విలీనంతో ఖాళీ

ABN , First Publish Date - 2022-08-05T05:46:30+05:30 IST

జిల్లాలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 519 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయగా మారాయి. నూతన విద్యావిధానం అమల్లో భాగంగా 3, 4, 5 తరగతులకు చెందిన సుమారు 1.20 లక్షల మంది విద్యార్థులు కిలోమీటర్‌ దూరంలోని ఉన్నత పాఠశాలల్లో చేరిపోయారు. వారితో పాటు సీనియర్‌ సెకండరీ గ్రేడ్‌ టీచర్లూ వెళ్లిపోయారు. దీంతో ప్రాథమిక పాఠశాలలు ఖాళీ అయ్యి ఏకోపాధ్యాయగా మారుతున్నాయి.

విలీనంతో ఖాళీ

- జిల్లాలో 519 పాఠశాలల్లో ఒక్కో ఉపాధ్యాయుడే దిక్కు
- బోధనలో తప్పని ఇబ్బందులు
- సెలవు పెడితే అంతే సంగతులు
(ఇచ్ఛాపురం రూరల్‌)

పై చిత్రంలోని పాఠాలు బోధిస్తున్నది ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. ఈ పాఠశాలలో గతంలో 1 నుంచి 5 తరగతులకు చెందిన 105 మంది విద్యార్థులు ఉండేవారు. వారికి ముగ్గురు ఉపాధ్యాయులు పాఠాలు బోధించేవారు. ప్రభుత్వం నూతన విద్యావిధానం వలన 3, 4, 5 తరగతులను పక్కన ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీంతో ఇద్దరు ఉపాధ్యాయులు హైస్కూల్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం 21 మంది విద్యార్థులతో ఏకోపాధ్యాయ పాఠశాలగా మిగిలింది.

..ఇలా జిల్లాలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 519 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయగా మారాయి. నూతన విద్యావిధానం అమల్లో భాగంగా 3, 4, 5 తరగతులకు చెందిన సుమారు 1.20 లక్షల మంది విద్యార్థులు కిలోమీటర్‌ దూరంలోని ఉన్నత పాఠశాలల్లో చేరిపోయారు. వారితో పాటు సీనియర్‌ సెకండరీ గ్రేడ్‌ టీచర్లూ వెళ్లిపోయారు. దీంతో ప్రాథమిక పాఠశాలలు ఖాళీ అయ్యి ఏకోపాధ్యాయగా మారుతున్నాయి. చాలా ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 1, 2 తరగతుల విద్యార్థులతో నడిచే పరిస్థితి ఏర్పడింది. 30 మందిలోపు విద్యార్థులుండే పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉండాలనే నిబంధనను కొత్తగా విధించారు. దీంతో జిల్లాలో 1928 ప్రాథమిక పాఠశాలలు ఉంటే.. అందులో 519 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఇక అంతే సంగతులు. పాఠశాలకు ఒకే ఉపాధ్యాయుడు దిక్కవడంతో పని ఒత్తిడి పెరిగి.. ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యార్థులందరికీ ఒకే సమయంలో బోధన, చదివించడం, రాయించడం, బోధనోపకరణాలను వినియోగించడం వంటివి సాధ్యం కావడం లేదని కొంతమంది ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

ఎస్జీటీలకు ప్రమోషన్లు ఎప్పుడు..? :
3, 4, 5 తరగతుల విద్యార్థులు ఉన్నత పాఠశాలల్లో చేరారు. 3 నుంచి 10వ తరగతి వరకూ స్కూల్‌ అసిస్టెంట్లతోనే బోధన చేయాలని ప్రభుత్వం తాజాగా పేర్కొంది. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో వందలాది సెకండరీగ్రేడ్‌ టీచర్లు పనిచేస్తున్నారు. తాజా నిబంధనల ప్రకారం వీరికి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి  కల్పిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకమవుతోంది. అలాగే జిల్లాలో కొన్ని ఉన్నత పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లను జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది.

అంగన్‌వాడీలు విలీనమయ్యేనా?
జిల్లాలో 1, 2 తరగతులు ఉండే ప్రాథమిక, పౌండేషన్‌ పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాల విద్యార్థులను ఇంకా  విలీనం చేయలేదు. అలాగే వందలాది ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు ఉన్నా.. భర్తీ చేసే పరిస్థితి లేదు. 117 జీవో ప్రకారం రేషనలైజేషన్‌ వల్ల కొన్ని ఉపాధ్యాయుల పోస్టులు సర్దుబాటు ప్రక్రియలోకి వచ్చేశాయి. ఇలా విద్యారంగంలో  మార్పుల వల్ల విద్యా ప్రమాణాలు సాధించడం కష్టసాధ్యంగా మారింది.  ఇదే తరహా విద్యావిధానం ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగితే ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు కనుమరుగై పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇబ్బందులు లేకుండా
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను నియమిస్తాం. అక్కడ ఉపాధ్యాయుడు సెలవు పెడితే పక్క పాఠశాల నుంచి ఉపాధ్యాయుడిని నియమించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తాం.   
- జి.పగడాలమ్మ, డీఈవో, శ్రీకాకుళం.

 

Updated Date - 2022-08-05T05:46:30+05:30 IST