జూన్‌ నెలాఖర్లో ఎంసెట్‌, ఈసెట్‌..జూలైలో డిగ్రీ వార్షిక పరీక్షలు

ABN , First Publish Date - 2021-01-24T08:06:48+05:30 IST

రాష్ట్రంలో ఈసారి ఉన్నత విద్యాసంస్థల ప్రారంభం ఆలస్యమైనప్పటికీ ప్రత్యేక ప్రణాళికతో విద్యాసంవత్సరాన్ని విజయవంతంగా ముగిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు

జూన్‌ నెలాఖర్లో ఎంసెట్‌, ఈసెట్‌..జూలైలో డిగ్రీ వార్షిక పరీక్షలు

డిగ్రీ కాలేజీల్లో 5 నెలలపాటు ప్రత్యక్ష తరగతులు 

ఉదయం ఆర్ట్స్‌.. సాయంసాయంత్రం సైన్స్‌ క్లాసులు  

రాష్ట్రంలో ‘చాయిస్‌ బేస్డ్‌  అమెరికా వెళ్లే విద్యార్థులకు 

క్రెడిట్‌ సిస్టం’ విజయవంతం 

త్వరలో ఈడబ్ల్యూఎస్‌ విధివిధానాలు ఖరారు 

రాష్ట్ర ఉన్నత విద్యామండలి 

అధ్యక్షుడు తుమ్మల పాపిరెడ్డి

‘ఆటా’ సహకారం 

‘‘ఆంధ్రజ్యోతి’’కి ప్రత్యేక ఇంటర్వ్యూ 


హైదరాబాద్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈసారి ఉన్నత విద్యాసంస్థల ప్రారంభం ఆలస్యమైనప్పటికీ ప్రత్యేక ప్రణాళికతో విద్యాసంవత్సరాన్ని విజయవంతంగా ముగిస్తామని  రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఒకవైపు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూనే కరోనా నిబంధనలకు అనుగుణంగా కళాశాలల్లో తరగతులనూ సమర్థంగా నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 1న ఉన్నత విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కళాశాలల్లో తరగతుల నిర్వహణ, పరీక్షలు, ఈడబ్ల్యూఎస్‌ అమలుతో పాటు వివిధ అంశాలపై ఉన్నత విద్యామండలి చేస్తున్న ఏర్పాట్లను ‘‘ఆంధ్రజ్యోతి’’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  వివరించారు. 


ఈ 5 నెలల కోసం ప్రత్యేక ప్రణాళిక

రాష్ట్రవ్యాప్తంగా 6.3 లక్షల మంది డిగ్రీ విద్యను అభ్యసిస్తున్నారు. ఏటా వీరికి వార్షిక పరీక్షలు ఏప్రిల్‌లో ప్రారంభమై మే మొదటివారంలో ముగిసేవి. ఈసారి ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇంతవరకు ఆన్‌లైన్‌ తరగతులే కొనసాగాయి. ప్రత్యక్ష తరగతులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈసారి జూన్‌ వరకు డిగ్రీ తరగతులు నిర్వహించాలని నిర్ణయించాం. ఈ ఐదు నెలల కాలంలో తరగతుల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఒకేసారి తరగతులను ప్రారంభించనున్నాం. ఉదయం బీఏ, బీకాం విద్యార్థులకు, మధ్యాహ్నం నుంచి బీఎస్సీ విద్యార్థులకు తరగతులు ఉంటాయి. సామాజిక దూరం పాటిస్తూ తరగతుల నిర్వహణ ఉంటుంది.


అన్ని యూనివర్సిటీల హాస్టళ్లను కూడా ప్రారంభించనున్నాం. హాస్టళ్లలో శానిటైజేషన్‌ లాంటి వాటికి కావాల్సిన నిధులను అన్ని వర్సిటీలకు అందిస్తున్నాం. ఈసారి విద్యార్థులు తరగతులకు హాజరుకావాలన్న తప్పనిసరి నిబంధన ఏమీలేదు. హజరయ్యేవారు మాత్రం తల్లిదండ్రుల అంగీకార పత్రం, లేదా స్వీయ అంగీకారపత్రం సమర్పించాల్సి ఉంటుంది. కాలేజీకి రానివారు ఆన్‌లైన్లో కొనసాగే తరగతులను వీక్షించవచ్చు. డిగ్రీతో పాటు ఇంజినీరింగ్‌ తరగతుల్లోనూ ఫైనలియర్‌ విద్యార్థులకు ప్రాధాన్యమిస్తాం. ఫైనలియర్‌ ముగిసిన వెంటనే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిపై ఎక్కువగా దృష్టి పెట్టాం. ఇంజినీరింగ్‌ వారికి ఫైనలియర్‌ పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తున్నాం. 


ఈడబ్ల్యూఎ్‌సతో అదనంగా 10% సీట్లు 

ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి విద్య, ఉపాధి రంగాల్లో 10శాతం కల్పించే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా ఉన్నత విద్యలోని అన్ని కోర్సుల్లో 10శాతం సీట్లు అదనంగా వస్తాయి. యునివర్సిటీ హాస్టళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20వేలకు పైగా సీట్లు ఉండగా.. అదనంగా మరో 2వేల మందికి అవకాశం లభిస్తుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలుచేస్తాం. విధివిధానాలకు సంబంధించి మార్గదర్శకాలను త్వరలో ప్రకటిస్తాం. 


జూన్‌ నుంచే సెట్‌లు 

నిరుడు ఎంసెట్‌తో పాటు ఇతర సెట్‌ పరీక్షలు ప్రారంభించడంలో జాప్యం కావడంతో కౌన్సెలింగ్‌ కూడా ఆలస్యమైంది. గత ఏడాది నిర్వహించిన లాసెట్‌, పీజీఈసెట్‌, ఐసెట్‌ పరీక్షల కౌన్సెలింగ్‌ కొనసాగుతోంది. ఫిబ్రవరి-15లోపు పూర్తిచేస్తాం. మే లోపు ఇంటర్‌ పరీక్షలు పూర్తవుతాయి. జేఈఈ మెయిన్‌ కూడా మేలో ముగుస్తాయి. దీంతో ఎంసెట్‌ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌లో విడుదలచేసి జూన్‌ ఆఖర్లో పరీక్ష నిర్వహించాలని అనుకుంటున్నాం. ఈసెట్‌ కూడా జూన్‌ ఆఖర్లోనే నిర్వహిస్తాం. జూలై నుంచి ఇతర సెట్‌ పరీక్షలు ఉంటాయి. వీటికి సంబంధించిన కన్వీనర్ల నియామకం త్వరలో ఉంటుంది.


విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 

డిగ్రీ పూర్తయినవెంటనే ఉద్యోగాలు లభించాలంటే విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు అత్యంత కీలకం. ఇందుకుగాను ఈ విద్యా సంవత్సరంలో ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎ్‌సతో ఒప్పందం కుదుర్చుకున్నాం. డిగ్రీ విద్యార్థులకు ఫిబ్రవరిలో టీసీఎస్‌ ప్రతినిధులు శిక్షణ అందిస్తారు. విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా చదువు ఉండాలన్న లక్ష్యంగా ఈసారి చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌) విధానాన్ని అమలుచేశాం. దీనిద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉన్నతవిద్య కోసం అమెరికాకు వెళ్లిన విద్యార్థులు మోసాలబారిన పడుతున్న కేసులు ఈ మధ్య జరిగాయి. కొందరు విద్యార్థులు జైలుకు కూడా వెళ్లారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) సహకారం తీసుకుంటున్నాం. 

Updated Date - 2021-01-24T08:06:48+05:30 IST