్టత లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 29 ఏ (9) ప్రకారం.. ఒక రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీ పేరు మార్చుకుంటే దాన్ని సత్వరమే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, ఆ పేరును ఆమోదించేందుకు కాలపరిమితి అంటూ ఏమీ చెప్పలేదు. కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని ఒక్కరోజులోనే ఆమోదించవచ్చు.. లేదా కొన్ని రోజుల తర్వాతైనా ఆమోదించవచ్చు. మునుగోడులో నామినేషన్ల దాఖలు గడువు ఈ నెల 14. టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మార్పుపై తీర్మానాన్ని 6వ తేదీన ఎన్నికల సంఘానికి సమర్పించనుంది. అప్పటి నుంచి 14 లోగా.. అంటే ఎనిమిది రోజుల్లోగా అది ఆమోదం పొందితే సరి. లేకుంటే ఈ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పేరు మీదనే వెళ్లేందుకు పార్టీ సిద్ధమవుతోంది.


అభ్యర్థి.. కూసుకుంట్లే!

ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరు ప్రకటించడం లాంఛనప్రాయమేనని.. అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఇతర నేతలతో కూడా ఒకసారి మాట్లాడి ఆయన పేరును ప్రకటిస్తారని అంటున్నారు. అయితే, పార్టీ ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించకపోయినా కూసుకుంట్ల చాలారోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాగా.. నామినేషన్ల ఘట్టం ముగిసి ప్రచారపర్వం పతాకస్థాయికి చేరాక నియోజకవర్గంలో మరో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

Updated Date - 2022-10-05T08:22:33+05:30 IST